Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన్మథుడు 2: ‘అడల్ట్ కామెడీ తీస్తున్నామని అనుకుని ఉంటారా, ఏమో!’ - సినిమా రివ్యూ

webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (21:30 IST)
పదిహేడేళ్ల క్రితం వచ్చిన మన్మథుడు వికారం కలిగించలేదు. వినోదమే పంచాడు. ఆ సినిమాలోని బ్రహ్మానందం జోకులు ఇప్పటికీ గుర్తే. దాని సీక్వెల్ అంటే ఎలా ఉంటుందోనని ఆశపడి వెళ్లడం మానవసహజం. కానీ, ఆ ఆశలకు చాలా దూరంగా ఉందీ సినిమా.

 
ప్రేక్షకులను(ఏకవచనం వాడదామంటే జెండర్ న్యూట్రల్ పదం తెలుగులో దొరకడం లేదు) మొదట దేనితోనొ ఆకట్టుకుని ఆనక మరేమో చూపించే వక్రమార్గమును ఈ సినిమా వారు ఎంచుకొనలేదు. రుజుమార్గమునే పయనించినారు. ఆరంభ సన్నివేశంలోనే తమ ఉద్దేశ్యమేమిటో ప్రకటించినారు. ఎలా ఉండబోతోందో మొదట్లోనే అర్థం అవుతుంది గానీ ఎందుకు తీశారో అనే అయోమయం సినిమా అయిపోయాక కూడా అయోమయంగానే ఉండిపోతుంది.

 
బహుశా అడల్ట్ కామెడీ తీస్తున్నామని అనుకుని ఉంటారా, ఏమో! పెరిగిన మధ్యతరగతి అడల్ట్ కామెడీని ఆదరిస్తుందని అనుకుని ఉండొచ్చు. కానీ ఎంత అడల్ట్ కామెడీ అయినా మరీ ఇంత మేల్ సెంట్రిక్గా క్రూడ్‌గా ఉండనక్కర్లేదు. ''ఐడోంట్ ఫాల్ ఇన్ లవ్, ఐ వోన్లీ మేక్ లవ్'' అని హీరోయిజం చూపించారు కదా, పోనీ ఆ భావనను అయినా కాస్త లోతుగా చర్చించారా అంటే లేదు. ''ఒకపూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను'' అనేంత దూరం వెళ్లారు కదా, అలా అనుకునే వారి గురించి లోతుగా చూపించారా అంటే లేదు. అన్ని డైలాగులు మేల్ ఇగోను మాగ్నిఫై చేసి 70 ఎంఎంలో చూపించడానికే. ఇలాంటి సినిమా నుంచి సందేశాలు ఆశించలేం కానీ కనీసం ఆరోగ్యకరమైన ఎంటర్‌టైన్‌మెంట్ అయినా ఉందా అనేదే ప్రశ్న.

 
కథ విషయానికి వస్తే అదేదో గ్రీసు దేశంలో మధ్యవయస్కుడైన శాం(నాగార్జున)ఒక వెర్రిబాగులవాడైన అసిస్టెంటు(వెన్నెల కిషోర్ )తో కలసి పర్ఫ్యుములు తయారు చేస్తూ కనపడిన ఆడపిల్లలనల్లా చాకచక్యంగా కమిట్ చేస్తూ చూడలేనంత పడగ్గది సన్నివేశాలూ, వినలేనంత సంభాషణతో సరదాగా జీవితం గడుపుతూ ఉంటాడు. పెద్ద హీరోల రిచ్‌నెస్ చూపించడానికి ఈ దేశంలో లొకేషన్లు సరిపోవనే ఆలొచన మొదలై చాలాకాలమే అయ్యింది కాబట్టి గ్రీసులో లాజిక్ వెతుక్కోనక్కర్లేదు. అర్థం చేసుకోవచ్చు. 
webdunia

 
అలాగే హీరోకు తోకలాగా ఒక వెర్రిబాగుల ఫ్రెండో అసిస్టెంటో లేకపోతే మనం కామెడీ చెయ్యలేం అని చాలామంది సినిమావాళ్లు అనుకుంటూ ఉంటారు కాబట్టి అదీ అర్థం చేసుకోవచ్చు. హీరోకు కూతవేటు దూరాన అతని తల్లి(లక్ష్మి)ముగ్గురు అక్కలూ, ముగ్గురు బావలు పిల్లా మేకా కలిపి ఒక పదిహేను మంది జనాలు తమ విపరీత చేష్టలతో అన్యోన్యమైన కుటుంబాన్ని మనకు చూపుతున్నామన్న భ్రమలో నటించేస్తుంటారు. అందరూ కలిసి నడి వయసు నాగార్జున పెళ్ళి గురించి విపరీతమైన ఆందోళన చెందుతూ ఆయన్ని మరింత విపరీతంగా వత్తిడికి గురిచేస్తూ ఉంటారు.

 
ఆ వత్తిడి భరించలేని శాం ఒక ఆలొచన చేసి ఒక రెస్టారెంట్లో వెయిటర్‌గా పని చేసే అవంతిక (రకుల్ ప్రీత్)సాయంతో ప్రేమ నాటకమాడి ఆమె చేత తిరస్కరించబడి భగ్నప్రేమికునిగా మిగిలి మళ్ళీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి ప్రసక్తి తేకుండా ప్లాన్ చేస్తాడు. అవంతికకి కూడా చాలా డబ్బు అవసరాలు ఉంటాయి. దాంతో ఈ డీల్‌కి వెంటనే ఒకే చెప్పి అతని ఇంటికి వచ్చి అతని కుటుంబ సభ్యుల కోపానికి పాత్రురాలవుతుంది. తర్వాత ఏమవుతుందన్నమాట! తెలుగు సినిమా అంత సహజంగా షరా మామూలుగా హీరోగారి పట్ల నిజంగానే ఆకర్షితురాలయిపోతుంది.

 
పెద్దవయసు హీరో అంతే పెద్దమనసుతో ఆలోచించి వయసు తారతమ్యాన్ని మదిలో పెట్టుకుని ఆమెతో పెళ్ళికి ఒప్పుకోడు గాక ఒప్పుకోడు. అయినప్పటికీ అప్పటికే సదరు హీరోయిన్ మంచితనమును సజలనేత్రములతో గ్రహించిన వారలైనటువంటి కుటుంబ సభ్యులు పట్టుబట్టి పలు నాటకీయ సన్నివేశాలను మన ముందు పెట్టి వారిద్దరినీ ఒకటి చేస్తారు. తెలుగు హీరోలు ఆ రోజుల్నించి ఈ రోజులదాకా ఈ విషయంలో పెద్దగా మారలే. అప్పట్లో బామ్మ ప్రాణాన్ని కాపాడడానికో కుటుంబ పరువును నిలపడానికో గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే అత్యంత అయిష్టంగా రెండో పెళ్లి/ మారుపెళ్లి చేసుకునేవారు. సీన్ మారింది కానీ వారిపైన ఒత్తిడి మాత్రం మారలే. పాపం!

 
ఈ మధ్యకాలంలో వచ్చిన నాలుగైదు చూసి తెలుగు సినిమా స్థాయిపై కాస్త ఆశలు పెంచుకొన్న సెన్సిబుల్ ప్రేక్షకులకు త్రీవ్రమైన నిరాశ కలగడం తథ్యం. మన పొరుగున ఉన్న తమిళ, మళయాళ రంగాల్లో పెరంబు, ఉండ, లూసీఫర్ వంటి సినిమాల్లో మధ్య వయస్కులైన మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వారిని చూసిన కంటితో ఇది చూస్తే ఎందుకిలా అనిపిస్తుంది.

 
ఇక ఇతర సాంకేతిక వివరాల్లోకి వెళ్లినట్లైతే నేపథ్య సంగీతం అంతంతమాత్రం. అన్ని పాటలున్నా గుర్తు పెట్టుకునేట్టు ఒక్కటి కూడా లేదు. లొకేషన్లయితే బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే తెరమీద నటీనటులు లేకపోతే బాగుండునేమో అనిపించేంత బాగా ఉన్నాయి. నటీ నటులెవ్వరికీ నటించడానికి అవకాశమున్న పాత్రలు లేవు. నటించగలిగిన లక్ష్మి, రావురమేష్, దేవదర్శిని, ఝాన్సీ లాంటి వారిని ఉపయోగించుకున్న తీరు చూస్తే అయ్యో అనిపిస్తుంది.

 
(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

మిగిలింది నాలుగురోజులే.. మళ్లీ 40 సంవత్సరాలకే.. పోటెత్తుతున్న భక్తులు...