ప్రతి సంస్కృతిలోనూ ఆహార పదార్థాల విషయంలో కొన్ని అపోహలు, విశ్వాసాలు ఉంటాయి. ఇవి ఏళ్ల నుంచీ అలానే వస్తుండటంతో వీటిని నిజమని చాలా మంది నమ్ముతుంటారు. నేడు పరిస్థితులు చాలా మారాయి. ఈ అపోహలపై వైద్యులు, ఆహార నిపుణులు మాట్లాడుతున్నారు. నిజాలేమిటో, అపోహలు ఏమిటో.. వీటి మధ్య తేడా ఏమిటో ప్రజలకు వివరిస్తున్నారు. ఇటీవల కాలంలో కొత్తకొత్త చేపల రెసెపీలు వస్తున్నాయి.
అయితే, చేపల విషయంలో చాలా అపోహలు కూడా ప్రజల్లో ఉన్నాయి. అలాంటి వాటిలో చేపలు తిన్నాక పాలు తాగ కూడదుఅనేది కూడా ఒకటి. ఒకవేళ చేపలు తిన్నవింటనే పాలు తాగితే, చర్మంపై తెల్ల మచ్చలు లేదా కంటి జబ్బులు కూడా వస్తాయని కొన్ని ప్రాంతాల్లో నమ్ముతారు. అసలు ఈ వాదనలో నిజమెంత?
బొల్లి వస్తుందా?
చర్మంపై తెల్లమచ్చలు రావడాన్ని విటిలిగో అంటే బొల్లిగా పిలుస్తారు. చర్మంలో రంగుకు కారణమయ్యే పిగ్మింటేషన్ స్థాయిలు తగ్గిపోవడంతో ఈ మచ్చలు వస్తుంటాయి. తాజాగా ఉజైర్ రిజ్విగా పేరున్న ఒక అమ్మాయి ఈ విషయంపై ట్విటర్‌లో చర్చ పెట్టారు. చేపలు తిన్న తర్వాత, పాలు తాగొద్దని మా అమ్మ చెప్పేది. ఈ విషయంలో మా అమ్మ చాలా భయపెట్టేదిఅని ఆమె చెప్పారు. భారత్, పాకిస్తాన్‌లలో తల్లులు మాత్రమేనా ఇలాంటి భయాలు పెడుతుంటారు? అని ఆమె ప్రశ్నించారు.
అయితే, యూదుల్లోనూ ఇలాంటి విశ్వాసాలను నమ్ముతారని కొందరు చెప్పారు. తాము కూడా చేపలు తిన్న తర్వాత పాలు తాగబోమని వివరించారు. మరో యూజర్ స్పందిస్తూ.. యూనానీ వైద్యంలోనూ ఇదే చెబుతున్నారని వివరించారు. కొందరైతే చేపల తర్వాత పాలు తాగితే, కడుపునొప్పి, వాంతులు, వికారం లాంటివి కూడా వస్తాయని చెబుతున్నారు. అయితే, నేడు చాలా హోటళ్లలో చేపలు, పాలను కలిపి కూడా ప్రత్యేక వంటకాలు చేస్తున్నారు. మరి వీటిపై వారు ఏమంటారో..
నిపుణులు ఏం చెబుతున్నారు?
అసలు చేపలు తిన్నాక పాలు తాగితే ఏమవుతుందో తెలుసుకునేందుకు కొందరు నిపుణులతో బీబీసీ మాట్లాడింది. అసలు ఏమీకాదని, ఆ మచ్చలు రావడం అనేది ఒక అపోహ అని డెర్మటాలజిస్టు డా.ఉర్మిళ జావెద్ బీబీసీతో చెప్పారు. చర్మంపై మచ్చలకు పాలు లేదా చేపలకు ఎలాంటి సంబంధంమూలేదు. అసలు డెర్మటైటిస్‌కు ఆహారం కారణం కాదుఅని ఆమె వివరించారు. అదొక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే రోగ నిరోధక రుగ్మత. మెలనిన్‌పై పోరాడే యాంటీబాడీలను రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేయడం వల్ల ఆ సమస్య వస్తుందిఅని ఆమె చెప్పారు. ఎక్కడెక్కడ యాంటీబాడీలు దాడిచేస్తాయో అక్కడ చర్మంపై మచ్చలు కనిపిస్తాయిఅని ఆమె తెలిపారు.
డైటీషియన్లు ఏం చెబుతున్నారు?
మరోవైపు ఈ చేపల కథను డైటీషియన్ డాక్టర్ జైనాబ్ కూడా కొట్టిపారేశారు. అసలు దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూలేవని ఆమె చెప్పారు. అసలు చేపలు, పాలు కలిపి తీసుకున్నా చర్మంపై మచ్చల్లాంటివేమీ రావుఅని ఆమె చెప్పారు. నిజానికి ఇలాంటి అపోహలు చేపలు, పాలకు మాత్రమే పరిమితం కావు. ఇతర ఆహార పదార్థాల విషయంలోనూ ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. ఒకేసారి వేడి, చల్లని పదార్థాలు తింటే ప్రాణాలు పోతాయని కూడా కొందరు చెబుతారుఅని ఆమె వివరించారు. ఎప్పుడైనా ఆహారం చల్లగా ఉందా? వేడిగా ఉందా? అనేదానికంటే మీరు ఏ పరిమాణంలో దాన్ని తీసుకుంటున్నారు అనేదే ముఖ్యంఅని ఆమె తెలిపారు.
మీరు ఏదైనా విపరీతంగా తింటే మీ జీర్ణ వ్యవస్థపై అది ప్రభావం చూపుతుందిఅని ఆమె వివరించారు. విపరీతంగా తినడంతో కొన్ని ఆహార పదార్థాల వల్ల అలర్జీలు రావచ్చు. మరికొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు పడకపోవచ్చు. అలాంటప్పుడు వచ్చే అలర్జీలను అందరికీ వర్తించేలా చెప్పకూడదుఅని ఆమె తెలిపారు. మరోవైపు ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ఉపయోగించే కొన్ని ప్రిజర్వేటివ్‌లు, ఫుడ్ కలర్‌లు కూడా అలర్జీలకు కారణం కావొచ్చని ఆమె చెప్పారు.
కలిపి వండితే..
కొన్ని ప్రాంతాల్లో చేపలు, పాలను కలిపి వండుతారు. అలాంటి రెసిపీల్లో ప్రధానమైనది పోచ్డ్ ఫిష్. ఈ రెండింటినీ కలిపి వండినప్పుడు క్రీమీ గ్రేవీ వస్తుంది. వడ్డించేటప్పుడు చేపలపై ఈ గ్రేవీని పోస్తారు. పోచ్డ్ ఫిష్ వండేందుకు రెండు కప్పుల పాలు (400 మి.లీ.), చేప, ఉప్పు, ఇతర మసాలా దినుసులు అవసరం అవుతాయి. మొదటగా కలాయిలో పాలు మరగబెడతారు. ఆ తర్వాత దానిలో చేప ముక్కలు వేసి ఉడకబెట్టి, ఉప్పు ఇతర మసాలా దినుసులు వేస్తారు. చేప ఉడికిన తర్వాత దీన్ని దించేస్తారు. దీన్ని తినడం వల్ల ఎలాంటి చర్మ సమస్యలూ రావని అటు ఉర్మిళ, ఇటు జైనాబ్ స్పష్టంచేశారు.