Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ నడుం చుట్టు కొలత మీ ఎత్తులో సగం ఉందా?

Advertiesment
Over weight
, శనివారం, 9 ఏప్రియల్ 2022 (21:05 IST)
మీ నడుం చుట్టు కొలతను మీరు ఎప్పటికప్పడు చూసుకుంటున్నారా? అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే మీ ఎత్తులో సగం కంటే తక్కువగా నడుం చుట్టుకొలత ఉండాలని బ్రిటన్ ఆరోగ్య విభాగం నేషనల్ ఇనిస్ఠిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ ఎక్సలెన్స్ (ఎన్ఐసీఇ) నియమావళి చెబుతోంది. బీఎంఐను (బాడీ మాస్ ఇండెక్స్) లెక్కించుకోవడం వల్ల కూడా అనారోగ్యం బారిన పడే ముప్పు గురించి తెలుసుకోవచ్చు. కానీ, బీఎంఐ ద్వారా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు గురించి తెలుసుకోలేం.

 
శరీరంలో కొవ్వు అధికంగా ఉంటే టైప్ 2 డయాబెటిస్, రక్త పోటు, గుండె పోటుతో పాటు ఇతర హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన కొత్త నియమావళిని ఎన్ఐసీఇ రూపొందించింది. ఆసియన్లు, నల్ల జాతికి చెందిన వారికి నడుం చుట్టూ కొవ్వు ఎక్కువ చేరే అవకాశం ఉంటుందని ఈ నియమావళి పేర్కొంది. దీనినే "సెంట్రల్ అడిపాసిటీ" అని అంటారు. అయితే, వారు అనారోగ్యం ముప్పు గురించి తెలుసుకునేందుకు ఊబకాయానికి సంబంధించిన బీఎంఐను కనీస పరిమితిలో ఉండేటట్లు చూసుకోవాలి.

 
కానీ, ఆరోగ్యకరమైన బీఎంఐ స్థాయిలు ఉన్నవారికి కూడా నడుం చుట్టుకొలత ఎక్కువగా ఉండే అవకాశముందని ఎన్‌ఐసీఇ హెచ్చరిస్తోంది. "నడుం చుట్టుకొలతను కొలిచేందుకు పక్కటెముకల కింద, తుంటి పై భాగానికి మధ్యనుండే భాగంలో టేపు పెట్టి కొలవాలి. నడుం చుట్టుకొలత కొలవడానికి ముందు శ్వాసను దీర్ఘంగా పీల్చి వదిలిపెట్టాలి". ఇలా కొలవడం ద్వారా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారిని కనిపెట్టవచ్చని నియమావళి చెబుతోంది.

 
ఉదాహరణకు మీరు 175 సెంటీమీటర్ల (5 అడుగుల 9 అంగుళాలు) ఎత్తు ఉన్నట్లయితే, మీ నడుం చుట్టు కొలత 87.5 సెంటీమీటర్ల (34 అంగుళాలు) ఉండాలి. లేదా మీ నడుం చుట్టుకొలత ఎత్తులో సగం ఉండవచ్చు. ఈ మాదిరిగా స్త్రీ, పురుషులతో పాటు, అన్ని రకాల జాతులు, కండ బలం ఎక్కువగా ఉన్నవారికి కూడా కొలవవచ్చు. కానీ, బీఎంఐ 35 కంటే ఎక్కువగా ఉండే గర్భిణులు, రెండేళ్ల లోపు చిన్నారుల లాంటి వారికి నడుం చుట్టుకొలత కచ్చితంగా ఉండదు.

 
అనారోగ్యం ముప్పు
ఇంగ్లండ్‌లో 28% మంది వయోజనులు ఊబకాయంతో ఉండగా, మరో 36% మంది అధిక బరువుతో ఉన్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. ఈ సమస్య వల్ల నేషనల్ హెల్త్ సర్వీస్‌కు 6 బిలియన్ పౌండ్లు (రూ. 59,221కోట్లు) ఖర్చు అవుతోంది. "ఎన్‌ఐసీఇ విడుదల చేసిన ఈ కొత్త నియమావళిని ఎవరైనా పాటిస్తారా లేదా అనేది కచ్చితంగా చెప్పలేం" అని గ్లాస్గో యూనివర్సిటీలో మెటాబోలిక్ మెడిసిన్ ప్రొఫెసర్ నవీద్ సత్తార్ చెప్పారు. ఆరోగ్యం గురించి కొత్త విధానాలను ప్రయత్నించి చూడటం హాని చేయదని అన్నారు.

 
ఈ నడుం చుట్టుకొలత వల్ల వచ్చే ఫలితాలు పొట్టిగా ఉండేవారికి, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు పని చేయవని కొందరు నిపుణులు అంటున్నారు. "పొట్టభాగంలో కొవ్వు పెరగడం వల్ల ఆయుష్షును తగ్గించే టైపు 2 డయాబెటిస్, గుండెకు సంబంధించిన రోగాల బారిన పడే ముప్పు ఉంది" అని ఎండోక్రైనాలజీ కన్సల్టెంట్ ప్రొఫెసర్ రేచెల్ బ్యాటర్‌హాం అన్నారు. "అనారోగ్యం ముప్పును తెలుసుకునేందుకు ఎత్తు-చుట్టుకొలత నిష్పత్తి చాలా సులభమైన పద్ధతి. దీని ద్వారా అనారోగ్యం వచ్చే ముప్పును ముందుగానే తెలుసుకుని బరువును తగ్గించుకోవచ్చు" అని బ్యాటర్‌హాం చెప్పారు.

 
సున్నితంగా వ్యవహరించండి
"రోగుల బరువు గురించి మాట్లాడేటప్పుడు నర్సులు వారి అంగీకారం తీసుకోవడంతో పాటు ఈ విషయాన్ని "సున్నితంగా చర్చించాలి" అని నియమావళిలో సూచనలు చేశారు. బరువు గురించి చేసే సూచనలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరకంగా ఉంటాయి. వారికిచ్చే చికిత్సతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం పై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు, వాటిని పరిష్కరించే తీరు గురించి తెలుసుకునేందుకు ఈ కొత్త నిబంధనలు సహాయపడతాయని ఎన్‌ఐసీఇ గైడ్ లైన్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాల్ క్రిస్ప్ చెప్పారు.

 
ఈ నియమావళి ప్రచురణ అయ్యే లోపు వీటి గురించి వైద్య నిపుణులు, ప్రజలు తమ సూచనలు చేయవచ్చు. ఇవి మే నెలలో ప్రచురితమవుతాయి. ఐదేళ్లు దాటిన పిల్లల్లో కూడా అనారోగ్య ముప్పును అంచనా వేసేందుకు ఎత్తు-నడుం చుట్టుకొలత నిష్పత్తిని పరిశీలించాలని కొత్త నియమావళి సూచిస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇంగ్లండ్‌లోని చిన్నారుల్లో ఊబకాయం గణనీయంగా పెరిగింది. ప్రాధమిక పాఠశాల పూర్తయ్యే పిల్లల్లో 25% మంది ఊబకాయులవుతున్నారని ఎన్‌హెచ్‌ఎస్ డేటా చెబుతోంది. చిన్నారుల్లో కూడా పొట్టలో కొవ్వు పేరుకునే ప్రమాదం ఉందని డైయాబెటిస్, వెయిట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ డాక్టర్ నివేదిత అశ్వని చెప్పారు.

 
బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉండాలి?
ఆరోగ్యకరమైన బరువు: బీఎంఐ 18.5 కేజీలు - 24.9 కేజీలు
 
అధిక బరువు: బీఎంఐ 25 కేజీలు - 29.9 కేజీలు
 
ఊబకాయం క్లాస్ 01: బీఎంఐ 30 - 34.9 కేజీలు
 
ఊబకాయం క్లాస్ 02: బీఎంఐ 35 - 39.9 కేజీలు
 
ఊబకాయం క్లాస్ 03: బీఎంఐ 40 కంటే ఎక్కువ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారం