Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కువైట్: కొత్త చట్టం వస్తే లక్షలాదిమంది భారతీయులు అక్కడి నుంచి వచ్చేయాల్సిందేనా

webdunia
బుధవారం, 8 జులై 2020 (18:02 IST)
వలస ప్రజల కోసం కువైట్‌లో రూపొందుతున్న చట్టం గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులను మరోసారి కలవరపెడుతోంది. రెండేళ్ల కిందట నిబంధనలు మార్చడంలో వందల మంది భారతీయ ఇంజినీర్లు తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. “వలసదారుల బిల్లు రూపొందించడం చట్టబద్ధమే” అని కువైట్ నేషనల్ అసెంబ్లీ చట్ట కమిటీ భావించినట్లు ఇంగ్లిష్ పత్రిక అరబ్ న్యూస్ చెప్పింది.

 
ఈ కమిటీ తమ ప్రతిపాదనను మిగతా కమిటీల దగ్గరకు పంపించనుంది. ఈ చట్టం ముసాయిదాలో “కువైట్‌లోని భారతీయుల జనాభాను దేశ మొత్తం జనాభాలో 15 శాతానికి పరిమితం చేయాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, కువైట్‌లో ఉంటున్న సుమారు 10 లక్షల మంది ప్రవాస భారతీయుల్లో 8 నుంచి 8.5 లక్షల మంది తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

 
కువైట్‌లో అత్యధికులు భారతీయులే
సౌదీ అరేబియాకు ఉత్తరంగా, ఇరాక్‌కు దక్షిణంగా ఉన్న ఈ చిన్న దేశం మొత్తం జనాభా దాదాపు 45 లక్షలు. వీరిలో మొత్తం కువైట్ ప్రజల సంఖ్య 13 నుంచి 13.5 లక్షలు మాత్రమే. కువైట్‌కు వలస వచ్చినవారిలో ఈజిఫ్ట్, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక , ఇతర దేశాల వారి కంటే భారతీయుల సంఖ్యే అత్యధికం.

 
ఈ ప్రతిపాదిత చట్టంలో “మిగతా దేశాల నుంచి వచ్చి కువైట్‌లో ఉంటున్న వారి జనాభాను కూడా తగ్గించాలని చెప్పారు. దేశంలో వలస ప్రజల జనాభాను ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి మొత్తం జనాభాలో 30 శాతానికి తగ్గించాలని అంటున్నారు.

 
“ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో సూపర్‌వైజర్‌గా పనిచేయాల్సి వస్తోంది” అని కువైట్‌లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే నాసిర్ మొహమ్మద్(పేరు మార్చాం) చెప్పారు. “ఈ బిల్లు చట్టంగా మారితే ఏమవుతుందోనని ఇక్కడున్న భారతీయులు ఆందోళన చెదుతున్నారు” అన్నారు.

 
అయినా, నాసిర్ తనను లక్కీ అనే అనుకుంటున్నాడు. ఆయన ఇటీవలే పాత కంపెనీని వదిలి కొత్త కంపెనీలో ఉద్యోగంలో చేరారు. 2018లో వచ్చిన కొత్త కువైట్ నిబంధనల పరిధిలో లేకపోవడంతో ఐఐటీ, బిట్స్ పిలానీ ద్వారా పాసైన ఎంతోమంది ఇంజినీర్లు ఉద్యోగాలు పోగొట్టుకోవడాన్ని ఆయన చూశారు.

 
మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇంజనీర్ల సమస్యను కువైట్ ప్రభుత్వం దగ్గర లేవనెత్తారు కూడా. కానీ దానికి ఎలాంటి పరిష్కారం లభించలేదు. “పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్న చాలా మంది భారతీయులు కువైట్‌లో సూపర్‌వైజర్, ఫోర్‌మెన్ లాంటి హోదాల్లో, ఆ జీతాలకే పనిచేస్తున్నారు. కానీ, విధులు మాత్రం ఇంజినీర్లు చేసేవే” అని నాసిర్ మొహమ్మద్ చెప్పారు.

 
“2008 ఆర్థిక మాంద్యం తర్వాత కొత్త వలస చట్టం లాంటి నిబంధనలు తరచూ వస్తున్నాయని, 2016లో సౌదీ అరేబియా నితాకత్ చట్టం అమలు చేసినప్పటి నుంచి, అవి మరింత జోరందుకున్నాయి” అంటారు కువైట్‌లోనే ఉంటున్న హైదరాబాదీ మొహమ్మద్ ఇలియాస్. నితాకత్ చట్టం ప్రకారం సౌదీ అరేబియా ప్రభుత్వ విభాగాలు, కంపెనీల్లో స్థానికుల ఉద్యోగాల శాతాన్ని మరింత పైకి తీసుకెళ్లాలి.

 
సంపన్నులకే నిర్ణయాధికారం
“ఉద్యోగాలు, నిబంధనల ద్వారా లభించిన సేవలను కబ్జా చేసిన వలస ప్రజల తుపానును అడ్డుకోవాలి” అని గత ఏడాది కువైట్ ఎంపీ ఖాలిద్ అల్-సాలేహ్ ఒక ప్రకటన చేశారు. “వలస వచ్చేవారికి ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా, వారికి ఒక కారు మాత్రమే అనుమతించేలా ఒక చట్టం తీసుకురావాలి” అని సఫా అల్-హాషెమ్ అనే మరో ఎంపీ కొన్నేళ్ల క్రితం అన్నారు. సఫా అల్-హాషెమ్ వ్యాఖ్యలపై కొన్ని ప్రాంతాల్లో విమర్శలు కూడా వచ్చాయి.

 
కువైట్ నేషనల్ అసెంబ్లీకి మొత్తం 50 మంది ఎంపీలు ఎన్నికవుతారు. అయితే అక్కడ సంపన్నులు మాత్రమే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారని భావిస్తున్నారు. ఇటీవల కొత్త చట్టం గురించి చర్చ జరిగినపుడు, కొంతమంది స్థానికులు కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడారు.

 
19వ శతాబ్దం చివర నుంచి 1961 వరకూ బ్రిటన్ ‘సంరక్షణ’లో ఉన్న కువైట్‌కు భారతీయులు వెళ్లడం సుదీర్ఘ కాలం నుంచీ వస్తోంది. ఆ సమయంలోనే వాణిజ్య రంగం నుంచి దాదాపు అన్ని రంగాల్లో అక్కడ భారతీయులు ఉంటూ వచ్చారు. కువైట్ ఇళ్లలో డ్రైవర్లు, వంటవాళ్ల నుంచి ఆయాల వరకూ చిన్న పనులు చేసుకునేవారి సంఖ్య మూడున్నర లక్షలకు పైనే అని చెబుతారు. ఇప్పటికిప్పుడు వారి స్థానాల్లో వేరేవారిని భర్తీ చేయడం అంత సులభం కాదని భావిస్తున్నారు.

 
రీవన్ డిసౌజా కుటుంబం 1950వ దశకంలోనే భారత్‌ నుంచి కువైట్ వెళ్లింది. ఆయన అక్కడే పుట్టారు. రీవన్ స్థానిక ఇంగ్లిష్ పత్రిక ‘టైమ్స్ కువైట్‌’ సంపాదకులు. బీబీసీతో మాట్లాడిన ఆయన “వలసదారుల బిల్లు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నట్టు చట్ట కమిటీ మాత్రమే భావించింది. ఇప్పుడు అది మానవ వనరుల కమిటీ, ఇంకా చాలా కమిటీలు, మిగతా దశలను దాటి వెళ్లాలి. తర్వాత దీనిని బిల్లుగా ఆమోదిస్తారు. ఆ తర్వాతే దానిని చట్టంగా చేయడం సాధ్యం అవుతుంది” అన్నారు.

 
రీవన్ డిసౌజా దీనిని మరో కోణంలోనూ చూస్తున్నారు. “కోవిడ్-19 వల్ల ఏర్పడిన సంక్షోభం, అక్కడ అక్రమంగా ఉంటున్న వారిని భారత ప్రభుత్వం తిరిగి తీసుకువెళ్లాలనే స్థానిక ప్రభుత్వం డిమాండును పట్టించుకోకపోవడంపై కువైట్ ఆగ్రహంతో ఉంది. వారు ఇప్పుడు ఏదో ఒక దేశం వారిపై ఆధారపడి ఉంటాలనుకోవడం లేదు” అన్నారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

తిరుమలలో భక్తులకు కరోనావైరస్ రాదు, ఎలా సాధ్యం?