Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళ వరదలు: ప్రాణాలు తీసిన కొండ చరియలు... సహాయ శిబిరాల్లో బాధితులు

Advertiesment
Kerala floods
, సోమవారం, 12 ఆగస్టు 2019 (14:54 IST)
''నా భార్యా పిల్లలను ఉన్న చోటే ఉండమని చెప్పి నేను సురక్షిత ప్రాంతంలో ఉన్న ఓ గది తాళం చెవి తీసుకురావడానికి వెళ్ళాను. అరగంట తరువాత తిరిగి వచ్చేసరికి అంతా కొట్టుకుపోయింది. నేను వచ్చేసరికి నా భార్య శైలా అక్కడ లేదు'' అన్నారు లారెన్స్. ప్రస్తుతం ఆయన తన 12 ఏళ్ల కొడుకు లింటోతో కలసి మేప్పాడి స్కూల్‌లోని సహాయ శిబిరంలో తలదాచుకుంటున్నారు.
 
వాయనాడ్‌లోని పుదుమలలో ఆగస్టు 8న వచ్చిన వరదలకు పచ్చకాదుమల అనే కొండ కూలిపోయింది. ఆ కొండ చరియల శిథిలాల కింద ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొందరు సజీవ సమాధి అయ్యారు. ఆదివారం నాటికి ఇక్కడ 10 శవాలను వెలికి తీశారు. శిథిలాల కింద మరో 8 మృతదేహాలుండొచ్చని జిల్లా యంత్రాంగం చెబుతోంది. లారెన్స్ భార్య శైలా శవం కూడా అందులో ఉందంటున్నారు. మేప్పాడిలో 500 మంది వరకూ ఉన్నారు. వారంతా త్రిక్కాయిపేట, వెళ్లరిమాట, కొట్టప్పాడి గ్రామాలకు చెందిన వారు.
 
క్యాంపులో మేం పర్యటించినప్పుడు, చాలా మంది స్కూలు బెంచీలనే మంచాలుగా వాడుకుంటున్నారు. వాటి మీదే నిద్రపోవడం కనిపించింది. ప్రజలు ఒకరినికొరు ఓదార్చుకుంటున్నారు. మాది అనుకున్న వాటిన్నంటినీ పోగొట్టుకున్నామంటూ బాధతో చెప్పింది అజిత అనే పెద్దావిడ. ఇక్కడ శిబిరంలో తలదాచుకుంటున్నవారిలో ఎక్కువ మంది 'హారిసన్ మలయాళం లిమిటెడ్' అనే టీ ఎస్టేట్‌లో పని చేస్తున్నవారు. వరదల కారణంగా కేరళలో ఆదివారం సాయంత్రం నాటికి 72 మంది చనిపోయారు. మరో 58 మంది గల్లంతయ్యారు. మృతుల్లో 12 మంది వాయనాడ్‌కు చెందినవారున్నారు.
 
వాలంటీర్ల సహాయం
సహాయ శిబిరాలకు వాలంటీర్లు వస్తువులు సరఫరా చేస్తున్నారు. మహిళలకు శానిటరీ నాప్కిన్లు, పిల్లలకు డైపర్లు, అత్యవసర మందులు కూడా శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. సహాయ సామగ్రి అవసరం ఇంకా ఉందని అధికారులు చెబుతున్నారు. వైద్య బృందంతో పాటూ క్లినికల్ సైకాలజిస్టును కూడా క్యాంపు దగ్గర పెట్టారు.
 
శిబిరాల్లోని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు మేప్పాడి క్యాంపును పర్యవేక్షిస్తున్న వాయనాడ్ జిల్లా వైద్యాధికారి డా. ప్రియ బీబీసీకి చెప్పారు. ''శిబిరాల్లోని వారికి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. ఆత్మీయులను కోల్పోయిన వారి మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాం. పసి మనసులపై ఆ ప్రభావం పడకుండా వారి కోసం చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం'' అని ప్రియ చెప్పారు.
webdunia
 
ఆదివారం తన నియోజకవర్గం వాయనాడ్‌ను రాహుల్ గాంధీ సందర్శించారు. అక్కడ సమావేశం నిర్వహించాక మీడియాతో మాట్లాడారు. ''నేను సహాయక శిబిరాలను సందర్శించాను. ప్రధాన మంత్రితో మాట్లాడాను. కేంద్ర సాయం అడిగాను. బాధితులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాను. మరికొన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను" అని రాహుల్ తెలిపారు.
 
భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటం ఘటనల తరువాత ఇప్పుడు పరిస్థితి కాస్త కుదుట పడుతోంది. సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం తెలపడం ఊరటనిచ్చింది. కానీ, కాసర్‌గఢ్, కన్నూరు, వాయనాడ్, కోళికోడ్, కళప్పురం, ఇదుక్కి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అక్కడ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
 
వాయనాడ్ నుంచి మలప్పుఱం వెళ్లే దారిలో గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు అంబులెన్సులు తిరుగుతున్నాయి. మలప్పురంలోని కవలప్పర్రలో శిథిలాల కింద కనీసం 50 మంది ఉంటారని అంచనా. మూడు ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు, ఒక ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్, కోస్ట్ గార్డు బృందంతో పాటు మద్రాస్ రెజిమెంటును సహాయ చర్యల కోసం మలప్పురానికి పంపారు. ఇప్పటి వరకూ మలప్పురంలో 20 మంది చనిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జొమాటోపై డెలివరీ బాయ్స్ ఫైర్-మా చేత గొడ్డు మాంసం, వారిచేత పోర్క్‌ ఏంటిది?