Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖపట్నంకు ఆ పేరు ఎలా వచ్చింది? వైజాగ్‌గా ఎలా మారింది? చరిత్ర ఏం చెబుతోంది?

Advertiesment
విశాఖపట్నంకు ఆ పేరు ఎలా వచ్చింది? వైజాగ్‌గా ఎలా మారింది? చరిత్ర ఏం చెబుతోంది?
, సోమవారం, 13 జనవరి 2020 (16:13 IST)
ఇప్పుడు విశాఖపట్నం పేరు మార్మోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాటలు నిజమైతే ఈ రేవు పట్టణం రేపు ఆంధ్రుల రాజధాని కూడా కాబోతోంది. ఇంతకీ విశాఖపట్నానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆరా తీస్తే చాలా కథలే ఉన్నాయి. అసలు ఏ నగరానికీ లేనన్ని కథలు విశాఖపట్నం పేరు విషయంలో ఉన్నాయి. చరిత్రకారుల దగ్గర కూడా స్పష్టమైన ఆధారాలు విశాఖ నగరం విషయంలో లేవు.

 
ఇసకపల్లి: ఇక్కడ ఇసుక బాగా దొరుకుతుంది కాబట్టి స్థానికులు దీన్ని ఇసుకపల్లి అనేవారనీ, కాలక్రమంలో అది విశాఖపట్నంగా మారిందనే వాదన ఒకటుంది. దీనికి ఎటువంటి ఆధారమూ లేదు.

 
వైశాఖ దేవి గుడి: దాదాపు 600 సంవత్సరాల కిందట ఇక్కడ వైశాఖ మాత గుడి ఉండేదనీ, కాలక్రమంలో ఆ గుడి కనుమరుగు అయిందనీ, కానీ ఆవిడ పేరిటే ఈ నగరం విశాఖ పేరుతో స్థిరపడిందని మరో కథ ఉంది. ఈ కథను వైజాగపటం జిల్లా గెజిట్‌లో అప్పటి బ్రిటిష్ అధికారి ఫ్రాన్సిస్ రాసినట్టు ఇంటాక్ సంస్థ విశాఖపట్నం విభాగానికి చెందిన ఎడ్వర్డ్ పాల్ చెప్పారు. అయితే అది కథ మాత్రమే అనీ, దానికి ఆధారాలు కానీ, ఆ గుడి కానీ లేదని ఆ గెజిట్‌లో స్పష్టంగా రాసినట్టు ఆయన వివరించారు.

 
విశాఖ భిక్షువు: బౌద్ధ మతంలో విశాఖ అనే భిక్షువు ఉండేది. ఆమె జైనమతం నుంచి బౌద్ధానికి మారి, తన ఆస్తినంతా బౌధ్ధం కోసం ఇచ్చేసి, సన్యాసిగా స్థిరపడింది. ఆమె పేరిటే ఆ నగరానికి విశాఖ అనే పేరు వచ్చినట్టు కథనం ఉందని వివరించారు చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి. అయితే దానిపై కూడా లిఖిత పూర్వక ఆధారం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

 
విశాఖ - కుమారస్వామి: శివుడి కుమారుడు కుమార స్వామికి విశాఖ అనే పేరు కూడా ఉంది. అతని నక్షత్రం కూడా విశాఖే. అతని గుడి ఇక్కడ ఉండేదనీ, అతని పేరిటే ఈ నగరానికి ఆ పేరు వచ్చిందనే వాదన కూడా ఉంది.

 
కులోత్తుంగపట్నం: 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు ఈ ప్రాంతాన్ని జయించాడు. దీంతో ఈ నగరానికి కులోత్తుంగపట్నం అనే పేరు పెట్టాడు అతను. విశాఖపట్నం నుంచి తంజావూరు వరకూ అతని రాజ్యం ఉండేది. కానీ అతని తదనంతరం ఆ పేరు కనుమరుగు అయిపోయింది. ఈ విషయాన్ని చరిత్రకారులందరూ ధృవీకరించారు.

 
ఇశాక్: సముద్రయానం చేసేవారు తమకు ఆపదలు రాకుండా దేవుడిని ప్రార్థిస్తారు. బౌద్ధ పద్ధతుల్లో అవలోకుడిని ఆరాధించేవారు. ఓడల్లో కూడా అతని పేరిట హుండీలు, ఓడరేవుల్లో అతని ఆలయాలు ఉన్నాయి. సముద్ర వాణిజ్యం బలంగా ఉన్నచోట్ల బౌద్ధమత ప్రభావం బాగా ఉండేది. ఈ ఆరాధన కూడా భారత్‌తో పాటూ ఇటు ఆగ్నేయాసియా, అటు పర్షియా వరకూ కనిపించేది. కానీ అరబ్ వ్యాపారుల హవా పెరిగిన తరువాత ఇశాక్‌ను ప్రార్థించడం కనిపించింది. అరబ్బు వ్యాపారులు తమ సముద్ర ప్రయాణాలు బావుండాలని ఇశాక్ అనే సూఫీ గురువును ప్రార్థించేవారు.

 
విశాఖపట్నంలో కూడా ఈ ఇశాక్ దర్గా ఉంది అంటూ సముద్ర ప్రయాణాల విషయంలో నావికుల నమ్మకాలను మతాలు ఎలా ప్రభావితం చేశాయో వివరించారు చరిత్ర రచయిత సాయి పాపినేని. విశాఖలోని ఈ ఇశాక్ దర్గా పేరిటే ఇది విశాఖపట్నం అయి ఉండొచ్చు అని వాదన కూడా ఉంది. ఈ ఇశాక్ మదానీ దర్గా దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మించారు.

 
విశాఖ వర్మ అనే రాజు పాలించాడనీ, విశాఖ అనే బౌద్ధ రాణి పాలించిందనీ, ఇలా ఇంకా చాలా కథనాలు విశాఖ పేరిట ఉన్నాయి. అయితే వీటిలో ఏ కథకూ శాస్త్రీయమైన ఆధారం కానీ, పక్కా సాక్ష్యం కానీ లేవు. ఇక హ్యుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కూడా విశాఖ అనే రాజ్యం గురించి ప్రస్తావించాడని కొందరు చెబుతారు కానీ అదీ అవాస్తవమే.

 
వైజాగపటం: అందుబాటులో ఉన్న రికార్డుల్లో ఈ పేరు ఉంది. విశాఖపట్నం నోరు తిరగక, దాన్ని ఇంగ్లిష్ వారు ఉచ్చరించి, తమకు అర్థమైనట్టుగా ఇంగ్లిష్ స్పెల్లింగులో రాస్తే అదే వైజాగపటం అయింది. మొత్తం బ్రిటిష్ రికార్డులు అన్నిట్లోనూ ఈ వైజాగపటమే ఉంటుంది.
ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇంగ్లిష్‌లో వైజాగపటం అని రాసినా, తెలుగులో రాసేప్పుడు మాత్రం విశాఖపట్నం అనే రాశారు బ్రిటిష్ వాళ్లు. అప్పటి ప్రభుత్వ ముద్రలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. కానీ ఆ వైజాగపటంలోని మొదటి మూడక్షరాలూ వైజాగ్‌గా ఇప్పుడు బాగా వాడకంలో ఉంది.

 
ఇక వైజాగపటం కొత్త పేరు కాదు, కేవలం ఉచ్ఛారణ తేడా కాబట్టి దాన్ని పరిగణించక్కర్లేదు. కానీ వీటన్నిటికంటే బలమైన సాక్ష్యం ఒకటి విశాఖపట్నం విషయంలో ఉంది. అదే ద్రాక్షారామంలో దొరికిన శిలా శాసనం.

 
విశాఖ: విశాఖ అనే పేరుతో ఉన్న ఊరి గురించి మొదటిసారి చారిత్రక ఆధారాల్లో కనిపించింది తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి గుడిలోనే. విశాఖ నుంచి వచ్చిన ఒక వ్యాపారి అక్కడ శాశ్వత దీపారాధనకు ఏర్పాట్లు చేసి దానం ఇచ్చినట్టుగా ఉన్న శిలా శాసనం లభించింది. ఇది 1068 సంవత్సరం అంటే 11 శతాబ్దం నాటి శాసనం. ఆ శాసనంలోని విశాఖ, ఇప్పటి విశాఖా ఒకటేనని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్ముతున్నారు. విశాఖ అనే పదం స్పష్టంగా, పక్కాగా కనిపించిన ఆధారం ఉంది కాబట్టి, అది కూడా 900 సంవత్సరాల పాతది కాబట్టి, పైన ఉన్న కథనాల్లో చెప్పినట్టుగా వేరే పదాలు విశాఖగా మారాయి అనే వాదన కూడా సరికాదని చరిత్రకారుల అభిప్రాయం.

 
పట్నం: పట్నం అనే పదం దక్షిణ భారతంలో విపరీతంగా కనిపిస్తుంది. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఒకప్పటి రేవు పట్టణాలన్నిటికీ చివర్న ఈ పదం ఉంటుంది. పట్నం అంటే అప్పట్లో ఓడరేవు ఉన్న పట్నమే అని చరిత్రకారులు చెబుతారు. దీనికి సిటీ లేదా టౌన్ అనే అర్థం. కళింగపట్నం, గంగపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, దుర్గరాజపట్నం.. ఇవన్నీ ఆంధ్రా కోస్తాలోని ఒకప్పటి రేవు పట్టణాలే. ఇప్పుడు వీటన్నిటిలో పెద్దది విశాఖపట్నం.

 
విశాఖ ప్రాంతాన్ని కళింగ రాజులు, వేంగి రాజులు పాలించారు. ఈ ప్రాంతంలో బౌద్ధ మతానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు కూడా దొరికాయి. అశోకుడు, కృష్ణదేవరాయలు ప్రత్యక్షంగా విశాఖ నగరాన్ని కాకపోయినా, ఈ ప్రాంతం ఉన్న రాజ్యాలను జయించారు. ఆధునిక కాలంలో 1803లో జిల్లా కేంద్రంగా అయింది. 1858లో మునిసిపాలిటీ అయింది. 1979లో విశాఖ సిటీగా మారింది. 2005లో విశాఖ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌గా మారింది.

 
మొత్తానికి, ప్రస్తుతానికి ద్రాక్షారామంలో ఉన్న శాసనమే విశాఖ అనే పదం కనిపించిన తొలి శాసనం. ఒకవేళ ఈ శాసనంలో ఉన్న విశాఖా, ఇప్పటి విశాఖా ఒకటే అయితే కనుక.. ఇసుక లేదా ఇశాక్ పదాలు విశాఖగా రూపాంతంరం చెందాయన్న వాదన పక్కకు పోతుంది. కానీ, అసలా విశాఖ అనే పదం ఎలా వచ్చిందన్న ప్రశ్నే ఇంకా మిగిలే ఉంటుంది!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీడెవడ్రా బాబూ... ఇంత జరుగుతున్నా హాయిగా కూర్చుని చిప్స్ తింటున్నాడు.. (Video)