Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగాలు: ఊపందుకుంటున్న యాంటీ-వర్క్ ఉద్యమం, దీని లక్ష్యాలేమిటి, ప్రభావాలేమిటి?

ఉద్యోగాలు: ఊపందుకుంటున్న యాంటీ-వర్క్ ఉద్యమం, దీని లక్ష్యాలేమిటి, ప్రభావాలేమిటి?
, మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (21:07 IST)
అమెరికాలో పనిచేస్తున్న ఓ ఐటీ ప్రొఫెషనల్ క్రిస్. ఇటీవల తన ఉద్యోగాల్లో పని పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన చెప్తున్నారు. ఒక కంపెనీలో అనారోగ్య వేతనం (సిక్ పే) ఇవ్వకపోవటం వల్ల, మరొక కంపెనీలో వేతనంతో సెలవులు కేవలం వారం రోజులు మాత్రమే ఇవ్వటం వల్ల.. తాను అనారోగ్యంగా ఉన్నా కూడా పనికి వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. శ్రమ ఎక్కువగా ఉండే ఇతర ఉద్యోగాల్లో అయితే తన గాయాలకు తానే చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందన్నారు.

 
అయితే కస్టమర్ సపోర్ట్ విధులు నిర్వర్తించినపుడు తను చాలా దూరం వెళ్లాల్సి వచ్చిందని క్రిస్ తెలిపారు. గంటకు 13 డాలర్ల కన్నా తక్కువ వేతనం చెల్లించే ఆ ఉద్యోగంలో.. కస్టమర్ల మీద ఆధారపడివున్న వారు ఆరోగ్య బీమాకు అర్హులో కాదో తనిఖీ చేయటం ఆయన పని. తాను వెల్లడించే అధికారం లేని నిర్దిష్ట సమాచారాన్ని ఫోన్ చేసిన వారికి సహాయపడుతుందని తాను అందించినట్లయితే తనను ఉద్యోగం నుంచి తొలగించే వారని ఆయన తెలిపారు. పత్రాలు సమర్పించటానికి వారికి ఎంత గడువు ఉంది అనే తరహా సమాచారం అది.

 
‘‘జనం నిజంగా తమ ప్రాణాలు కాపాడాలని ఫోన్లలో ప్రాధేయపడుతున్నారు. నేనేమీ చేయలేకపోయాను’’ అన్నరాయన. ‘‘అది నన్ను కుంగదీసింది. ఈ వ్యవస్థలో అసలేమీ పనిచేయటం లేదని నాకు అర్థమైంది. సానుభూతి లేదు. మానవ కరుణ లేదు. అది ఎలా మాయమైపోయిందో నాకు తెలీటం లేదు’’ అని చెప్పారు.

 
అనిశ్చిత పరిస్థితుల్లో...
మహమ్మారి మొదలై రెండేళ్లు గడిచిపోయాయి. ప్రపంచమంతా ఉద్యోగులు అలసిపోయారు. మానసిక ఆరోగ్యం దిగజారటం, శ్రమతో నిస్సత్తువకు లోనవటం సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా తక్కువ వేతనాలు పొందే నిత్యావసర కార్మికుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ అనిశ్చిత పరిస్థితులు సుదీర్ఘంగా కొనసాగుతుండటం.. పరిస్థితులు మరింత దిగజారేలా చేయటంతో తమ కంపెనీలు పోషిస్తున్న పాత్ర గురించి చాలా మంది ఉద్యోగులు పునరాలోచించేలా చేసింది. దీంతో రికార్డు సంఖ్యలో ఉద్యోగులు మెరుగైన అవకాశాల కోసం తమ ఉద్యోగాలను వదిలివేస్తున్నారు.

 
అయితే కొంతమంది ఇంకా ముందుకు వెళుతున్నారు. అసలు తాము చేస్తున్న పని వల్ల కానీ, అసలు ఈ ఆర్థిక వ్యవస్థ వల్ల కానీ ఏమైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ జనం ‘యాంటీ-వర్క్’ (పనిని వ్యతిరేకించటం) ఉద్యమంలో భాగం. ఆధునిక ఉద్యోగాలకు ప్రాతిపదికగా ఉన్న ఆర్థిక క్రమాన్ని తొలగించటం ఈ ఉద్యమం లక్ష్యం. ఈ యాంటీ-వర్క్ ఉద్యమ మూలాలు అరాచక, సామ్యవాద ఆర్థిక విమర్శలో ఉన్నాయి. ఈనాటి ఉద్యోగాల్లో అత్యధిక భాగం అవసరం లేనివేనని ఈ ఉద్యమం వాదన. నిరుపయోగమైన ఈ ఉద్యోగాలు జీతాలకు బానిసత్వాన్ని రుద్దుతాయని, కార్మికుల పని పూర్తి విలువను హరిస్తాయని వాదిస్తుంది. దీని అర్థం.. అసలు పనే ఉండకూడదని కాదు. జనం సొంతంగా నిర్వహించుకోవాలని, అదనపు పెట్టుబడులు లేదా వస్తువులను సృష్టించటానికి సుదీర్ఘ గంటలు పనిచేయటానికి బదులుగా.. అవసరమైనంత మేరకు మాత్రమే పనిచేయాలని యాంటీ-వర్క్ ఉద్యమ మద్దతుదారులు నమ్ముతారు.

 
విస్తృతమైన ఉద్యమం...
కొన్నేళ్ల కిందట యాంటీ-వర్క్ అనేది విప్లవాత్మకమైన, ఏ మూలనో ఉన్న కొత్త ఆలోచనగా ఉండేది. అయితే మహమ్మారి ప్రభావం వల్ల ఈ ఉద్యమం విస్తృతమైంది. ఈ రాజకీయ బృందాలను దాటి మరింతగా విస్తరించింది. దీనికి r/antiwork subreddit అనే కమ్యూనిటీ కేంద్రంగా ఉంది. ప్రత్యక్ష కార్యాచరణ ఈ కమ్యూనిటీ ప్రధాన లక్షణం. అయితే.. పని పరిస్థితుల మీద విస్తృత చర్చల్లోకి ఆ కార్యాచరణ విస్తృతమైంది. దీనికి ప్రజాదరణ కూడా పెరిగింది.

 
ఇప్పుడిది.. ఉద్యోగాలు వదిలివేయటం, ప్రతికూల పనిపరిస్థితుల్లో మార్పులు తీసుకురావటం వంటి వ్యక్తిగత అనుభవాల క్రోడీకరణతో పాటు.. కార్మికుల సమ్మెలకు మద్దతు తెలపటం, కార్మికులను సమీకరించటం తదితర కార్యకలాపాల మిశ్రమంగా ఉంది. ఈ కమ్యూనిటీ వేగంగా పెరిగింది. కార్మికుల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో పాటు, కార్మిక హక్కులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో.. ఈ ఉద్యమం పట్ల ఆసక్తి పెరుగుతుండటం.. మార్పు తీసుకురావటంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

 
క్రిస్.. r/antiwork subreddit కమ్యూనిటీ నిర్వహణలో సాయం చేస్తున్నారు. ఈ కమ్యూనిటీకి 2000 మార్చి ముందు నాటికి ఒక లక్ష మంది మాత్రమే సబ్‌స్క్రైబర్లు ఉంటే.. ఈ కథనం రాసే సమయానికి ఈ కమ్యూనిటీకి 17 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ‘‘వారానికి 20,000 నుంచి 60,000 మంది పాలోయర్ల చొప్పున మా సబ్‌స్క్రైబర్లు పెరుగుతున్నారు. గ్రోత్, మెంబర్ల ఎంగేజ్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ వందలాది పోస్టులు, వేలాది కామెంట్లు వస్తున్నాయి’’ అని మరో మోడరేటర్ డోరీన్ ఫోర్డ్ తెలిపారు.

 
ప్లేటో కాలం నుంచీ...
సబ్‌రెడిట్ పేరును, ఫిలాసఫీని అనేక మూలాల నుంచి తీసుకున్నారు. వారిలో ఒకరు అనార్కిస్ట్ ఫిలాసఫర్ బాబ్ బ్లాక్ అని చెప్పారు ఫోర్డ్. ఆయన 1985లో రాసిన ‘ద అబాలిషన్ ఆఫ్ వర్క్’ వ్యాసానికి.. పని మీద అంతకు ముందున్న ఆలోచనలు మూలం. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, జినోఫోన్‌ల కాలం నుంచీ యాంటీ-వర్క్ తాత్విక చరిత్ర ఉందని బ్లాక్ చెప్తారు. ‘‘చాలా మంది కార్మికులు పనితో విసుగెత్తిపోయారు. ... పనిని శారీరకంగానే కాదు, సచేతనంగానూ తిరస్కరించే దిశగా ఒక ఉద్యమం రావచ్చు’’ అని ఆయన రాశారు. జనం కేవలం అవసరమైన పని మాత్రమే చేస్తారని, తమ మిగతా సమయాన్ని కుటుంబానికి, వ్యక్తిగత ఆసక్తులకు వెచ్చిస్తారని ఆయన సూచించారు. యాంటీ-వర్క్ విశ్వాసులు.. అన్ని రకాల పనికీ వ్యతిరేకులు అనుకోవాల్సిన అవసరం లేదు. వారి ప్రధాన భావం.. ‘‘పెట్టుబడిదారీ వ్యవస్థ, రాజ్యం కింద నిర్మితమైన ఉద్యోగాల’’ పట్ల వ్యతిరేకత అని సబ్‌రెడిట్ ఎఫ్ఏక్యూ చెప్తోంది. ‘‘r/antiwork ఉద్దేశం చర్చను ప్రారంభించటం. ప్రస్తుతం మనకు తెలిసిన పనిలోని సమస్యలను చర్చకు తేవటం’’ అని వివరించింది.

 
విస్తరించిన పరిధి...
ఈ ఉద్యమానికి ఈ సూత్రాలు కేంద్రంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు సబ్‌రెడిట్ పరిధి ఇంకా విస్తరించింది. సాధారణ కార్మిక హక్కుల మీద కూడా దృష్టి సారించింది. సంస్థ వేధింపుల గురించి యూజర్లు తమ అనుభవాలను పంచుకుంటారు. మెరుగైన వేతనం కోసం చర్చించటం ఎలాగో సలహాలు అడుగుతారు. కొనసాగుతున్న కార్మిక సమ్మెల గురించి అప్‌డేట్స్, న్యూస్ పోస్ట్ చేస్తుంటారు. మీమ్‌లు షేర్ చేస్తారు. సమ్మె ప్రయత్నాలకు యూజర్లు ఎలా మద్దతు ఇవ్వవచ్చో పార్టిసిపెంట్లు చిట్కాలు చెప్తుంటారు. కెల్లాగ్స్ కంపెనీ సమ్మె చేస్తున్న కార్మికుల సంఘాలతో చర్చల నుంచి వైదొలగి, కార్మిక సంఘాల్లో లేని కొత్తవారిని ఉద్యోగంలో పెట్టుకుంటామని చెప్పినపుడు.. 2021 డిసెంబర్‌లో కెల్లాగ్స్ జాబ్ అప్లికేషన్ పోర్టల్‌కు దరఖాస్తులు వెల్లువెత్తటానికి సబ్‌రెడిట్ సభ్యులు దోహదపడ్డారు.

 
ఆ కంపెనీ చర్యల మీద r/antiwork సభ్యులు ప్రత్యక్షంగా ఎంతమేరకు ప్రభావం చూపారో తెలియదు కానీ.. కెల్లాగ్స్ సంస్థ, కార్మికుల సంఘం ఆ నెల తర్వాత ఒక ఒప్పందానికి వచ్చాయి. యాంటీ-వర్క్ ఉద్యమానికి సంబంధించి రెడిట్ వెలుపల ఉన్న సాహిత్యం, పాడ్‌కాస్ట్‌ల లింకులను కూడా ఈ కమ్యూనిటీ అందిస్తుంది. అత్యధిక పోస్టులు అమెరికా కార్మికుల నుంచి వస్తున్నాయి. అన్ని రకాల వృత్తుల్లోని వారు, అన్ని లింగాల వారూ వీరిలో ఉన్నారు. అంతర్జాతీయంగానూ కార్మికులు ఇందులో పాలుపంచుకుంటున్నారు.

 
హద్దులు దాటిన వేధింపులు...
యాంటీ-వర్క్ ఉద్యమం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాకపోయినప్పటికీ.. ఇప్పుడు కొత్తగా జనం దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘కోవిడ్ కారణంగా పనిలో చాలా అవాంతరాలు వచ్చాయని మనకు తెలుసు’’ అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ లేబర్ స్టడీస్ ప్రొఫెసర్ టామ్ జురావిచ్ చెప్పారు. ‘‘ఇటువంటి సందర్భాల్లో జనం ఆలోచించటానికి సమయం దొరుకుతుంది. చాలా మందికి పని పరిస్థితులు దిగజారాయి. అధికార వ్యవస్థలు మరింత క్రూరంగా తయారయ్యాయి. ఎప్పటికన్నా మరింత ఎక్కువగా పట్టుబిగిస్తున్నాయి. జనానికి ఇది కొత్త అనుభవం’’ అని వివరించారాయన.

 
ఇక శ్రమ అధికంగా ఉండే బ్లూకాలర్ కార్మికుల విషయంలో కోవిడ్-19 వల్ల అసమానతలు మరింత ప్రస్ఫుటమయ్యాయి. వేతనంతో అనారోగ్య సెలవులు లేకపోవటం, సరైన రక్షణ ఏర్పాట్లు లేకుండా కస్టమర్లను కలవాల్సిన వాతావరణం వల్ల ఉద్యోగాల్లో కోవిడ్ సోకే ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లారు. ఇక అన్నిస్థాయిల్లోని ఉద్యోగులూ ఒకవైపు ఉద్యోగ వత్తిళ్లతో పాటు మరోవైపు లాక్‌డౌన్ల వల్ల కుటుంబ బాధ్యతల ఒత్తిళ్లనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోయారు. ఇది కొందరిని అస్తిత్వ ఆలోచనల్లోకీ నెట్టేసింది.

 
ప్రస్తుత యాంటీ-వర్క్ ఉద్యమానికి ప్రధాన చోదక శక్తిగా ఉన్నది కోవిడ్ మహమ్మారి అయినప్పటికీ.. ఈ ఉద్యమ మూలాలు చాలా ముందు నుంచీ ఉన్నాయని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో లేబర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ డైరెక్టర్ బ్రాన్‌ఫెన్‌బ్రెనర్ చెప్పారు. ‘‘యజమానులు తమపై మోపే వేధింపుల భారాన్ని భరించటంలో కార్మికులకు అద్భుతమైన సహనం ఉంది. కానీ ఆ భారం తమ జీవితాలకే ముప్పుగా పరిణమించినపుడు అది హద్దులు దాటింది. కోవిడ్ సమయంలో యజమానులు మునుపటి కన్నా ఎక్కువ లాభాలు ఆర్జిస్తూ కార్మికులను మరింత కష్టపడి పనిచేయాలనటం అదే కోవకు చెందింది’’ అని విశ్లేషించారు బ్రాన్‌ఫెన్‌బ్రెనర్.

 
ప్రభావం ఎలా ఉంటుంది?
అయితే భ్రమలు తొలగిన కార్మికులందరూ యాంటీ-వర్క్ ఉద్యమాన్ని ఆశ్రయించరనేది నిజమే. చాలా మంది కార్మికులు మెరుగైన పరిస్థితుల కోసం కొత్త ఉద్యోగాలు వెదుక్కుంటున్నారనేది స్పష్టం. కొందరు పని మానేయటమో, తమ సొంతంగా పని చేసుకోవటమో చేస్తున్నారు. కానీ కొందరు మార్పు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. ‘‘అందరూ మానేయటం లేదు. సమీకరించటం ద్వారా, సమ్మె చేయటం ద్వారా, హక్కుల కోసం నిలబడటం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని కొందరు చెప్తున్నారు’’ అన్నారు బ్రాన్‌ఫెన్‌బ్రెనర్. ఈ ఆన్‌లైన్ కమ్యూనిటీ కార్మిక హక్కుల మీద గణనీయమైన ప్రభావం చూపుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.

 
పనిని రాత్రికి రాత్రి మార్చేయటం జరగదు. అయితే కార్మికులు తమ ఉద్యోగాలు చేస్తున్న తీరులో, యజమానుల నుంచి తాము తిరిగి కోరుకుంటున్న పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. చాలా సంస్థలు ఉద్యోగుల డిమాండ్ల పట్ల స్వల్పంగానైనా సానుకూలంగా స్పందించటం చూస్తున్నాం. యాంటీ-వర్క్, దాని అనుబంధ ఉద్యమాలకు మద్దతు పెరుగుతోంది. ఇది యజమానులను, బహుశా రాజకీయ వేత్తలను కూడా కాస్త ఆగి ఆలోచించేలా చేయవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 30 విద్యార్థుల అస్వస్థత