Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

బిబిసి

, శుక్రవారం, 20 డిశెంబరు 2024 (17:36 IST)
''మార్చి నుంచి నవంబర్ మధ్యలో మొత్తం 15 సార్లు నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. ఎన్నిసార్లు ఎలుకలు కరిచాయన్నది గుర్తులేదు. కానీ ఇంజెక్షన్లు మాత్రం నేను లెక్కవేసుకుంటే 15 సార్లు ఇచ్చారని గుర్తుంది'' ఇది తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థిని కీర్తి తమ హాస్టల్లో ఎలుకల బెడద గురించి బీబీసీకి చెప్పిన విషయం. ఖమ్మంకు చెందిన ఈ పదిహేనేళ్ల బాలికను ఎలుకలు కరవడం వల్ల, ఆ చికిత్సలో భాగంగా ఇచ్చిన ఇంజెక్షన్ల కారణంగా, కాళ్లలో సత్తువ కోల్పోయి ఆసుపత్రి పాలయ్యిందని చెబుతున్న విషయం సంచలనంగా మారింది. అయితే, ఆ బాలికకు ఎందుకలా అయ్యిందన్నది ఇంకా స్పష్టంగా తెలియట్లేదని వైద్యులు అంటున్నారు.
 
అసలేం జరిగింది?
ఖమ్మం పట్టణం శివార్లలో రఘునాథ పాలెం గ్రామం దగ్గర తెలంగాణ బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం ఉంది. అందులో లక్ష్మీ భవానీ కీర్తి అనే అమ్మాయి పదవ తరగతి చదువుతోంది. బీబీసీకి కీర్తి చెప్పిన వివరాల ప్రకారం ఆ హాస్టల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతూ అక్కడి విద్యార్థులను కరుస్తున్నాయని ఈ బాలిక చెప్పింది. తనను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయని, అవి కరిచిన ప్రతిసారీ అక్కడి డ్యూటీ నర్సు తనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ఇంజెక్షన్ వేయించేవారని ఆ బాలిక బీబీసీతో చెప్పింది.
 
''మార్చి నుంచి నవంబర్ మధ్యలో మొత్తం 15 సార్లు నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. నవంబర్‌లో కూడా మరోసారి కరిచింది, కానీ అన్నిసార్లు ఇంజెక్షన్ వద్దని జెల్ ఇచ్చి రాసుకోమన్నారు. ఎలుక కరిచి చాలాసార్లు రక్తం వచ్చింది. ఎన్నిసార్లు ఎలుకలు కరిచాయన్నది నాకు గుర్తులేదు. కానీ ఇంజెక్షన్లు మాత్రం నేను లెక్కవేసుకుంటే 15 సార్లు ఇచ్చారని గుర్తుంది'' అని బీబీసీతో చెప్పింది కీర్తి.
 
తనకు 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారని బాలిక చెబుతోంది. రెండుసార్లు రేబీస్ వ్యాక్సీన్ వేసిన రికార్డు ఉందని వైద్యులు చెప్పారు. అయితే ఆమెకు ఏ ఇంజెక్షన్ ఎన్నిసార్లు ఇచ్చారన్నది బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు. కీర్తి ఐదవ తరగతి నుంచి ఈ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. తమ హాస్టల్ పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించింది. ''మేం నిద్రపోయే ప్రదేశంలో, మెస్‌లో రాత్రి ఎలుకలు కనిపిస్తాయి. పగలు స్టాఫ్ రూంలో కూడా కనిపిస్తాయి. మా ఫ్రెండ్స్ నలుగురైదుగురిని కూడా కరిచాయి. వారికీ ఇంజెక్షన్లు వేశారు. ఎక్కువగా నిద్రలో కరుస్తాయి. మా కిటికీలకు గ్రిల్స్ లేవు. దోమలు, కోతుల సమస్య కూడా ఉంది. ఎలుక కరిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి ఇంజెక్షన్ చేయించి, ఐస్ క్యూబ్స్ ఇస్తారు'' అని చెప్పింది కీర్తి.
 
నవంబర్ 15న కీర్తి అరికాలుపై ఎలుక కరిచిన అనేక గాట్లు ఉన్న ఫోటోను ఆమె తల్లి, హాస్టల్ నర్సుకు వాట్సప్‌లో పంపారు. ఆ ఫోటోలో కీర్తి అరికాలుపై చాలాగాట్లు కనిపించాయి. హాస్టల్ దగ్గర వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి బీబీసీ అక్కడికి వెళ్లింది. అధికారులు మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడటానికి ప్రిన్సిపల్ నిరాకరించారు. హాస్టల్ దగ్గరికి ఇతరులు రాకుండా, పోలీసును కాపలాగా ఉంచారు. హాస్టల్ నిర్వాహకులు ఎలుకలను పట్టించే ఏర్పాట్లు చేయడం తానెప్పుడూ చూడలేదని కీర్తి చెప్పింది.
 
ఎలుక కాటు వల్లనో, ఇంజెక్షన్ వల్లనో లేదా మరో కారణమో స్పష్టత లేదు కానీ, డిసెంబర్ 10న కీర్తి కాళ్లు వాచిపోయి నడవలేని స్థితికి చేరుకుంది. ‘‘మోకాళ్ల కింద స్పర్శ కూడా లేదు’’ అని ఆమె తల్లి చెప్పారు. ''నాకు డిసెంబర్ 10న హాస్టల్లో ఉండే నర్సు నుంచి ఫోన్ వచ్చింది. పాప నడవలేకపోతోంది, కాళ్లు వాచాయి అని ఆమె చెప్పారు. వెంటనే నేను వెళ్లి పాపను చేతులతో ఎత్తుకెళ్లి ఆసుపత్రిలో చేర్చాను. పరీక్షల అనంతరం, కాళ్లకు స్పర్శ పోయిందని, నరాల పక్షవాతం అని వైద్యులు చెప్పారు'' అంటూ ఆ రోజు జరిగిన ఘటన గురించి వివరించారు కీర్తి తల్లి. పాప కాళ్లు సత్తువ కోల్పోయి, స్పర్శ కోల్పోయి నడవలేని స్థితికి రావడానికి కారణం ఎలుక కాటుకు చికిత్స కోసం చేసిన ఇంజెక్షన్లు ఓవర్ డోస్ కావడమేనని తల్లి ఆరోపణ.
 
అయితే, ఆమెకు ఎందుకలా అయ్యింది? అనే విషయంలో వైద్యులు పూర్తి స్థాయిలో నిర్ధరణకు రాలేదు. ''పాపకు అన్ని పరీక్షలూ చేశాం. ఎంఆర్ఐ వంటి స్కానింగులు చేశాం. అనేక విభాగాల వైద్యులకు చూపించాం. వెన్ను దగ్గర తీసిన ద్రవాన్ని పరీక్షించగా, ప్రొటీన్, షుగర్స్ ఎక్కువగా ఉన్నాయి, వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఉందని తేలింది. ప్రస్తుతం యాటీ వైరల్ డ్రగ్స్ వాడుతున్నాం. ఏదైనా ఇంజెక్షన్ ఓవర్ డోస్ అయిందా అనేది మనకు పరీక్షల్లో నిర్ధరణ కాదు. పాపకు రెండుసార్లు రేబీస్ వ్యాక్సీన్ వేసినట్టు రికార్డు ఉంది. ఎలుక కరవడం, ఇంజెక్షన్లు ఇవ్వడం అనే హిస్టరీ ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. చాలా సందర్భాల్లో అవసరం లేకపోయినా ఇచ్చిన మందులు- ఇంజెక్షన్లు, ఇవ్వాల్సిన గడవు తరువాత ఇచ్చిన మందులు, సరైన డోసేజ్ పడని మందులు దుష్ఫలితాలు ఇస్తాయి. అలాగే కరిచిన ఎలుకకు ఇన్ఫెక్షన్ ఉన్నా మనిషికి వైరల్ ఇన్ఫెక్షన్ సోకవచ్చు. కాబట్టి, కారణం ఏంటన్నది స్పష్టంగా చెప్పలేం. పాప ప్రస్తుతానికి కొంచెం కోలుకుంటున్నా, ఇంకా పరీక్షలు నిర్వహిస్తున్నాం. నిన్ననే జిల్లా వైద్యాధికారి కూడా వచ్చి పాప ఆరోగ్యం సంగతి తెలుసుకుని వెళ్లారు'' అని కీర్తికి చికిత్స అందిస్తోన్న వైద్యులు డాక్టర్ ప్రణీత్ బీబీసీతో చెప్పారు.
 
మరోవైపు, పాపకు ముందు నుంచే అనారోగ్యం ఉండడం వల్లనే ఇలా జరిగిందనే ఆరోపణ చేసి తమ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కొందరు అధికారులపై కీర్తి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ''కీర్తి చాలా ఆరోగ్యవంతురాలు. ఆమె కరాటే శిక్షణ పొందింది. డాన్స్ పోటీలు, కబడ్డీ, కోకో వంటి ఆటల పోటీల్లో చురుగ్గా పాల్గొంది. మొదటిసారి 9వ తరగతిలో ఉండగా, అంటే గతేడాది మాత్రమే సమస్య మొదలైంది. ఆహారం సరిగా లేక, టాయిలెట్లు శుభ్రంగా లేక, కీర్తికి కడుపునొప్పి, జుట్టు రాలడం మొదలైతే, కొద్దిరోజులు చికిత్స నిమిత్తం ఇంటి నుంచి పంపించాం. అంతకుమించి సమస్య ఎప్పుడూ లేదు'' అని వివరించారు ఆమె తల్లి.
 
అక్కడ ఉపాధ్యాయులు అంతా చక్కగా పాఠాలు చెబుతున్నారనీ, విద్య విషయంలో ఏ ఫిర్యాదూ లేదని ఆమె అన్నారు. అయితే హాస్టల్ వసతుల విషయంలోనే సమస్య ఉందని చెప్పారు. తన కుమార్తె చదువు, ఆరోగ్యం గురించిన ఆందోళన తప్ప తనకు వేరే ఏ ఆశా లేదనీ ఆమె అన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయవద్దని ఆమె కోరారు. మరోవైపు ఈ ఘటన చుట్టూ రాజకీయం జరుగుతోంది. అధికార విపక్షాలు హాస్టళ్ల స్థితిగతులపై పరస్పర నిందలు వేసుకుంటున్నాయి. కొంత కాలంగా తెలంగాణలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో ఆహార నాణ్యత విషయంలో పలు ఆరోపణలు రావడం, పలువురు ఫుడ్ పాయిజన్ బారిన పడిన నేపథ్యంలో, ఈఘటన మరింత చర్చనీయాంశం అయింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారులను బీబీసీ సంప్రదించింది. వారి స్పందన రావాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)