Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైట్ హౌస్‌కు మతి చలించింది: ట్రంప్ కొత్త ఆంక్షలపై ఇరాన్ విమర్శ

Advertiesment
వైట్ హౌస్‌కు మతి చలించింది: ట్రంప్ కొత్త ఆంక్షలపై ఇరాన్ విమర్శ
, బుధవారం, 26 జూన్ 2019 (11:36 IST)
ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయాతుల్లా ఖొమైనీకి కూడా వర్తింపజేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం విధించిన కొత్త ఆంక్షలపై ఇరాన్ మండిపడింది. చర్చలు కోరుకొంటున్నామంటూ అమెరికా చెబుతున్న మాట అబద్ధమని ట్రంప్ తాజా చర్యలు చాటుతున్నాయని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ వ్యాఖ్యానించారు. అమెరికా కొత్త ఆంక్షలు నిరుపయోగమని విమర్శించారు. ట్రంప్ తాజా చర్యలు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌కు మతి చలించినట్లు సూచిస్తున్నాయని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు.
 
ఆంక్షల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావాద్ జరీఫ్‌ను లక్ష్యంగా చేసుకొనేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు రౌహానీ చెప్పారు. జరీఫ్‌ను లక్ష్యంగా చేసుకొని ఇదే వారంలో ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక శాఖ తెలిపింది. 2015 నాటి అణు ఒప్పందం చర్చల్లో ప్రధాన పాత్ర పోషించినవారిలో జరీఫ్ ఒకరు.
 
ఆంక్షలపై ట్రంప్ ఏమన్నారు?
అమెరికా డ్రోన్‌పై దాడి చేయడం, ఇతర కారణాలతో తాము అదనపు ఆంక్షలు విధించామని ట్రంప్ సోమవారం చెప్పారు. ఈ ఆంక్షలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు ఇచ్చిన తర్వాత అధ్యక్ష భవనంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ- అయాతుల్లా ఖొమైనీని కూడా ఈ ఆంక్షల పరిధిలో చేర్చడం చాలా అవసరమని తెలిపారు. "ఇరాన్ సుప్రీం నేతలు తమ పాలనలో జరిగే అన్నిటికీ బాధ్యులవుతారు. వారికి వారి దేశంలో చాలా గౌరవం ఉంటుంది. వారి అధీనంలో చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. ఈ ఆంక్షల తర్వాత ఇరాన్ సర్వోన్నత నాయకుడు, ఆయన కార్యాలయం, దానికి సంబంధించిన మిగతా అందరూ ఏదో ఒక విధంగా ఆర్థిక సహకారం కోల్పోతారు" అని ట్రంప్ చెప్పారు.
webdunia
 
తారస్థాయికి చేరిన ఉద్రిక్తతలు
ఇరాన్, అమెరికా మధ్య 2018 మే నుంచి ఉద్రిక్తతలు పెరుగుతూ వస్తున్నాయి. గత కొన్ని వారాల్లో అవి తారస్థాయికి చేరాయి. జూన్ 27 తర్వాత తమ అణు కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్ధారిత పరిధి కంటే పెంచుతామని ఇరాన్ ఇటీవల ప్రకటించింది. ఇరాన్, మరో ఆరు దేశాలతో కలిసి 2015లో కుదుర్చుకున్న చరిత్రాత్మక అణు ఒప్పందం నుంచి అమెరికా నిరుడు తనకు తానుగా వైదొలగింది. ఈ పరిణామంతో ఇరాన్-అమెరికా సంబంధాలు బీటలు వారాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఇరాన్ కూడా ఒప్పందం నుంచి పాక్షికంగా తప్పుకొంది.
 
తాను ఒప్పందం నుంచి వైదొలగిన తర్వాత అమెరికా ఇరాన్‌పై తిరిగి ఆంక్షలను విధిస్తూ వస్తోంది. ఒప్పందంపై తిరిగి చర్చలు జరిపేలా ఇరాన్‌‌ను ఒత్తిడి చేసేందుకు అమెరికా ఇలా వ్యవహరిస్తోంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య గల్ఫ్‌లో సౌదీ చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి. వాటి వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా అంటుంటే, ఇరాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఒక అమెరికా డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసింది. డ్రోన్ అప్పుడు అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల్లో ఉందని అమెరికా అంటుంటే, ఇరాన్ మాత్రం అది తమ సరిహద్దుల్లోకి ప్రవేశించిందని చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్షోభంలో బీఎస్ఎన్ఎల్.. ఉద్యోగులకు జీతాల్లేవ్.. షట్టర్ క్లోజ్ తప్పదా?