Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టొమాటోలు తింటే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందా?

Advertiesment
tomatoes
, గురువారం, 10 అక్టోబరు 2019 (22:33 IST)
టొమాటోలలో ఉండే లైకోపీన్ అనే పోషక పదార్థం వీర్యం నాణ్యతను మెరుగుపరిచే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరోగ్యంగా ఉన్న పురుషులు రోజూ రెండు చెంచాల టొమాటో ప్యూరీ (చిక్కని రసం) తీసుకుంటే వారి వీర్యం నాణ్యత పెరుగుతుందని ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు.
 
ప్రపంచంలో దాదాపు సగం మంది దంపతులు వంధ్యత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారు. సంతానోత్పత్తి సమస్యలు ఉన్న పురుషులపై మరింత విస్తృత అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్న పురుషులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని, వదులుగా ఉండే లోదుస్తులను ధరించాలని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) సూచిస్తోంది.
 
మహిళలు కూడా సాధ్యమైనంత మేరకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని, గర్భం దాల్చే అవకాశాలను పెంచేందుకు క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనాలని కూడా ఎన్‌హెచ్‌ఎస్ చెబుతోంది. అయితే, కొన్ని పోషకాలు పురుషుల సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయనే ఆలోచన కొంతకాలంగా పెరుగుతోంది. ఆ ఆలోచనకు తాజా అధ్యయనం మరింత బలాన్ని చేకూరుస్తోంది.
 
విటమిన్- ఇ, జింక్ మాదిరిగానే లైకోపీన్ కూడా యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం ద్వారా తీసుకునే లైకోపీన్‌ను జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి, ఈ అధ్యయనంలో లైకోపీన్ ఉండే సప్లిమెంట్‌ను ఉపయోగించారు. అలాగే, సప్లిమెంట్ ద్వారా అయితే ఆ పోషక పదార్థం అందరికీ రోజూ ఒకే మోతాదులో అందించే వీలుంటుందన్నది పరిశోధకుల మరో ఆలోచన. ఆ సప్లిమెంట్‌కు సమానమైన మోతాదులో లైకోపీన్ లభించాలంటే, ఒక వ్యక్తి రోజూ రెండు కిలోల ఉడికించిన టొమాటోలు తినాల్సి ఉంటుంది.
 
ప్రోత్సాహకర ఫలితాలు
ఈ ట్రయల్స్ 12 వారాల పాటు నిర్వహించారు. 60 మందిని యాదృచ్ఛిక పద్ధతిలో ఎంపిక చేసి, వారిలో కొందరికి రోజూ 14 మిల్లీ గ్రాముల లైకోపీన్‌ ఉన్న సప్లిమెంట్‌‌, మరికొందరికి లైకోపీన్ లేని డమ్మీ మాత్రలు ఇచ్చారు.
 
ఈ ట్రయల్స్ ప్రారంభించక ముందు ఒకసారి, ఆరు వారాలకు మరోసారి, ట్రయల్స్ పూర్తయ్యాక ఇంకోసారి వారి వీర్యాన్ని పరీక్షించారు. వీర్యం చిక్కదనంలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. కానీ, లైకోపీన్ తీసుకున్న వారిలో వీర్య కణాల ఆరోగ్యకరమైన ఎదుగుదల, చలనశీలత బాగా మెరుగుపడ్డాయని గుర్తించారు.
 
అయితే, ప్రస్తుతానికి పురుషులు లైకోపీన్ తీసుకోవాలని కొంతమేరకు మాత్రమే సిఫార్సు చేయగలమని ఈ పరిశోధనా బృందానికి నేతృత్వం వహించిన పోషకాహార నిపుణులు డాక్టర్ లిజ్ విలియమ్స్ చెప్పారు. "ఇది చిన్న అధ్యయనం మాత్రమే. ఇందులో ఎంతో ప్రోత్సాహకర ఫలితాలు వచ్చాయి. అయినా, ఇంకా విస్తృత స్థాయిలో ట్రయల్స్ జరగాల్సిన అవసరం ఉంది" అని ఆమె చెప్పారు.
 
"తదుపరి దశలో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న పురుషులకు లైకోపీన్ ఇచ్చి, వారి వీర్యం నాణ్యతను అది పెంచుతుందేమో పరిశీలించాల్సి ఉంది. ఆ పదార్థం తీసుకోవడం ద్వారా సంతాన సామర్థ్యాన్ని పెంచే చికిత్స అవసరం లేకుండానే, ఆ దంపతులకు సంతానం కలుగుతుందా? అన్నది కూడా చూస్తాం" అని అన్నారు.
 
వీర్యం నాణ్యతను మెరుగుపరిచేందుకు, పురుషుల సంతాన సామర్థ్యం గురించి భవిష్యత్తులో మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు తాజా అధ్యయనం ఉపయోగపడుతుందని యూకేలోని చారిటీ ఫర్టిలిటీ నెట్‌వర్క్‌కు చెందిన నిపుణులు గ్వెండా బర్న్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఆర్టీసీ సమ్మె: జీతాలు ఎక్కువగా ఉంటే అదనపు షిఫ్టులు ఎందుకు చేస్తాం? - మహిళా ఉద్యోగులు