ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బోణీ చేసింది. యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనిలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ జట్టును పది పరుగుల తేడాతో ఓడించగలిగింది. విరాట్ జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా, 19.4 ఓవర్లకు 153 పరుగులు మాత్రమే చేసి సన్‌రైజర్స్ జట్టు కుప్ప కూలింది.
రాయల్ ఛాలెంజర్స్‌లో చాహల్ మూడు, శివం దుబే, సైని రెండేసి వికెట్లు తీశారు. 16వ ఓవర్ రెండో బంతి వరకు హైదరాబాద్ జట్టు బలంగా ఉంది. అప్పటికి రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 121 పరుగులు చేసి, విజయంవైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. కానీ 32 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయి అనూహ్యంగా ఓటమి పాలైంది.
బాల్‌తో చాహల్ మ్యాజిక్
సన్‌రైజర్స్ జట్టుకు మంచి ఓపెనింగ్ లభించలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. అయితే తర్వాత వచ్చిన జాన్ బెయిర్‌స్టో మనీశ్ పాండేతో కలిసి రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. మనీశ్ పాండే 33 బంతుల్లో 34 పరుగులు చేసి, యుజ్వేంద్ర చాహల్ బంతికి అవుటయ్యాడు.
బెంగళూరు టీమ్ నుంచి మూడుసార్లు లైఫ్ లభించడంతో బెయిర్‌స్టో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అయితే అతని దూకుడుకు చాహల్ బ్రేక్ వేశాడు. బెయిర్‌స్టో 43 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేశాడు.
ఖాతా కూడా తెరవని విజయ్‌శంకర్‌ను తరువాతి బంతితో చాహల్ అవుట్ చేశాడు. నాలుగు ఓవర్లలో చాహల్ 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. శివం దుబే 17వ ఓవర్లో ప్రియంగార్గ్(12)ను పెవిలియన్‌కు పంపాడు.. అదే ఓవర్‌లో అభిషేక్ శర్మ(1) రనౌట్ అయ్యాడు. గాయపడిన సీన్ మార్ష్ ఖాతా తెరవలేక పోయాడు. చివరికి సందీప్‌శర్మ వికెట్ తీసి డేల్ స్టెయిన్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
విజృంభించిన దేవదత్
అంతకు ముందు బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 163 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌లో దేవదత్ హీరోగా నిలిచాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న దేవదత్ ఆత్మవిశ్వాసంతో ఆడి 42 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి.
ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి దేవదత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భువనేశ్వర్, సందీప్‌శర్మ.. ఇలా ఎవరినీ వదిలి పెట్టలేదు. సందీప్ శర్మ తొలి ఓవర్‌లోనే దేవదత్ రెండు ఫోర్లు కొట్టాడు. రెండు లైఫ్‌లు పొందిన దేవదత్ 56 పరుగులు చేసి కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీతోపాటు జట్టు పటిష్టమైన స్కోరుకు పునాది వేశాడు.
నిరాశపరిచిన విరాట్
సుమారు ఏడు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు. 14 పరుగులు మాత్రమే చేయగలిగిన విరాట్, నటరాజన్ బంతిని బౌండరీ దాటించే ప్రయత్నంలో రషీద్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఏబీ డివిలియర్స్ జాగ్రత్తగా జట్టును మళ్లీ ముందుకు నడిపించాడు. 30 బంతులు ఆడిన డివిలియర్స్ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు.
పొదుపుగా భువనేశ్వర్ బౌలింగ్
20వ ఓవర్ మూడో బంతికి డివిలియర్స్ అవుటయ్యాడు. మిగిలిన మూడు బంతులకు భువనేశ్వర్ కుమార్ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో తొలి పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసిన బెంగళూరు, తరువాతి 10 ఓవర్లలో 77 పరుగులు మాత్రమే జోడించగలిగింది.
హైదరాబాద్ జట్టులో బౌలర్ భువనేశ్వర్ కుమార్ పొదుపుగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. విజయ్ శంకర్, టి నటరాజన్, అభిషేక్ శర్మలు ఒక్కో వికెట్ తీసుకున్నారు.