Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Lizards: బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?

Lizard
, శనివారం, 28 జనవరి 2023 (12:29 IST)
సాధారణంగా జంతువుల గురించి మాట్లాడుకునేటప్పుడు అడవులు, పర్వతాలు మనకు గుర్తుకు వస్తాయి. అయితే, మన చుట్టూ ఉండే జంతువులు, కీటకాల ప్రాధాన్యాన్ని మనం గుర్తించం. మన చుట్టూ ఉండే జీవుల నుంచి మనం చాలా ప్రయోజనాలను పొందుతుంటాం. అయితే, వాటిపై మనం పెద్దగా దృష్టిపెట్టం. అలాంటి జీవుల్లో బల్లి ఒకటి. దాని పేరు చెప్పగానే చాలా మంది ఉలిక్కిపడతారు. మరికొందరు భయపడుతుంటారు. ఇంకొందరు అయితే అపశకునంగా భావిస్తారు.
అయితే, నిజానికి వాటికి దక్కాల్సిన సముచిత స్థానం వాటికి దక్కడం లేదు. జీవావరణ సమతౌల్యతలో అవి కూడా తమ వంతు పాత్ర పోషిస్తుంటాయి.
 
ఒకవేళ మన ఇంట్లో అసలు బల్లులే లేకపోతే ఏం జరుగుతుంది? మన ఇంటికి బల్లులకు సంబంధం ఏమిటి?
ఈ అంశంపై పర్యావరణవేత్త, జంతువుల నిపుణుడు ఏ శణ్ముగనాథన్ బీబీసీతో మాట్లాడారు. ఆ వివరాలు ప్రశ్నలు-సమాధానాల రూపంలో మీకోసం..
 
బల్లులతో వచ్చే ప్రయోజనాలు ఏమిటి?
కీటకాలను నియంత్రించడంలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం సాధారణంగా మన ప్రపంచం నిండా జీవులే అని చెబుతాం. నిజానికి జీవులకు బదులుగా మనం కీటకాలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ప్రపంచంలో కీటకాల జనాభా చాలా పెద్దది. కీటకాలు లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం అసలు ఊహించుకోలేం. అలాగే కీటకాలు మరీ ఎక్కువైనా పరిస్థితులు భయానకంగా మారిపోతాయి. అందుకే ఇక్కడ అసమతౌల్యత అవసరం. దీన్ని సరిచూడటంలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దోమలు, ఈగలు లాంటి కీటకాల జనాభా నియంత్రణలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆ తర్వాత ఈ బల్లులను పక్షులు తింటాయి. అలా ఆహారపు గొలుసు ముందుకు వెళ్తుంటుంది.
 
బల్లులు ఏం తింటాయి?
రాత్రిపూట ఎక్కువగా సంచరించే దోమలు, ఈగలు, పురుగులు, ఇతర కీటకాలను బల్లులు ఆహారంగా తీసుకుంటాయి.
 
మన ఇళ్లలో ఎలాంటి బల్లులు కనిపిస్తాయి?
సాధారణంగా మన ఇళ్లలో కనిపించే బల్లులను హౌస్, గార్డెన్/ట్రీ లిజర్డ్స్‌గా పిలుస్తారు. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే, మొదట వీటిలోని భిన్న రకాలపై పరిశోధన జరగాలి. అప్పుడే మనం వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పించగలం.
 
బల్లులు విషపూరితమైనవని అంటారు.. ఇది నిజమేనా?
నిజానికి బల్లుల చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. అవి ఎదురైతే మంచిది కాదని, అపశకునమని అనుకుంటాం. ఆహారంలో బల్లి పడితే, అది విషపూరితం అవుతుందని కూడా చెబుతారు. అయితే ఇవన్నీ అపోహలే. బల్లి పడినంత మాత్రాన ఆహారం విషపూరితం కాదు. నిజానికి బల్లుల్లో మనషులను చంపేంత విషం ఉండదు. పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
 
అయితే, ఒక్కోసారి బల్లి పడిన ఆహారాన్ని తీసుకుంటే వాంతులు, తలనొప్పి లాంటివి కలగొచ్చు. ఇవన్నీ అలర్జీ వల్లే వస్తాయి. ఈ లక్షణాలను మందులతో మనం తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరముంది.
 
అసలు బల్లులే లేకపోతే ఏం జరుగుతుంది?
అసలు బల్లులే లేకపోతే, కీటకాల జనాభా పెరిగిపోతుంది. దీంతో కొత్త రకాల ఇన్ఫెక్షన్లు మనల్ని చుట్టుముడతాయి. ఉదాహరణగా దోమల జనాభా విపరీతంగా పెరిగిపోవడాన్ని చెప్పుకోవచ్చు. దీనికి వాతవరణ మార్పులు కూడా ఒక కారణం. మరోవైపు కొన్ని కీటకాలను హతమార్చేందుకు మనం కీటక నాశనులను వాడుతున్నాం. అవి మనుషులపైనా ప్రభావం చూపగలవు. ఈ కీటకాలను బల్లులు మెరుగ్గా నియంత్రించగలవు. అవే లేకపోతే మనకు చాలా కొత్త సమస్యలు వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న పెళ్లి కూతురు వాలుజడ.. ఏంటి సంగతి?