Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుద్ధిమార్చుకోని డోనాల్డ్ ట్రంప్... కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్వీట్

Advertiesment
బుద్ధిమార్చుకోని డోనాల్డ్ ట్రంప్...  కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్వీట్
, బుధవారం, 21 ఆగస్టు 2019 (12:54 IST)
కాశ్మీర్ అంశంపై భారత్‌, పాకిస్తాన్‌ల నడుమ మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాశ్మీర్ అంశం ప్రమాదకరంగా, సంక్లిష్టంగా తయారైందని ఆయన అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని, సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం సహా ఏవిధంగానైనా తోడ్పడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పారు. ఈ వారాంతంలో ఫ్రాన్స్‌లో తాను మోడీని కలుస్తానని పేర్కొన్నారు.
 
''కాశ్మీర్ జఠిలమైన సమస్య. అక్కడ హిందువులు, ముస్లింలు ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య అంతా సజావుగా సాగుతోందని మాత్రం నేను చెప్పను. దశాబ్దాల నుంచి ఈ వివాదం నడుస్తోంది'' అని ట్రంప్ అన్నారు.
 
''ఆ రెండు దేశాల మధ్య చాలా పెద్ద సమస్యలున్నాయి. పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం లేదా మరో విధంగానైనా నా వల్లైనంత కృషి చేస్తా. ఇమ్రాన్ ఖాన్, మోడీలతో నాకు మంచి సంబంధాలున్నాయి. వాళ్లిద్దరూ ఇప్పుడైతే స్నేహితులుగా లేరు. ఇమ్రాన్‌ను ఈ మధ్యే కలిశాను. మోడీని ఈ వారాంతంలో ఫ్రాన్స్‌లో కలుస్తా'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
అయితే, కాశ్మీర్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను భారత్ తిరస్కరిస్తూ వస్తోంది. కాశ్మీర్ అంశం ద్వైపాక్షికమని, దీనిపై మూడో పక్షం జోక్యం అనవసరమని అంటోంది. ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని, మధ్యవర్తిత్వం వహించాలని పదేపదే కోరుతూ వస్తున్నారు.
 
ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌ను కలిసినప్పుడు కాశ్మీర్ విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ప్రతిపాదించారు. మోడీ కూడా తనను మధ్యవర్తిత్వం గురించి అడిగారని చెప్పారు. అయితే, భారత్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలు అవాస్తవమని తేల్చిచెప్పింది. ఆర్టికల్ 370 సవరణ తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఇమ్రాన్, మోదీలతో ఫోన్‌లో మాట్లాడారు. 
 
సంయమనం పాటించాలని ఇద్దరు నేతలకూ ఆయన సూచించారు. భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడటం తగ్గించుకోవాలని పాకిస్తాన్‌కు ట్రంప్ హితవు చెప్పారు. సోమవారం ట్రంప్‌, మోదీల మధ్య దాదాపు అరగంటపాటు ఫోన్ సంభాషణ జరిగింది.
webdunia
 
కాశ్మీర్‌పై అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తాం: పాకిస్తాన్
మరోవైపు కాశ్మీర్ వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు పాకిస్తాన్ వెల్లడించింది. కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయమే దీనికి కారణమని పాకిస్తాన్ తెలిపింది. ఇప్పటికే భారత్‌లో వాణిజ్య, రవాణా సంబంధాలను తెంచుకున్న పాక్, తమ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించింది.
 
కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఏఆర్‌వై న్యూస్ టీవీతో వ్యాఖ్యానించారు. న్యాయపరంగా ఎదురయ్యే అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఖురేషీ తెలిపారు. ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా ఉన్న కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని షా మరోసారి వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను భారత్ గతంలోనే ఖండించింది.
webdunia
 
భారత ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కాశ్మీర్ అంశం కేవలం భారత్, పాకిస్తాన్‌లకు సంబంధించినదేనని, ఆ రెండు దేశాలే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. పారిస్‌లో ఈ వారంలో ప్రధాని మోడీతో తాను సమావేశం కానున్నానని, ఆ సందర్భంగా కాశ్మీర్‌ అంశంపై చర్చిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ మంగళవారంనాడు తెలిపారు. ఒకవేళ పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఆ తీర్పు కేవలం సూచన మాత్రమే. దాన్ని ఖచ్చితంగా పాటించాలనే నిబంధనలేమీ లేవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ పకోడీ చిచ్చు పెట్టింది.. ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు..