Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదీ- షీ జిన్‌పింగ్ సమావేశం: చిన్న పట్టణం మహాబలిపురాన్నే ఎందుకు ఎంచుకున్నారు

Advertiesment
మోదీ- షీ జిన్‌పింగ్ సమావేశం: చిన్న పట్టణం మహాబలిపురాన్నే ఎందుకు ఎంచుకున్నారు
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (12:40 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు క్జి జిన్‌పింగ్ తమిళనాడులోని చెన్నై శివారులో ఉన్న చారిత్రక తీరప్రాంతం మహాబలిపురంలో అక్టోబర్ 11న సమావేశం అవుతున్నారు. రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం మధ్యాహ్నం 2.10 గంటలకు జిన్‌పింగ్ చెన్నై చేరుకుంటారు. ఆ తర్వాత 4.55 కు మహాబలిపురంలో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతారు.

 
అనంతరం ఇక్కడి తీరప్రాంత ఆలయాలు, అర్జునుడి తపస్సు శిల్పం, కృష్ణుడి వెన్న బంతి లాంటి పర్యటక ప్రదేశాలను వారు సందర్శిస్తారు. మరి, భారత ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబయిని కాదని, ఈ సమావేశానికి మహాబలిపురంను ఎంచుకోవడానికి కారణమేంటి? చెన్నై నుంచి ఈస్ట్‌ కోస్ట్ రోడ్డులో 62 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం ఉంది. పల్లవుల కాలం నాటి ఏకశిలా రథం, అరుదైన శిల్పాలు, గుహ ఆలయాలు లాంటి యునెస్కో వారసత్వ ప్రదేశాలున్న మహాబలిపురం, తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.

 
ఈ ప్రాంతంలో భద్రతను క్రమంగా పెంచారు. 16.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ చిన్న పట్టణంలోని రోడ్లన్నిటికీ మరమ్మతులు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ‌నిషేధించారు. ప్రధాన రహదారులన్నీ సీసీటీవీ నిఘా నీడలోకి తెచ్చారు. హోటళ్లు, లాడ్జీలు, రిసార్టుల్లో ఉంటున్న వారి వివరాలను స్థానిక పోలీసులు సేకరించారు. సముద్రంలో సర్ఫింగ్‌ను కూడా నియంత్రించారు.

 
అక్టోబర్ 4 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి ప్రవేశించవద్దని అధికారులు సూచించారు. భద్రతను చూసేందుకు 500 మందికి పైగా పోలీసులను మోహరించారు. సెప్టెంబర్ 20 లోపే చైనా రాయబార కార్యాలయానికి చెందిన అధికారులు మహాబలిపురంను సందర్శించారని స్థానిక మీడియా తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిసామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం గత బుధవారం మహాబలిపురంను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
webdunia
మహాబలిపురం
పర్యాటకులు, చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారు చూసేందుకు మహాబలిపురంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి.

 
1. వరాహ ఆలయం
ఈ ఆలయంలో ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ వరాహ శిల్పం ఉన్నందున దీనిని వరాహ ఆలయం అని పిలుస్తారు. అయితే, ఈ ఆలయం నరసింహ స్వామి కోసం నిర్మించినది అని కూడా చెబుతుంటారు. గోడ మీద వరాహ శిల్పం కూడా ఉంది.

 
2. అర్జునుడి తపస్సు శిల్పం
ఈ భారీ శిల్పం స్థలసాయన పెరుమాల్ ఆలయం వెనుక ఉంది. ఒక భారీ శిల మీద దీనిని చెక్కారు. 30 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు ఉండే ఈ శిల్పాన్ని, అర్జునుడి తపస్సు, భగీరథ తపస్సు అంటారు.

 
3. రథ ఆలయాలు
సాధారణంగా వీటిని పాండవుల దేవాలయాలు అని పిలుస్తారు. ఐదుగురు పాండవుల కోసం ఈ ఆలయాలను నిర్మించారని చాలామంది చెబుతారు. కానీ, అందుకు ఆధారాలుగా ఎలాంటి శిల్పాలు లేవు. శివుడు, విష్ణువు, కోట్రవాయి(దేవత)ల ఆలయాలని కొందరు అంటారు. ఒక్కో ఆలయాన్ని ఒక్కో ప్రత్యేక శైలిలో నిర్మించారు.

 
4. తీరంలో ఆలయాలు
ఇక్కడ సముద్ర తీరంలో రెండు ఆలయాలు ఉన్నాయి. వాటిని నరసింహ వర్మ- II (రాజసింహ) కట్టించారు. 2004లో తమిళనాడు తీరాన్ని సునామీ ముంచెత్తినప్పుడు, ఈ ఆలయాల్లోకి నీరు ప్రవేశించినప్పటికీ, పెద్దగా నష్టం జరగలేదు. ఈ ఆలయ గర్భగుడిలో ఒక శివలింగం ఉంది.
తమిళనాడులో యునెస్కో వారస్వత సంపదగా గుర్తించిన మూడు ప్రదేశాలలో మహాబలిపురం ఒకటి. "తమిళనాడులో సాంస్కృతికంగా ఈ పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇటుకలు, కలపకు బదులుగా, రాళ్లతో ఆలయాలు నిర్మించడం మహాబలిపురం నుంచే ప్రారంభమైంది" అని తమిళ మరబు ట్రస్ట్‌కు చెందిన ఆర్.గోపు చెప్పారు.

 
పాండవ రథాలు, అర్జునుడి తపస్సు శిల్పం, సముద్ర తీరంలో ఉన్న ఆలయం, కృష్ణుడి వెన్న బంతి, గుహలా ఉండే ఆలయాలు మహాబలిపురంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు. "భారత్‌లో చాలా గుహలా ఉండే ఆలయాలు ఉన్నాయి. శిల్పాలు, ఇటుకలు, రాళ్లతో నిర్మించిన ఆలయాలు చాలా ఉన్నాయి. మహాబలిపురానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అన్ని రకాల ఆలయాలూ ఉన్నాయి" అని గోపు చెప్పారు.

 
క్రీ.శ. 630 నుంచి క్రీ.శ 680 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన నరసింహ వర్మ I కాలంలో మహాబలిపురంను నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. కానీ, ఆయన పాలనలో ఈ పట్టణ నిర్మాణం పూర్తి కాలేదని, మహేంద్ర వర్మ- II, పరమేశ్వర వర్మల పాలనా కాలంలో పూర్తయిందని అంటుంటారు.

 
ఈ సమావేశం మహాబలిపురంలోనే ఎందుకు?
భారతదేశ విదేశీ వ్యవహారాల విషయంలో తమిళనాడుకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అన్నదానికి విదేశాంగ శాఖ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంతకు ముందు, 2018 ఏప్రిల్ 27న ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్ చైనాలోని ఉహాన్‌లో సమావేశం అయ్యారు. 2017లో డోక్లాం వివాదం తర్వాత తలెత్తిన ఉద్రిక్తతలు ఆ సమావేశం తర్వాత సద్దుమణిగాయి. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న సమావేశం ఇదే.

 
"భారతదేశం సార్క్ దేశాల కంటే, బంగాళాఖాతం చుట్టుపక్కల ఉన్న దేశాలపై దృష్టి పెట్టాలని అనుకుంటోంది. బంగాళాఖాతంలోనూ తన ఆధిపత్యాన్ని చాటాలనుకుంటోంది. అందుకే బంగాళాఖాతం తీరంలో ఉన్న ప్రాంతాన్ని ఈ సమావేశం కోసం ఎన్నుకుంది" అని తన్నాచి తమిజాగం కో-ఆర్డినేటర్, "పుతియా వల్లరసు చైనా" పుస్తకం రచయిత, ఆళి సెంథిల్ నాథన్ వివరించారు. అయితే, సీనియర్ జర్నలిస్టు ఆర్‌.కె.రాధాకృష్ణన్ అభిప్రాయం పూర్తి విరుద్ధంగా ఉంది.

 
ఇది రాజకీయం. తమిళనాడును ఆకర్షించాలని బీజేపీ అనుకుంటోంది. అందుకోసమే ఇప్పుడు ఈ సమావేశానికి తమిళనాడును ఎంచుకున్నారు. ప్రధానమంత్రి మోదీ ఎక్కడికి వెళ్లినా తమిళంలో మాట్లాడటం, తమిళంను పొగడటం కూడా దానికోసమే. దానికి మించి, ఈ సమావేశం తమిళనాడులో జరగడానికి మరే దౌత్యపరమైన కారణమూ లేదు" అని ఆయన అన్నారు.

 
"ఒకవేళ బంగాళాఖాతంలో ఆధిపత్యాన్ని చూపించాలని భారత్ అనుకుంటే, వాళ్లు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నంను ఎంచుకునేవారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పడానికి మాత్రమే ఇది" అని రాధాకృష్ణన్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాయిలెట్ సెల్ఫీ తీసుకో... రూ.51 వేల నగదు అందుకో.. ఎంపీ సర్కారు బంపర్ ఆఫర్