ఆమీర్ ఖాన్ సినిమాలంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తను ఎంచుకొనే కథలు, చేసే ప్రయోగాలు అలాంటివి. కొన్ని కథల్ని ఆమీర్ మాత్రమే పట్టగలడు. కొన్ని పాత్రల్ని ఆయన మాత్రమే చేయగలడు. ఏళ్ల తరబడి ఒకే సినిమాపై దృష్టి పెట్టగలడు. ఒక పాత్ర కోసం తనని తాను ఎన్ని రకాలుగానైనా మార్చుకోగలడు. అందుకే ఆమీర్ సినిమా వస్తోందంటే... దేశ వ్యాప్తంగా ఓ ఫోకస్ ఏర్పడుతుంది. `లాల్ సింగ్ చెడ్డా`పై కూడా అలాంటి అభిప్రాయమే కలిగింది.
ఎప్పుడో 1994లో వచ్చిన `ఫారెస్ట్ గంప్` అనే ఆంగ్ల చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్. 20 ఏళ్ల క్రితం నాటి కథని ఆమీర్ నమ్మడం, ఇన్నేళ్ల తరవాత దాన్నిరీమేక్ చేయడం.. మరింత ఆసక్తి కలిగించింది. నాగచైతన్య ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర పోషించడంతో తెలుగువారికి ఇంకొంచెం స్పెషల్‌గా నిలిచింది. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న `లాల్ సింగ్ చడ్డా` ఎలా ఉంది? లాల్ ప్రయాణం.. వెండి తెరపై ఎలా సాగింది?
స్వాతిముత్యం లాంటి లాల్ సింగ్ చడ్డా
లాల్ సింగ్ చడ్డా (ఆమీర్ ఖాన్) ఓ అమాయక చక్రవర్తి. చాలా సౌమ్యుడు. నాన్న ఆర్మీలో పనిచేసి అక్కడే చనిపోతాడు. అమ్మ సంరక్షణలో పెరుగుతుంటాడు. అమ్మ తప్ప తనకు మరో లోకం తెలీదు. ఆ తరవాత... లాల్ సింగ్ జీవితంలోకి రూప (కరీనా కపూర్) వస్తుంది. చిన్నప్పటి నుంచీ లాల్, రూప మంచి స్నేహితులు. రూపకి బాగా డబ్బు సంపాదించాలని, జీవితంలో సెటిల్ అవ్వాలని ఆశ. అందుకే సినిమా అవకాశాల కోసం ముంబై వస్తుంది. లాల్ సైన్యంలో చేరతాడు. అక్కడ బాలరాజు (నాగచైతన్య)తో స్నేహం కుదురుతుంది. సైన్యం నుంచి బయటకు వచ్చి... `రూప` కంపెనీ స్థాపిస్తాడు లాల్ సింగ్. జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఈ లాల్ సింగ్ జీవితంలోకి ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చారు? ఎప్పుడు వదిలి వెళ్లిపోయారు? ఈ జీవిత ప్రయాణంలో లాల్ సింగ్ ఏం నేర్చుకొన్నాడు? అనేది వెండి తెరపై చూడాలి.
లాల్ పాత్ర... మన స్వాతిముత్యం కమల్ హాసన్‌ని పోలి ఉంటుంది. `ఫారెస్ట్ గంప్`కి కూడా స్వాతిముత్యమే స్ఫూర్తి అని అప్పట్లో చెప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ.. అలాంటి పాత్రనే ఆమీర్ చేశాడు. ఆమీర్ పాత్ర, అందులోని స్వచ్ఛమైన అమాయకత్వం.. ఇవన్నీ `స్వాతిముత్యం` సినిమాను గుర్తుకు తెస్తుంటాయి. కాకపోతే.. దాని చుట్టూ తిరిగే పాత్రలు, సంఘటనలు వేరు. అంతే. `ఫారెస్ట్ గంప్`లోని కోర్ పాయింట్ మాత్రమే చిత్రబృందం తీసుకొంది. దాని చుట్టూ మనవైన ఎమోషన్లు జోడించడానికి దర్శకుడు, రచయితల బృందం శక్తి మేర పనిచేసింది.
ఒక లాల్... ఎన్నో కథలు
కథగా చెప్పాలంటే.. ఇదో వ్యక్తి ప్రయాణం. అతని జీవితంలోకి వచ్చిన పాత్రలు, జరిగిన సంఘటనలు... ఇదే.. లాల్ సింగ్ కథ. అయితే... లాల్ చుట్టూ చాలా కథలు తిరుగుతుంటాయి. అమ్మ, రూప, బాలరాజు, మహమ్మద్ భాయ్... వీరంతా లాల్ సింగ్‌ని ప్రభావితం చేసిన పాత్రలే. వాళ్లందరి గురించి, వాళ్లతో తన అనుభవాల గురించి లాల్ ఓ రైలు ప్రయాణంలోని తోటి ప్రయాణికులతో చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది. లాల్ పాత్రని పరిచయం చేయడానికి, తనను ప్రేక్షకుల్లో ఇంజెక్ట్ చేయడానికి దర్శకుడు కావల్సినంత సమయం తీసుకొన్నాడు. ముఖ్యంగా... లాల్ బాల్యం. తొలి సగంలో సగం ఛైల్డ్ ఎపిసోడ్‌కే కేటాయించాడు. చిన్నప్పటి లాల్ - రూపల అనుబంధం గురించి, అమ్మ చెప్పిన ధైర్య వచనాల గురించి.. సీన్లకు సీన్లు కేటాయించాడు. దాని వల్ల రూప, లాల్ పాత్రలు అర్థమవ్వడానికి చాన్స్ దొరికింది. కానీ చాలా కాలయాపన జరిగిపోయింది.
ఆ తరవాత బాలరాజు వస్తాడు. బాలరాజు ఎపిసోడ్ షార్ట్ అండ్ స్వీట్ గా సాగుతుంది. బాల - లాల్ మధ్య స్నేహాన్ని దర్శకుడు అందంగా చూపించాడు. కానీ.. బాల పాత్ర కూడా అచ్చం లాల్‌లా మాట్లాడుతుంది. అలానే బిహేవ్ చేస్తుంటుంది. బనియన్ - చెడ్డీ.. అంటూ ఆ పాత్రతో పదే పదే పలికించడం కాస్త విసుగు అనిపిస్తుంది. కాకపోతే.. ఓ స్నేహితుడికి లాల్ పాత్ర ఇచ్చే విలువ చూస్తే.. స్నేహం అంటే ఇలా ఉండాలి కదా? అనిపిస్తుంది. రూపతో లవ్ స్టోరీ ఈ కథలో కీలకం. ఆ ప్రేమ చాలా హృద్యంగా సాగుతుంది.
లాల్ - రూపల స్నేహాన్ని దర్శకుడు అందంగా చూపించాడు. కాకపోతే.. ప్రేమకు వీళ్లిద్దరి లక్ష్యాలూ, భావాలూ అడ్డు. అందుకే త్వరగా కలుసుకోలేకపోతారు. రూప తన స్వార్థం కోసం ఆలోచిస్తుంటుంది. లాల్‌కు దూరంగా వెళ్లిపోతుంది. చివరికి మళ్లీ కలుస్తుంది. రూప వెళ్లిపోవడానికీ, తిరిగి లాల్ దగ్గరకు రావడానికీ స్వార్థమే కనిపిస్తుంది. మహమ్మద్ పాత్రని కూడా బాగానే డిజైన్ చేశారు. `అల్లా` పేరుతో తప్పుడు సందేశాలతో కొంతమంది అమాయకులైన ముస్లింలను మత ఛాందసవాదులు ఎలా వాడుకుంటున్నారో చూపించాడు. ఆ పాత్రకు, లాల్‌కీ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ కూడా ఆకట్టుకుంటుంది.
సామాజిక అంశాలను టచ్ చేస్తూ...
మరోవైపు కథలో అంతర్భాగంగా చాలా సామాజిక అంశాలు నడుస్తుంటాయి. అప్పటి కాలమాన పరిస్థితులను అనుగుణంగా ఈ దేశంలో జరిగిన పలు కీలకమైన అంశాలను పైపైన టచ్ చేసుకుంటూ వెళ్లారు. ముఖ్యంగా సిక్కుల ఊచకోత, ఇందరిగాంధీ హత్య, కార్గిల్ వార్, ముంబై ఎటాక్, తాజ్‌పై కసబ్ దాడి, అన్నాహజరే నిరాహార దీక్ష.. ఇలా ఒకటేంటి...? చాలా విషయాలు తెర వెనుక అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. వాటిని దర్శకుడు పైపైనే టచ్ చేశాడు. లోపలకు వెళ్లి, చర్చిస్తే వివాదాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని భయపడ్డారో ఏమో..? ఫారెస్ట్ గంప్‌లో కూడా ఇలానే ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సాగిన సామాజిక అంశాల్ని సృజించారు. కాకపోతే.. `లాల్`తో పోలిస్తే.. ఆ సన్నివేశాలు బలంగా నాటుకుపోతాయి. ఇక్కడ మాత్రం ఆ అలజడి ఉండదు.
చాలా సుదీర్ఘంగా సాగిన సినిమా ఇది. దాదాపుగా 160 నిమిషాల నిడివి ఉంది. ప్రతి సన్నివేశాన్నీ విడమరచి చెప్పడం, లాల్ జీవితంలోని నలుగురు కీలకమైన వ్యక్తులు, వాళ్లతో తనకున్న అనుబంధాన్ని మరింత స్పష్టంగా చెప్పే ప్రయత్నంలో ఈ సినిమా నిడివి పెరిగిపోయింది. చాలా సన్నివేశాల్ని ట్రిమ్ చేయొచ్చు. కానీ తాము తీసిన సినిమాపై తమకున్న అపారమైన ప్రేమ, నమ్మకంతో ఆ పని చేయలేదు. దాంతో... సాగదీతలా అనిపిస్తుంది. కొన్నిచోట్ల ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ కాలేం. ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకొన్న స్క్రీన్ ప్లే పద్ధతి కూడా రొటీన్‌గానే ఉంది. ఓ రైలు ప్రయాణంలో.. తనని ఎవరూ అడక్కపోయినా హీరో తన కథ చెప్పుకుంటూ పోతుంటాడు. కథ చెబుతున్నంత సేపూ మిగిలిన ప్రయాణికులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి... ఈ కథ వింటుంటారు. అంత ఎమోషన్ ప్రేక్షకుల్లో కలగలేదు. అది ఈ కథలోని ప్రధానమైన లోపం.
ఓన్లీ వన్ ఆమీర్ ఖాన్
లాల్ పాత్రలో ఆమీర్ ఒదిగిపోయాడు. నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. ఆమీర్ తప్ప ఈ పాత్రని ఇంకెవ్వరూ చేయలేరేమో అన్నంతగా చేశాడు. దాదాపుగా సినిమా అంతా ఒకే ఎమోషన్, ఒకే బాడీ లాంగ్వేజ్‌తో కనిపించాలి. అందులోనే వేరియేషన్స్ చూపించాలి. ఆ టాస్క్‌ను బ్రహ్మాండంగా పూర్తి చేశాడు. రూప పాత్రలో డెప్త్ ఉంది. దాన్ని... కరీనా బాగా డీల్ చేసింది. ఆమీర్‌తో పోలిస్తే కరీనా వయసు ఎక్కువగా కనిపిస్తోంది ఈ సినిమాలో. అదొక్కటే కాస్త ఇబ్బంది పెట్టే విషయం. బాలరాజుగా నాగచైతన్య కనిపించేది కాసేపే. అయితే.. ఆ పాత్ర గుర్తుంటుంది. చైతూ నటన కూడా చాలా ఫ్రెష్‌గా అనిపించింది. బాల నటులిద్దరూ బాగా చేశారు. చిన్నప్పటి రూప.. అందంగా కనిపించింది.
సాంకేతికంగా చూస్తే... ప్రొడక్షన్ డిజైనింగ్ అద్భుతంగా కుదిరింది. అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆర్ట్ వర్క్ ఉంది. పాటలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని మాటలు.. మనసుని తాకుతాయి. దేశంలో అలజడుల్ని మలేరియా జ్వరంతో పోల్చడం బాగుంది. మతాల వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయని చెప్పడం కూడా వాస్తవానికి దగ్గరగా అనిపించింది. సన్నివేశాల్ని షార్ప్ చేయాల్సింది. అది జరగలేదు. పతాక సన్నివేశాల్లో అయితే మరీ లాగ్ కనిపించింది. ఆమీర్ కష్టం.. ఈ సినిమా. అయితే.. ఈ కష్టం కథపై ఖర్చు పెడితే బాగుండేది. `ఫారెస్ట్ గంప్` అనేది ఓ క్లాసిక్. పాతికేళ్ల క్రితం ఆ ఎమోషన్ కొత్తది. ఆ కథ కొత్తది. అప్పుడు ఆ సినిమా ఎంత నెమ్మదిగా సాగినా... అప్పటి ఎమోషన్‌కి కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. ఇప్పుడు తరం మారింది. సినిమాని చూసే విధానం మారింది. ఇప్పటికీ అదే ఫేజ్‌లో కథ చెబుతానంటే కుదరదు. ఈ రీమేక్‌లో జరిగిన అది పెద్ద తప్పు అదే.