Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విక్టోరియా మహారాణికి 'ఒంగోలు గిత్త'... బ్రెజిల్‌లో ఫుల్... ఏపీలో నిల్...

విక్టోరియా మహారాణికి 'ఒంగోలు గిత్త'... బ్రెజిల్‌లో ఫుల్... ఏపీలో నిల్...
, గురువారం, 6 జూన్ 2019 (14:51 IST)
‘‘అది 1868. భారతదేశం నుంచి ఇంగ్లండ్‌కు ఒక ఓడ బయలుదేరింది. విక్టోరియా మహారాణి కోసం పంపుతున్న కొన్ని బహుమతులు కూడా అందులో ఉన్నాయి. అనుకోకుండా ఆ ఓడ బ్రెజిల్ తీరానికి చేరుకుంది. విక్టోరియా మహారాణి కోసం పంపిన బహుమతులను అక్కడ అమ్మేశారు. ఆ బహుమతులే.. రెండు ఒంగోలు జాతి పశువులు. ఆ విధంగా బ్రెజిల్ గడ్డపై ఒంగోలు జాతి ప్రస్థానం ప్రారంభమైంది.’’
 
ఈ మేరకు 2001లో సెకండ్ ఇంటర్నేషనల్ సింపోసియం ఆన్ ఒంగోల్ క్యాటిల్ సావనీర్‌ పేర్కొంది. ఇలా ఒంగోలు జాతి పశువులు అక్కడ అడుగుపెట్టి ఇప్పటికి 150 ఏళ్లు అవుతోంది. ఈ పదిహేను దశాబ్దాల్లో ఎన్నో మార్పులు. రెండు పశువులతో వాటి ప్రయాణం మొదలై ఇప్పుడు కొన్ని కోట్లకు చేరింది. భారత ప్రభుత్వం 1962లో ఎగుమతులను నిషేధించే వరకు ఒంగోలు జాతి బ్రెజిల్‌కు తరలిపోతూనే ఉండింది. పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్‌లో మనుగడ కోసం పోరాడుతున్న ఒంగోలు జాతి బ్రెజిల్‌లో ఎందుకు వెలుగులీనుతోంది? 
 
బ్రెజిల్‌లో 80% పైనే...
బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ జెబు (ఏబీసీజీ) బ్రీడర్స్ లెక్కల ప్రకారం ప్రస్తుతం బ్రెజిల్ పశుసంపద సుమారు 22 కోట్లు. వీటిలో దాదాపు 80శాతం మేలురకం, సంకరజాతి ఒంగోలు పశువులున్నాయి. గత 80 ఏళ్లలో అధికారికంగా 10 కోట్లకు పైగా ఒంగోలు జాతి పశువులను ఇక్కడ గుర్తించినట్లు ఉబరబాలోని ఏబీసీజీ హై కౌన్సిల్ సభ్యుడు జోస్ ఒటావియో లెమోస్ తెలిపారు.
 
ఒంగోలు జాతి పశువులు ఎందుకింత ఆదరణ?
బ్రెజిల్ వాతావరణంలో ఒంగోలు జాతి చక్కగా ఇమిడి పోయింది. తక్కువ ఆహారంతోనూ జీవించే ఈ జాతికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ. బ్రెజిల్ ప్రజల ప్రధాన ఆహారంలో పశుమాంసం ఒకటని లెమోస్ అన్నారు. ఆ దేశంలో దాదాపు 43 కోట్ల ఎకరాల గడ్డి భూములున్నాయి. అంటే సగటున ఒక్కో పశువుకు సుమారు రెండు ఎకరాల భూమి ఉంది. అందువల్ల పోషణ సులభంగా ఉంటుంది. అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇండోనేసియా, మారిషస్, కొలంబియా, మలేసియా ఇలా పలుదేశాలకు ఒంగోలు జాతి విస్తరించింది.
 
మరి సొంతగడ్డలో పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో వెలుగులీనుతున్న ఒంగోలు జాతి సొంతగడ్డపై మనుగడ కోసం పోరాడుతోంది. 2012 పశుగణన ప్రకారం భారతదేశంలో వాటి సంఖ్య 6.34 లక్షలు. ఇందులో 5.79 లక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిలో మేలుజాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమేనని గుంటూరు లాం ఫాంలోని పశు పరిశోధనా కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ముత్తారావు తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. ఈ పరిస్థితికి కారణాలు...
 
వ్యవసాయంలో ఎప్పుడైతే యాంత్రీకరణ ప్రారంభమైందో మెల్లగా పశువుల అవసరం లేకుండా పోయింది. అవసరం లేదు కనుక ఆదరణ కూడా తగ్గిపోయింది. నాడు పశువుల పేడ, మూత్రాలను పొలంలో ఎరువుగా ఉపయోగించేవారు. ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది. గ్రామీణ కుటుంబాలకు పాలు ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో ఆవుల స్థానాన్ని పాలదిగుబడి ఎక్కువగా ఉండే గేదెలు ఆక్రమించాయి. సజ్జ, జొన్న వంటి ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి, పొగాకు, మిరప సాగు పెరిగాయి. దీంతో పశువులకు గ్రాసం కరవైంది.
 
దెబ్బతీసిన క్రాస్ బ్రీడింగ్:
ప్రభుత్వం 1960లలో తీసుకొచ్చిన కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్‌ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపింది. విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టిన్ వంటి వాటితో ఆ జాతిని కలపడంతో మేలురకం పలుచబారిందని ఎం.ముత్తారావు తెలిపారు. హరప్పా మొహంజదారో కాలంలోనే.. ఒంగోలు జాతి చాలా పురాతనమైనదిగా కనిపిస్తోంది. హరప్పా, మొహంజదారో నాగరికతల్లోనూ మూపురం కలిగిన ఎద్దుల చిత్రాలు కనిపించాయి.
webdunia
 
శివుని వాహనంగా కనిపించే నంది విగ్రహాలు ఒంగోలు జాతికి దగ్గరగా ఉంటాయి. సైబీరియా ప్రాంతంలో పుట్టిన ఈ జాతి ఆర్యుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఆ తరువాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో గుండ్లకమ్మ, మూసి, ఆలేరు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డాయన్న వాదనలూ ఉన్నాయని డాక్టర్ ఎం ముత్తారావు అన్నారు. నేడు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.
 
ఒంగోలు జాతి పందెం గిత్త.. అప్పట్లో ఒక గిత్త ధర 300 రూపాయలు
ఒంగోలు జాతి లక్షణాల గురించి 1885లో బ్రిటీష్ అధికారి జాన్ షార్ట్ రాశారు. ఇవి సగటున 700 కేజీల నుంచి 900 కేజీల బరువులను సునాయాసంగా లాగుతాయని, షార్ట్ రాతల ద్వారా తెలుస్తోంది. ఒక ఆవు రోజుకు సుమారు 20 లీటర్ల పాలు ఇస్తుంది. మేలురకం ఆవు రూ.200-300 పలికేది. ఎద్దును రూ.300-350 కొనుగోలు చేసేవారు. నెల్లూరు కలెక్టర్ 1858లో తొలిసారిగా ఒంగోలు జాతి పశు ప్రదర్శనను ప్రారంభించారు. ఒంగోలు జాతి రక్షణ కోసం ప్రతి గ్రామంలో కొంత భూమిని గ్రాసం కోసం వదలాలని 1867లో బ్రిటీష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ఒంగోలుజాతి పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1986లో గుంటూరు జిల్లా లాం ఫాంలో పశు పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించాయి. ఇది ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కింద పని చేస్తోంది. దీని ద్వారా జన్యు పరిరక్షణకు కృషి చేస్తున్నారు. '‘పిండ మార్పిడి ద్వారా ఎక్కువ దూడలను పుట్టించేలా చర్యలు తీసుకుంటున్నాం. మంచి ఆబోతుల నుంచి సేకరించిన నాణ్యమైన వీర్యాన్ని సరఫరా చేస్తున్నాం. ఈ 30 సంవత్సరాల కాలంలో దాదాపు 5 లక్షల వీర్యం డోసులను రైతులకు పంచాం’' అని డాక్టర్ ఎం.ముత్తారావు బీబీసీతో అన్నారు.
 
'ఖరీదైన వ్యవహారం'
ఒంగోలు జాతి పశువులను రక్షించాలని, వాటి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని పోషకులు, రైతులు కోరుతున్నారు. విజయవాడకు చెందిన ఉలవచారు వెంకటరత్నం పందెం గిత్తలను కొన్ని దశాబ్దాలుగా పోషిస్తున్నారు. పందెం కోడెలను కొని, వాటికి శిక్షణ ఇవ్వడం చాలా ఖరీదైన వ్యవహారమని ఆయన అంటున్నారు. పోటీలకు వెళ్లగలిగే ఒక్కో గిత్త ధర రూ.5లక్షల నుంచి -20 లక్షలు ఉంటుందని వెంటరత్నం చెప్పారు. ఇక వాటి బాగోగుల విషయానికి వస్తే ఒక్కో జతకు పోషణ పద్ధతి, స్థాయి, శిక్షణను బట్టి నెలకు రూ.30-40 వేలు వరకు ఖర్చు పెట్టేవాళ్లున్నారు.
 
మంచి నాణ్యమైన జాతి విదేశాలకు తరలిపోతున్నా ప్రభుత్వం ఏం చేయలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఆదుకోకుంటే రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి సంరక్షణ సాధ్యం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
 
- వరికూటి రామకృష్ణ
బీబీసీ ప్రతినిధి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోకాళ్ల పర్వతం ఎక్కి మరీ ప్రార్థించా... టిడిపి జెండాను ఎన్టీఆర్ కుటుంబీకులకిచ్చేయ్: మోత్కుపల్లి