Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చర్మ సౌందర్యానికి క్రీములు వాడితే ఏమవుతుందో తెలుసా?

Advertiesment
చర్మ సౌందర్యానికి క్రీములు వాడితే ఏమవుతుందో తెలుసా?
, సోమవారం, 30 సెప్టెంబరు 2019 (17:52 IST)
చర్మాన్ని మెరిపించే క్రీములకు దూరంగా ఉండడం మంచిదని వినియోగదారులను ఒక సంస్థ హెచ్చరించింది. అవి పెయింట్ రిమూవర్‌లా పనిచేస్తాయని, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయని చెబుతోంది. లోకల్ గవర్నమెంట్ అసోసియేషన్ (ఎల్జీఏ) అలాంటి క్రీములను 'ఎట్టి పరిస్థితుల్లోనూ' వాడకూడదని సూచించింది. వాణిజ్య ప్రమాణాల అధికారులు ఇటీవలి తనిఖీల తర్వాత "ఫెయిర్‌నెస్ క్రీములను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించవద్దని" ఎల్జీఏ ఆ హెచ్చరికలు జారీ చేసింది.

 
అధికారులు సీజ్ చేసిన క్రీముల్లో చాలా వాటిలో హైడ్రోక్వినోన్ అనే బ్లీచింగ్ ఏజెంట్, పాదరసం కూడా ఉన్నట్లు గుర్తించారు. చర్మం గురించి ఏవైనా సమస్యలు ఉన్న వారు వైద్యులను సంప్రదించాలని బ్రిటిష్ స్కిన్ ఫౌండేషన్ సూచించింది. కొంతమంది రీటైలర్స్‌, ఆన్‌లైన్ మార్కెటింగ్ సైట్లు ఈ క్రీముల పేరుతో విషపూరిత పదార్థాలు అమ్ముతున్నారని ఎల్జీఏ చెప్పింది. చర్మానికి మెరుపునిచ్చే క్రీముల ఉత్పత్తిదారులు అందులో ఉన్న పదార్థాల గురించి ఎప్పుడూ స్పష్టంగా చెప్పడం లేదని, వినియోగదారులను ప్రమాదంలో పడేస్తున్నారని చెప్పారు.

 
హైడ్రోక్వినోన్ పెయింట్ తొలగించే రిమూవర్‌తో సమానంగా పనిచేస్తుంది. అది మన చర్మం పైపొరను తొలగించగలదని ఎల్జీయే చెప్పింది. దానివల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, కాలేయం, మూత్ర పిండాలకు కూడా నష్టం జరగవచ్చని చెప్పింది. ఈ క్రీముల్లోని పాదరసం వల్ల కూడా అలాంటి ఆరోగ్య సమస్యలే రావచ్చని ఎల్జీయే చెప్పింది.

 
"డాక్టర్ ప్రిస్కిప్షన్‌లో సూచిస్తే తప్ప అలాంటి క్రీములు ఉపయోగించవద్దు" అని ఎన్జీయే చెప్పింది. తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండడంతో ఈ క్రీముల్లో ఉండే హైడ్రోక్వినోన్, స్టెరాయిడ్స్, మెర్కురీ లాంటి వాటిని బ్రిటన్‌లో నిషేధించారు.

 
ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు
ఇటీవల స్వాధీనం చేసున్న చాలా ఉత్పత్తుల్లో ఎల్జీయే ఈ ప్రమాదం గుర్తించింది. డగన్హామ్‌లోని ఒక స్టోర్ నుంచి స్వాధీనం చేసుకున్న 360 ఉత్పత్తుల్లో కొన్నింటిలో హైడ్రోక్వినోన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ స్కిన్ క్రీముల్లో ఉన్న పదార్థాలను తప్పుగా సూచించారు. అవి ఈయూ నిబంధనలకు తగినట్లు లేవు. ఈ ఉత్పత్తులు విక్రయించిన స్టోర్ యజమానికి 6500 పౌండ్ల(రూ.5.63 లక్షలు) జరిమానా విధించారు. కౌన్సిల్‌కు 8010 పౌండ్లు(రూ.7 లక్షలు) కట్టాలని ఆదేశించారు.

 
సౌత్‌వార్క్ కౌన్సిల్ చర్మాన్ని తెల్లగా చేసే దాదాపు 2900 ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. వీటిలో ఎక్కువ క్రీములను 2018లో నైజీరియా నుంచి నేరుగా దిగుమతి చేసుకున్నారు. చర్మానికి మెరుపు ఇచ్చే, ప్రమాదకరమైన ఉత్పత్తులు విక్రయించినందుకు బ్రిటన్‌లో జైలు శిక్ష విధించడం ఇదే మొదటిసారి. ఇలాంటి పావు టన్ను అక్రమ ఉత్పత్తులను కామెరూన్ నుంచి దిగుమతి కాగానే గట్విక్‌ విమానాశ్రయంలోనే స్వాధీనం చేసుకున్నారు. శాంపిళ్లలో హైడ్రోక్వినోన్ ఉన్నట్టు గుర్తించారు.

 
"స్కిన్ క్రీముల్లోని చాలా ప్రమాదకరమైన నిషేధిత పదార్థాల వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు రావచ్చు. అవి జీవితాంతం మచ్చగా మిగల్చడమే కాదు, మన ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అందుకే మనం వాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలి" అని ఎల్జీయే ఛైర్మన్ సైమన్ బ్లాక్‌బర్న్ చెప్పారు. "వినియోగదారులు ఎప్పుడూ స్కిన్ క్రీముల్లో ఏయే పదార్థాలు ఉన్నాయో పరిశీలించాలి. ధర చాలా తక్కువగా ఉంటే వాటిని అనుమానించాలి. అలాంటి క్రీముల్లో సూచించే పదార్థం నకిలీ అయ్యుండచ్చు, అది చాలా ప్రమాదకరం కావచ్చు. హైడ్రోక్వినోన్ ఉన్న ఉత్పత్తిని ఎప్పుడూ వాడకండి. ఉత్పత్తిలో ఏయే పదార్థాలు ఉన్నాయో వివరించకపోతే, అసలు దాన్ని ఉపయోగించకండి" అన్నారు.

 
ఇలాంటి నిషేధిత స్కిన్ క్రీములు అమ్ముతున్న కొందరు రీటైలర్స్‌ను కౌన్సిల్ టార్గెట్ చేసింది. "చర్మానికి మెరుపు ఇస్తాయని చెప్పే ఇలాంటి అక్రమ క్రీములు ఏటేటా పెరుగుతున్నాయి. షాపుల్లో, ఆన్‌లైన్లో చట్టవిరుద్ధమైన అమ్మకాలు పెరగడం వల్లే ఈ సమస్య వచ్చిందా? అనేది తెలుసుకోవడం కష్టంగా ఉంది" అని బ్రిటిష్ స్కిన్ ఫౌండేషన్‌ ప్రతినిధి లీసా బికెర్‌స్టాఫీ చెప్పారు.

 
"ఈ కాస్మటిక్స్‌లో ఉన్న పదార్థాలు తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు, బ్రిటిష్ స్కిన్ ఫౌండేషన్ అలాంటి వాటిని ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది" అని ఆమె స్పష్టం చేశారు. "మీ చర్మం రంగు గురించి ఏవైనా సమస్యలు ఉంటే మీరు మీ డెర్మటాలజిస్టు లేదా డాక్టరుతో మాట్లాడండి.. వారు చెప్పినట్లు చేయండి" అని ఆమె సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు మూడు నెలలుగా తిండి పెట్టట్లేదు.. వంటింట్లోకి కూడా రానీయలేదు..