Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో ఇసుక ఉచితంగానే దొరుకుతోందా? టీడీపీ, వైసీపీలు ఏమంటున్నాయి?

Advertiesment
Sand

బిబిసి

, బుధవారం, 6 నవంబరు 2024 (11:44 IST)
కర్టెసి-ట్విట్టర్
ఇసుక... దశాబ్దకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో 'బ్రహ్మ పదార్థం'గా మారిపోయింది. ఐదు నెలల కిందట ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏపీలో ఇసుక విధానం ఎలా ఉందో పరిశీలించేందుకు బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని మున్నేరు వాగు వద్ద ఉన్న పెండ్యాల ఇసుక ర్యాంప్‌ను బీబీసీ పరిశీలించింది. ఇక్కడ సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో బుక్‌ చేసుకున్న వారికి ఇప్పుడు ఇసుక ఇస్తున్నారు. నేరుగా అక్కడే బుక్‌ చేసుకునే వ్యవస్థ మొదలు కాలేదు. ఇది కృష్ణానది తీరంలోని ఇసుక రేవుల పరిస్థితి.
 
గోదావరి తీరంలోని రేవుల పరిస్థితిపై రాజమహేంద్రవరం మైన్స్‌ ఏడీ ఫణిభూషణ్‌ రెడ్డి బీబీసీతో మాట్లాడారు. “మా పరిధిలో 16 రీచ్‌లు ఉన్నాయి. ఏడు రీచ్‌లు ఈ వారంలో మొదలవుతాయి, వరదల ప్రభావం వల్ల ఇప్పటివరకు వాటిని ఓపెన్‌ చేయలేదు” అని ఫణిభూషణ్‌ రెడ్డి చెప్పారు. అసలు ఇసుక సమస్య ఎక్కడ మొదలైంది? ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది?
 
ఇసుక పాలసీ ఎలా ఉంది? ఏపీలో ఇసుక విధానం ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.
 
జులై 8
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 2019, 2021 నాటి ఇసుక విధానాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం ఇకపై ఉచితంగా అందిస్తామంటూ జీవో నంబర్ 43ను విడుదల చేసింది. లోడింగ్, అన్‌లోడింగ్ కూలితో పాటు ఇతర పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. ఇసుక తవ్వకాల కోసం జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇసుక లోడింగ్, రవాణా చార్జీలను నిర్ధరించే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించింది. అప్పటికి 49 లక్షల టన్నుల ఇసుక ఏపీలోని వివిధ స్టాక్‌ పాయింట్లల్లో అందుబాటులో ఉందని పేర్కొంది.
 
ఇసుక ఉచితం అంటున్నా ఆయా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని, మొత్తంగా టన్ను ఇసుక ధర గత ప్రభుత్వంలో (టన్ను ధర రూ. 475) కంటే ఎక్కువైందన్న విమర్శలు వచ్చాయి. ఉదాహరణకు అనకాపల్లి జిల్లాలోని అగనంపూడి ఇసుక డిపో వద్ద టన్ను ఇసుక ధర ఏకంగా రూ.1,394 అని బోర్డు పెట్టడం అప్పట్లో చర్చనీయమైంది.
 
ఇసుక పోర్టల్
సెప్టెంబర్‌ 19
 
ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఇసుక స్టాక్‌ ఎంత ఉంది? సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? అనే వివరాలతో పోర్టల్‌ రూపొందించారని తెలిపారు. కానీ పోర్టల్‌లో ఎలా బుక్‌ చేసుకోవాలో తెలియక సామాన్యులు అవస్థలు పడ్డారు. అది ఓపెన్‌ కాక ఇంకొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ని వివరాలను నమోదు చేసినా, స్టాక్‌ లేదని మెసేజ్ వస్తోందని మరికొందరు చెబుతున్నారు.
 
అక్టోబర్‌ 5
ఉచిత ఇసుకపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనాకు ఆదేశాలిచ్చారు. అంతేకాదు, ఇసుక వ్యవహారాలలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.
 
అక్టోబర్‌ 18
రీచ్‌ల నుంచి సొంత అవసరాలకు ఇసుకను ఉచితంగా ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్లలో తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లోనే కాకుండా నేరుగా రేవు వద్దకు వెళ్లి ఆధార్‌ ఇతర వివరాలు నమోదు చేసుకుని ఇసుక పొందవచ్చని చెప్పింది.
 
అక్టోబర్‌ 25
రీచ్‌లలో ధరలు ఎక్కువ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో సీనరేజీ ఫీజు, మైనింగ్‌ ఫీజు, జీఎస్టీలతో పాటు తవ్వకాలు, నిర్వహణ ఖర్చులు చెల్లించకుండానే రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లవచ్చని ఆదేశాలిచ్చింది. ఎన్‌జీటీ మార్గదర్శకాల ప్రకారం రుతుపవనాల సీజన్‌ ముగిసే అక్టోబర్‌ 15 వరకు తవ్వకాలకు అనుమతి లేదు. దాంతో గతంలో తవ్వి, నిల్వ కేంద్రాల్లో ఉంచిన ఇసుకను అప్పటి వరకు సరఫరా చేశారు. రుతుపవనాల సీజన్‌ ముగియడంతో అక్టోబర్ 16 నుంచి కూలీలతో ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. అయితే, ఎన్ని మార్పులు చేసినా ఇప్పటికీ ఏపీలో సామాన్యులకు ఇసుక అందుబాటులో లేదనే విమర్శలు ఉన్నాయి.
 
వారం రోజులుగా ఇసుక కోసం చూస్తున్నా..
“అసలు ఇసుక పోర్టల్‌ ఓపెన్‌ కావడం లేదు. నేను ఇంటి నిర్మాణం మొదలు పెట్టాను. వారం రోజుల నుంచి ఉచిత ఇసుక దరఖాస్తు కోసం పోర్టల్‌ ఓపెన్‌ చేస్తున్నా ఫలితం లేదు’’ అని విజయవాడ దేవీనగర్‌కు చెందిన శంభుప్రసాద్‌ బీబీసీతో చెప్పారు. “కొత్త ప్రభుత్వం ఇసుక విధానంలో నెలకో మార్పు చేసినా ఇసుక అంత సులువుగా దొరకడం లేదు. పోర్టల్ పని చేయదు. రీచ్ దగ్గరకెళ్లి నమోదు చేసుకుందామంటే స్టాక్ లేదంటున్నారు. అప్పటికీ ఇప్పటికీ రేటులో కూడా పెద్ద మార్పేమీ లేదు” అని తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకి చెందిన రైతు చిక్కం నరసింహమూర్తి బీబీసీతో చెప్పారు.
 
“ఇసుక కొరతతో నిర్మాణ పనుల్లేక నెల రోజులుగా ఖాళీగా ఉన్నాం. రాజమండ్రి రేవు వద్ద నుంచి మునగపాకకు ఆరు యూనిట్ల ఇసుక లారీ తీసుకువచ్చేందుకు గతంలో రూ. 25 వేల నుంచి రూ. 30వేలు ఉండేది. ఇప్పుడు రూ. 40 వేలు అవుతోంది” అని అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన మేస్త్రి విల్లూరి పరదేశినాయుడు చెప్పారు. దీనిపై అనకాపల్లి మైన్స్‌ ఏడీ శ్రీనివాసరావు స్పందిస్తూ.. అనకాపల్లి పరిధిలో ఇసుక రీచ్‌లు లేవని, స్టాక్‌ పాయింట్లు మాత్రమే ఉన్నాయన్నారు. వీటిని త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
 
రాజమండ్రి నుంచి ఆరు యూనిట్ల ఇసుక లారీ ధర రూ. 28 వేల నుంచి రూ. 30 వేలు అవుతుందని, అయితే డిమాండ్‌ మేరకు తవ్వి తీసేందుకు ఒక్కోసారి ధర పెరుగుతోందని చెప్పారు. తిరుపతి జిల్లాలో డిమాండ్‌ మేరకు ఇసుక దొరకడం లేదని, ధర కూడా గత ప్రభుత్వంలో కంటే తక్కువేమీ లేదని జిల్లా సీపీఎం నేత కందారపు మురళి ఆరోపించారు. “తిరుపతి జిల్లాలో రీచ్‌లు గానీ స్టాక్‌ యార్డులు గానీ లేవు. స్టాక్‌ యార్డులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కలెక్టర్‌తో మాట్లాడి ఆ మేరకు కార్యాచరణ చేపడతాం. ప్రస్తుతం బల్క్‌లో ఇసుక కావాలంటే నెల్లూరు, కడప రీచ్‌ల నుంచి తెచ్చుకుంటున్నారు’’ అని తిరుపతి మైనింగ్‌ ఏడీ బాలాజీ నాయక్‌ బీబీసీతో చెప్పారు.
 
వైసీపీ హయాంలో ఏం జరిగింది?
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొలువుదీరగానే ఎదుర్కొన్న తొలి సంక్షోభం ఇసుకే. 2016–19 మధ్య టీడీపీ హయాంలో అమలైన ఉచిత ఇసుక పాలసీని అధికారంలోకి రాగానే రద్దు చేసిన వైఎస్సార్‌సీపీ.. మెరుగైన పాలసీ రూపకల్పన పేరుతో జాప్యం చేసింది. 2019 సెప్టెంబర్‌ నుంచి ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పజెప్పి ఆన్‌లైన్‌ పద్ధతిలో ఇసుక బుకింగ్‌కు శ్రీకారం చుట్టింది. కానీ ఇసుక కొరత ఏర్పడటంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరకలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడంతో రాజకీయంగా దుమారం చెలరేగింది.
 
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దీనిపై విమర్శలు చేయగా.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైజాగ్‌లో భారీ ర్యాలీ చేసి, ఇసుక కొరతపై నిరసన తెలిపారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడిందని అంగీకరించిన అధికార వైఎస్సార్‌సీపీ.. 2021 ఏప్రిల్‌ నుంచి ఇసుక తవ్వకాలను జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ అనే ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పింది. అయితే ఆ సంస్థ తిరిగి టర్న్‌కీ అనే సంస్థకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. దాని స్థానంలో జిల్లాల్లో ఎక్కడికక్కడ సిండికేట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయని టీడీపీ విమర్శించింది. 2023 డిసెంబర్‌ నుంచి ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థకు ప్రభుత్వం లీజుకిచ్చింది. అయితే, జేపీ సంస్థ హయాంలో అనుమతులకు మించి తవ్వకాలు జరిగాయని, మొత్తంగా రూ. 2 వేల కోట్లకు పైగా భారీ కుంభకోణం జరిగిందంటూ ప్రస్తుత టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కేసు పెట్టారు. అప్పట్లో మైన్స్‌ డైరెక్టర్‌గా ఉన్న వెంకటరెడ్డిని అరెస్టు చేశారు.
 
2014–19 మధ్య ఏం జరిగింది?
ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామంటూ 2014లో డ్వాక్రా గ్రూపుల ద్వారా తవ్వకాలు చేపట్టింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. అయితే, ఇసుక తవ్వకాలను టీడీపీ నేతలు తమ చెప్పుచేతల్లో పెట్టుకుని, అక్రమార్జనకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించింది. నాటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుక వ్యవహారంలో తహసీల్దార్‌ వనజాక్షిపై దాడికి దిగారంటూ ఆరోపణలొచ్చాయి. అయితే తాను దాడి చేయలేదని, ఇసుక తవ్వకాలను అడ్డుకున్న తహసీల్దార్‌పై కోపంతో కొంతమంది మహిళలు దాడి చేస్తే అడ్డుకున్నానని చింతమనేని వివరణ ఇచ్చారు.
 
టన్ను ధర అప్పుడెంత, ఇప్పుడెంత?
వైసీపీ హయాంలో రీచ్‌లో టన్ను ఇసుకకు సీనరేజ్‌కి రూ. 66, జిల్లా ఖనిజ నిధికి రూ. 20, ఖనిజాన్వేషణ ట్రస్ట్‌కు రూ. 2 ప్రభుత్వ ఖజానాకు రూ. 287, తవ్వకాలు, ఇతర నిర్వహణ ఖర్చులకుగాను కాంట్రాక్టర్‌కి రూ.100 చొప్పున మొత్తంగా రూ.475 వసూలు చేసేవారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కొద్దిరోజుల పాటు సీనరేజ్‌కి రూ. 66, జిల్లా ఖనిజ నిధికి రూ. 20, ఖనిజాన్వేషణ ట్రస్ట్‌కు రూ. 2, తవ్వకాలు, నిర్వహణ ఖర్చులకు రూ. 55, నిల్వ కేంద్రాలకు రవాణా, జీఎస్టీ ఖర్చు రూ. 90 ఇలా మొత్తం రూ.233 ఉంది. అయితే, ఉచిత పాలసీ కింద ప్రభుత్వ ఖజానాకు రూపాయి కూడా చెల్లించనక్కరలేదని ప్రభుత్వం తర్వాత ప్రకటించింది. గత నెల 25న మరోసారి సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు... ఎలాంటి ఫీజు చెల్లించకుండా రీచ్‌ల నుంచి ఇసుక లోడ్‌ చేసుకుని తీసుకువెళ్లేలా ఆదేశాలు జారీ చేశారు.
 
టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక రీచ్‌లు: వైసీపీ
అధికార కూటమి నేతలే రీచ్‌ల వద్ద పెత్తనం చేస్తున్నారని, అందుబాటులో ఉన్న ఇసుక మొత్తం ఊడ్చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. “ఇసుక విధానంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇసుక రీచ్‌లన్నీ అధికార పార్టీ నేతలు హస్తగతం చేసుకున్నారు. వారు చెప్పిన రేటు కడితే తప్ప ఇసుక వచ్చే పరిస్థితి లేదు. ఇసుక విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని పైకి చంద్రబాబు చెబుతున్నప్పటికీ... నిజానికి టీడీపీ శ్రేణులకు వాటిని ఆదాయ వనరుగా చంద్రబాబే కట్టబెట్టేశారు” అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆరోపించారు.
 
రాజకీయ నేతల జోక్యాన్ని సహించం: కొల్లు రవీంద్ర
ఇసుక రీచ్‌ల విషయంలో ఏ పార్టీ నేతలు జోక్యం చేసుకున్నా సహించం అని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. “రాష్ట్రంలో ఇసుక పంపిణీ గాడిన పడుతోంది. రేటు తగ్గింది. లభ్యత పెరిగింది. రీచ్‌లు లేని చోట మినరల్‌ డీలర్‌షిప్స్‌ (ఎండీఎస్‌) ఇస్తాం. బల్క్‌ ఆర్డర్లు కాకుండా రెండు మూడు టన్నుల ఇసుక కావాలంటే ఎండీఎస్‌ల వద్దకు వెళ్తే చాలు. త్వరలో ఇవి అందుబాటులోకి వస్తాయి’’ అని రవీంద్ర బీబీసీతో చెప్పారు. ఇసుక విషయంలో ప్రస్తుతం ఎక్కడా దోపిడీ లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.పట్టాభి అన్నారు. ‘‘ఇసుక విషయమై టీడీపీ నేతలు ఎక్కడా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పారు. ఫీజులన్నీ జీరో చేసిన తర్వాత వినియోగదారుడు ఎంతో సంతోషంగా ఇసుక తీసుకువెళ్తున్నాడు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాదిరి ఎక్కడా దోపిడీ లేదు’’ అని పట్టాభి అన్నారు.
 
ఎన్ని ఇసుక రీచ్‌లు ఉన్నాయి?
రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు ఉన్న ఇసుక ర్యాంపులు 110 కాగా, బోట్స్‌ మెన్‌ సొసైటీలు నిర్వహించే మరో 42 పాయింట్లు ఉన్నాయి. కొత్తగా 108 ఇసుక రీచ్‌లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం... గత నెలలో 40 ఇసుక రీచ్‌లను వినియోగంలోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. కానీ, వరద ప్రభావం వల్ల వీటిలో కొన్ని మాత్రమే అందుబాటులోకి వచ్చాయని, ఈ నెలలో మిగిలినవన్నీ తెరుచుకుంటాయని గనుల శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
 
‘సీనరేజీ ఫీజు, మైనింగ్‌ ఫీజు, జీఎస్టీలతో పాటు తవ్వకాలు, నిర్వహణ ఖర్చులేమీ చెల్లించకుండా రీచ్‌ల నుంచి ఇసుక లోడ్‌ చేసుకుని, తీసుకెళ్లే ఉచిత ఇసుక విధానం ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. ప్రాసెస్‌ జరుగుతోంది. వరదల ప్రభావం ఉండటంతో ఇసుక రీచ్‌లన్నీ ఓపెన్‌ కాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో 15 ఇసుక రీచ్‌లు ఉండగా ఇప్పటి వరకు పెండ్యాల, ఇందుపల్లి, శనగపాడు రీచ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇసుక పోర్టల్‌లో సమస్య ఉంది. అందుకే సరిగ్గా ఓపెన్‌ కావడం లేదు. నాలుగైదు రోజుల్లో పోర్టల్‌ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఇసుక సమస్యలన్నీ వారం రోజుల్లో సర్దుకుంటాయి’ అని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధి గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎ.శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.
 
ఎటువంటి ఫీజులు లేకుండా ఇసుకను తవ్వి తీసుకువెళ్లొచ్చన్న ప్రభుత్వ ప్రకటన తర్వాత ఎక్కడికక్కడ అనుమతుల్లేని చిన్న చిన్న రేవుల వద్ద నుంచి, నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి, వాగులు, వంకల వద్ద నుంచి స్థానికులు, వ్యాపారులు ఇష్టారీతిన తవ్వి తీసుకువెళుతున్నారు. అలా తవ్వి తీసుకువెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : విజయానికి అడుగు దూరంలో డోనాల్డ్ ట్రంప్