ఉత్తర కొరియా అనేక స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణ కొరియా నుంచి వచ్చిన కథనాలు వెల్లడించాయి. దేశ తూర్పు సరిహద్దుల్లోని హోడో ద్వీపకల్పంలో ఈ పరీక్షలు జరిపినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. ఒక వేళ ఇది నిర్ధరణ అయితే, 2017 నవంబర్ తర్వాత ప్యాంగ్యాంగ్ ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది.
వ్యూహాత్మక మార్గనిర్దేశిక ఆయుధం (టాక్టికల్ గైడెడ్ వెపన్) గా పిలిచే క్షిపణిని పరీక్షించామని గత నెలలోనే ప్యాంగ్యాంగ్ వర్గాలు తెలిపాయి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వియత్నాంలో సమావేశమైన అనంతరం ప్యాంగ్యాంగ్ క్షిపణి పరీక్షలు చేయడం ఇదే తొలిసారి. అయితే, దీర్ఘశ్రేణి క్షిపణి, అణు క్షిపణులు కాకుండా స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించడంతో ఉత్తర కొరియా తనపై విధించిన ఆంక్షలను ఉల్లఘించకుండా తప్పించుకున్నట్లయింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఫిబ్రవరిలో సమావేశమయ్యారు. కిమ్ జోంగ్ ఉన్ ప్రతిపాదనలు అంగీకారయోగ్యం కావంటూ ట్రంప్ ఫిబ్రవరిలో హనోయ్ సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశారు. కానీ, అణ్వాయుధ కార్యక్రమాలను నిలిపివేయడంపై కిమ్ కఠిన చర్యలు తీసుకునేవరకూ ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా చెబుతుండటంపై ప్యాంగ్యాంగ్ వర్గాల్లో అసహనం పెరుగుతున్నట్లుంది అని బీబీసీ ప్రతినిధి లారా బికర్ అభిప్రాయపడ్డారు. ''ఉత్తర కొరియా ఈరోజు చేపట్టిన చర్యల గురించి మాకు అవగాహన ఉంది. మా పర్యవేక్షణ కొనసాగిస్తూనే ఉంటాం'' అని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ అన్నారు.
అణు పరీక్షల ప్రతిన
''స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 9.06 గంటల నుంచి 9.27 గంటల మధ్య వోన్‌సాన్ పట్టణం సమీపంలోని హోడో ద్వీపకల్పం నుంచి ఈశాన్య దిశగా అనేక స్వల్ప శ్రేణి క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించింది'' అని దక్షిణ కొరియా సైనిక ఉన్నాతాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 70 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లిన క్షిపణులు జపాన్ సముద్రతీరంలో పడిపోయాయని చెప్పారు.
వ్యూహాత్మక దిశానిర్దేశిక ఆయుధంగా అభివర్ణిస్తున్న ఈ క్షిపణి పరీక్షను కిమ్ పర్యవేక్షించినట్లు ఉత్తర కొరియా వార్తా సంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది. భిన్న లక్ష్యాలపై వివిధ పద్ధతుల్లో ఈ పరీక్షలు జరిపారని తెలిపింది. అంటే భూమి, సముద్రం, గగన తలం.. మూడు చోట్ల నుంచి ప్రయోగించగల ఆయుధాలను పరీక్షించి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఆ ఆయుధాలు క్షిపణులా కాదా అనేది స్పష్టం కాలేదు. ఇది స్వల్ప శ్రేణి ఆయుధం కావొచ్చని చాలామంది పరిశీలకులు భావిస్తున్నారు. అణుపరీక్షలు, దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణుల ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు గతేడాది కిమ్ వెల్లడించారు.
కానీ అణుకార్యక్రమాలు కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తర కొరియాలోని ప్రధాన అణుకేంద్రం వద్ద జరుగుతున్న చర్యలంటూ కొన్ని ఉపగ్రహ చిత్రాలు కూడా చూపించాయి. ఇదంతా... రేడియో ధార్మిక పదార్థాలను బాంబు ఇంధనంగా మారుస్తూ ఉండొచ్చని భావిస్తున్నారు. దీర్ఘశ్రేణి క్షిపణుల్లో అమర్చగల చిన్న అణుబాంబుతోపాటు, అమెరికాపై దాడి చేయగల సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణిని తయారుచేసినట్లు ఉత్తర కొరియా చెబుతోంది.