Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్: నర్సరీ విద్యార్థులకు ర్యాంకులు, విమర్శలకు కారణమైన హోర్డింగ్

హైదరాబాద్: నర్సరీ విద్యార్థులకు ర్యాంకులు, విమర్శలకు కారణమైన హోర్డింగ్
, శుక్రవారం, 4 అక్టోబరు 2019 (14:29 IST)
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలో టాపర్లు అంటూ విద్యార్థుల ఫొటోలతో బ్యానర్‌ను ప్రదర్శించడం విమర్శలకు దారితీసింది. దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని సత్యానగర్‌లో ఉన్న ప్రియ భారతి హైస్కూల్ ఆ బ్యానర్‌ను ఏర్పాటు చేసింది. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో "నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఒకటో తరగతుల టాపర్లు వీరే" అంటూ విద్యార్థుల ఫొటోలతో ఉన్న ఒక ఫ్లెక్సీని ఆ పాఠశాల వద్ద ఏర్పాటు చేశారు.

 
ఆ బ్యానర్ ఫొటో సెప్టెంబర్ ఆఖరులో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనేక మంది నెటిజన్లు దానిని షేర్ చేస్తూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఆ పాఠశాల తీరును తప్పుబడుతూ, చిన్నారుల ఫొటోలను ఇలా ఫ్లెక్సీపై పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయం వైరల్ కావడంతో పాఠశాల యాజమాన్యం ఆ బోర్డును తొలగించింది.

 
"ఈ ఏడాది మే- జూన్ నెలల్లో ఆ బ్యానర్‌ను ఏర్పాటు చేశాం. అది కూడా విద్యార్థుల తల్లితండ్రులు అడిగినందుకే పెట్టాం. మామూలుగా పదో తరగతి విద్యార్థుల ఫొటోలను పెడుతుంటాం. ఈసారి చిన్న పిల్లలవి కూడా పెట్టాం. అందులో మేమేదో తప్పు చేశామంటూ సోషల్ మీడియాలో దుమారం చేస్తున్నారు" అని ప్రియ భారతి స్కూల్ కరస్పాండెంట్ జి.సుందర్ బాబు చెప్పారు.

 
ఈ ఫొటో సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలువడిన తరువాత 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో విద్యావిధానంపై తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, విద్యావేత్తలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు.

 
విద్యార్థులు ప్రాణాలను తీసుకునేందుకు కూడా సిద్ధపడటానికి ముఖ్య కారణం 'ర్యాంకులే ముఖ్యం' అన్నట్టుగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థల తీరు, తల్లితండ్రులు పిల్లలపై పెడుతున్న ఒత్తిళ్లే అన్నారు విద్యావేత్తలు. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరదా రెడ్డి కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.

 
అయితే, కొందరు విద్యార్థులను కించపరచాలనో లేక మరో దురుద్దేశంతోనే తాము ఈ బ్యానర్ ఏర్పాటు చేయలేదని పాఠశాల యాజమాన్యం అంటోంది. "బోర్డు మీద తమ ఫొటోలు చూసుకొని పై తరగతులకు వెళ్తున్న పిల్లలు ఆనందపడతారని అలా చేశాం. అలాగని, మా పాఠశాలలో బాగా చదివే విద్యార్థులనే గుర్తిస్తాం అని కాదు. ఇతర యాక్టివిటీలలో ఉండే పిల్లల ఫొటోలు స్కూల్‌లో నోటీసు బోర్డు మీద పెడతాం" అన్నారు సుందర్ బాబు.

 
"విద్యార్థుల తల్లితండ్రులు వచ్చి ఆ బోర్డును చూసి ఫొటోలు తీసుకుంటూ, ఇతరులకూ పంపి గర్వంగా ఫీల్ అవుతున్నారని దానిని అలాగే ఉంచాం. ఈ వివాదం తరువాత తొలగించాం" అని ఆయన చెప్పారు. నర్సరీ నుంచి ఎల్‌కేజీకి వెళ్లబోతున్న ఐదేళ్ల రోహిత్ ఫొటో కూడా ఆ బోర్డు మీద ఉంది. ఆ బోర్డులో తమ అబ్బాయి ఫొటోను చూసి చాలా ఆనందించామని అన్నారు రోహిత్ తల్లి.

 
"మా బాబు ఫొటో చూస్తే చాలా సంతోషంగా కలిగింది. ఆ బోర్డును ఫొటో తీసి మా చుట్టాలకు, సన్నిహితులకు వాట్సాప్‌లో పంపాం. మా బాబు చదువులో ఫస్ట్ అన్న విషయం కేవలం మా ఇంట్లో వాళ్లకే తెలిస్తే ఎలా... అందరికీ తెలియాలి కదా. అయినా, అలా పెట్టాలని తల్లిదండ్రుల్లో కొంత మంది పాఠశాల వారిని కోరాం. అది చాలా మంచి పాఠశాల" అని ఆ బోర్డు మీద 'నర్సరీ టాపర్' అని ఫొటో ఉన్న ఒక విద్యార్ధి తల్లి వివరించారు.

 
కానీ, తల్లితండ్రుల్లో ఈ ఆలోచనా ధోరణి మారాలంటున్నారు మానసిక నిపుణులు. "ఇలాంటి వాటి వల్ల పిల్లల్లో అనవసరమైన ఒత్తిళ్లు ఏర్పడతాయి. అంతేకాక, తల్లితండ్రులు పిల్లల మధ్య వాస్తవ విరుద్ధమైన పోటీని మొదలు పెడతారు. అంత చిన్న వయసులో పిల్లలకు పరీక్షలు, ర్యాంకులు, కాంపిటీషన్ అన్న విషయాలు అర్థంకావు. ఇలా ర్యాంకు వచ్చిన వారిని ఆకాశానికెత్తుతూ హోర్డింగులు పెట్టడం పిల్లల్లో ఒత్తిడి, మానసిక సమస్యలకు దారి తీయవచ్చు. పిల్లల్లో ఆత్మ విశ్వాసం తగ్గుతుంది. ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. అందరు పిల్లలూ ఒకేలా ఉండరు. కొంతమందికి ఇది సానుకూలంగా పనిచేస్తుంది. కానీ, కొంత మంది పిలల్లకు అది హాని చేయవచ్చు. పసి వయసు నుంచే ర్యాంకులు అంటూ చదువులను ఇలా కమర్షియల్‌ చేయడం ఏమాత్రం సరికాదు" అంటున్నారు మానసిక నిపుణురాలు స్వాతి.

 
చౌకబారు ప్రచారం కోసం పిల్లలను వాడుకుంటున్న ఇలాంటి పాఠశాలలను వెంటనే మూసివేయాలని బాలల హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. "ఆ పాఠశాల యాజమాన్యానికి పైత్యం నెత్తికెక్కింది. నర్సరీ, ఎల్‌కే‌జీ, యూకేజీ, ఒకటో తరగతి పిల్లల పేర్లను, ఫొటోలను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే బ్యానర్ల మీద ముద్రించి, వారు టాపర్లు అంటూ ప్రకటించారు. ఆ బ్యానర్‌లో ఫొటో లేని పిల్లల మనసులపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు చదువుకు దూరం కావడం, సహచర విద్యార్ధులపై ద్వేషం పెంచుకోవడం లాంటి దుష్పరిణామాలకు దారి తీస్తుంది. ఇది యాజమాన్యం చేసిన బుద్ధిలేని పని" అని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు అన్నారు.

 
దీనిపై విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ & డైరెక్టర్ల స్పందన కోసం ప్రయత్నించినా వారి నుంచి సమాధానం రాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేజీలు మీ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి?