మన మాటలు, సంభాషణలను టెక్నాలజీ దిగ్గజాలు రహస్యంగా వింటున్నాయంటూ ప్రాచుర్యంలో ఉన్న కుట్ర సిద్ధాంతం మీద మొబైల్ సెక్యూరిటీ సంస్థ ఒకటి పరిశోధన నిర్వహించింది. ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు వాటి వినియోగదారుల మీద నిఘా పెట్టాయని.. ఖచ్చితమైన లక్ష్యాలకు వాణిజ్య ప్రకటనలు పంపించటానికి ఈ విధంగా చేస్తున్నాయని.. అందుకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తూ సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
వ్యక్తులు ఏవో ఉత్పత్తుల గురించి మాట్లాడితే.. ఆన్‌లైన్‌లో సరిగ్గా అవే ఉత్పత్తులకు సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లు కనిపించాయని చూపిస్తూ పోస్ట్ చేసిన వీడియోలు ఇటీవలి నెలల్లో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో వందేరా సంస్థకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ ఆన్‌లైన్ ప్రయోగాలను పరీక్షించారు. ఫోన్లు, యాప్‌లు రహస్యంగా వింటున్నాయనేందుకు ఆధారాలు లేవని గుర్తించారు. ఒక శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను, ఒక యాపిల్ ఐఫోన్‌ను ఒక 'ఆడియో రూమ్'లో పెట్టారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, క్రోమ్, స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ యాప్‌లను పూర్తి పర్మిషన్లు ఇచ్చి తెరిచి పెట్టారు.
నిశబ్దంగా ఉన్న మరో గదిలో ఇటువంటివే మరో రెండు ఫోన్లు పెట్టారు. ఆడియో రూమ్‌లో 30 నిమిషాల పాటు పిల్లులు, శునకాల ఆహారపు అడ్వర్టైజ్‌మెంట్ల శబ్దాలు ప్లే చేశారు. ఆ తర్వాత ఆయా ఫోన్లలో తెరిచి ఉంచిన అప్లికేషన్లను పరిశీలించారు. తాము తెరిచిన ఒక్కో యాప్, వెబ్ పేజీలో పిల్లి, శునకాల ఆహారానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లను వెదికారు. ఈ పరీక్షా సమయంలో ఆయా ఫోన్లలోని బ్యాటరీ వినియోగం, డాటా వినియోగాన్ని కూడా విశ్లేషించారు.
ఈ ప్రయోగాన్ని మూడు రోజుల పాటు నిర్దిష్ట సమయంలో మళ్లీ మళ్లీ చేశారు. ఆడియో రూమ్‌లో మాటలు వినిపించిన ఫోన్లలోని యాప్‌లు, వెబ్‌సైట్లలో.. పెంపుడు జంతువుల ఆహారానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లు ఏవీ లేవని గుర్తించారు. అలాగే ఆ ఫోన్లలో బ్యాటరీ, డాటా వినియోగం కూడా గణనీయంగా పెరిగన దాఖలాలూ లేవు.
ఈ ఆడియో రూమ్‌లోనూ, నిశబ్ద గదిలోనూ ఉంచిన రెండు ఫోన్లలో కనిపించిన యాక్టవిటీ ఒకే తరహాలో ఉంది. ఈ డివైజ్‌ల నుంచి డాటా బదిలీ అవుతుండటాన్ని నమోదు చేశారు. అయితే అది చాలా తక్కువ స్థాయిల్లోనే ఉంది. ఇది.. సిరి, హే గూగుల్ వంటి వర్చువల్ అసిస్టెంట్లు యాక్టివ్‌గా ఉన్నప్పుడు జరిగే డాటా బదిలీకి ఏమాత్రం దరిదాపుల్లో లేదు.
''ఆ 30 నిమిషాల కాలంలో డాటా వినియోగం.. వర్చువల్ అసిస్టెంట్ డాటా కన్నా చాలా తక్కువగా ఉందని మా పరిశీలనలో గుర్తించాం. ఇది.. పరీక్షించిన యాప్‌లలో సంభాషణలను నిరంతరం రికార్డ్ చేస్తూ క్లౌడ్‌లో అప్‌లోడ్ చేయటం జరగటం లేదని చెప్తోంది'' అని వందేరా కంపెనీలో సిస్టమ్స్ ఇంజనీర్ జేమ్స్ మాక్ వివరించారు. ఒకవేళ అలా రికార్డ్ చేస్తూ అప్‌లోడ్ చేస్తున్నట్లయితే వర్చువల్ అసిస్టెంట్ వినియోగించే డాటా తరహాలో ఎక్కువ డాటా వినియోగం ఉండేదని చెప్పారు.
మన మొబైల్ ఫోన్లలోని మైక్రోఫోన్లను ఉపయోగించుకుని మన సంభాషణల మీద నిఘా పెడుతున్నాయనే వాదనలను టెక్ దిగ్గజాలు కొన్నేళ్లుగా తిరస్కరిస్తూ ఉన్నాయి. ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ గత ఏడాది అమెరికా సెనేట్ ముందు వాంగ్మూలం ఇచ్చినపుడు కూడా.. ఇలా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఆయన అలాంటిది జరగటం లేదని నిర్ద్వంద్వంగా నిరాకరించారు. అయినప్పటికీ.. టెక్ దిగ్గజాల మీద అపనమ్మకం పెరగటంతో తమ మాటలను ఫోన్ల ద్వారా ఆయా సంస్థలు వింటున్నాయనే చాలామంది యూజర్లు భావిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆండ్రాయిడ్ ఫోన్లు చాలావరకూ నిశబ్ద గదుల్లో ఎక్కువ డాటా వినియోగిస్తున్నాయని.. ఆడియో రూమ్‌లోని ఫోన్లలో ఐఓఎస్ యాప్‌లు ఎక్కువ డాటా ఉపయోగిస్తున్నాయని ఈ అధ్యయనంలో గుర్తించారు. ఇలా ఎందుకు జరుగుతుందనేది విశ్లేషకులు ఇంకా నిర్ధారించలేకపోయారు. దీనిపై పరిశోధన కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఏదేమైనా.. మొత్తం ఫలితాలను చూస్తే.. గణనీయమూన డాటాను రహస్యంగా బదిలీ చేయటమనేది జరగటం లేదనే తెలుస్తోందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎల్డార్ టువే పేర్కొన్నారు.
''మేం పరీక్షించిన ప్లాట్‌ఫామ్‌ల మీద అలా జరుగుతోందనటానికి ఆధారమేమీ దొరకలేదని నేను ఖచ్చితంగా చెప్తాను. మనకు తెలియని మరో మార్గంలో జరుగుతుండవచ్చు.. కానీ అలా జరగటానికి ఆస్కారం లేదని నేను అంటాను'' అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఈ ప్రయోగం ఫలితాలు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పరిశ్రమ రంగానికి ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే.. ఈ టెక్ దిగ్గజాల మన గురించి ఎన్ని విషయాలు తెలుసునంటే మనల్ని లక్ష్యంగా అడ్వర్టైజ్‌మెంట్లు పంపించటానికి అవి మన సంభాషణలు విననవసరం లేదని ఈ పరిశ్రమకు చాలా ఏళ్ల నుంచీ తెలుసు.
వాస్తవం ఏమిటంటే.. యూజర్లను వర్గీకరించటానికి అడ్వర్టైజర్ల దగ్గర చాలా ఆధునిక పద్ధతులున్నాయి. ఉదాహరణకు.. లొకేషన్ డాటా, బ్రౌజింగ్ హిస్టరీ, ట్రాకింగ్ పిక్సెల్స్ - అన్నీ మనం ఏం కొనాలని ఆలోచిస్తున్నామనేది అంచనా వేయటానికి అవసరమైనంత సమాచారం అందిస్తుంటాయి. సోషల్ మీడియా సమాచారం ద్వారా మిమ్మల్ని ఫ్రెండ్స్‌కి కూడా అనుసంధానం చేసి.. వారు సెర్చ్ చేస్తున్న అంశాల మీద మీకు కూడా ఆసక్తి ఉండవచ్చునని కూడా అంచనా వేయగలవు. ఈ టెక్నిక్‌లు నిరంతరం మెరుగుపడుతూ అభివృద్ధి చెందుతున్నాయి కూడా.
ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన మొబైల్ అడ్వర్టైజింగ్, సెక్యూరిటీ నిపుణుడు సొటేరిస్ దిమిత్రియో.. ''మీరు చూసే అడ్వర్టైజ్‌మెంట్లు.. ఆయా కంపెనీల దగ్గర మీ గురించి ఉన్న భారీ సమాచారం ఫలితం. అత్యంత శక్తివంతమైన మెషీన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ద్వారా భారీ మొత్తంలో సమాచారాన్ని అనేక అడ్వర్టైజ్‌మెంట్ నెట్‌వర్క్‌లకు అందిస్తాయి'' అని వివరించారు. ''అసలు మీకు రేపు రాబోయే ఆసక్తి ఏమిటనేది మీకు తెలియటానికన్నా ముందే తెలుసుకోగల సామర్థ్యం ఇప్పుడు వీటికి ఉంది'' అని పేర్కొన్నారు.
అయితే.. అడ్వర్టైజ్‌మెంట్ అవసరాల కోసం కొన్ని యాప్‌లు యూజర్ యాక్టివిటీని రికార్డు చేసినట్లు గుర్తించిన ఉదంతాలు ఉన్నారు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల నార్త్-ఈస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు గత జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆండ్రాయిడ్ యాప్‌లలో గల 17,000 మొబైల్ యాప్‌లను పరీక్షించారు.
ఆ యాప్‌లు రహస్యంగా వింటున్నాయనేందుకు ఎటువంటి ఆధారాలూ వారికి లభించలేదు. అయితే.. కొన్ని చిన్న అప్లికేషన్లు తమ యూజర్ ఫోన్ యాక్టవిటీలను స్క్రీన్‌షాట్లు, వీడియోల ద్వారా థర్డ్ పార్టీకి పంపుతున్నాయని గుర్తించారు. అయితే.. ఇది డెవలప్‌మెంట్ అవసరాల కోసమే చేస్తున్నారు కానీ అడ్వర్టైజ్‌మెంట్ల కోసం కాదు.
ఇక ఉన్నతస్థాయి లక్ష్యాలకు చెందిన మొబైల్ డివైజ్‌ల మీద గూఢచర్యంలో భాగంగా ప్రభుత్వ సంస్థలు తరచుగా దాడులు చేస్తుంటాయని అంగీకరించిన విషయమే. అలాగే.. హ్యకర్లు వాట్సాప్ యాప్‌ను ఉపయోగించుకుని రిమోట్‌గానే నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయగలిగారని ఆ సంస్థ గత మే నెలలో అంగీకరించింది. ఆ హ్యాకంగ్ దాడి ''ఒక నిర్దిష్ట సంఖ్య'' యూజర్లను లక్ష్యంగా చేసుకుందని.. ''ఓ అత్యాధునిక సైబర్ యాక్టర్'' దానిని రచించిందని ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ పేర్కొంది. ఈ సెక్యూరిటీ లోపాన్ని ఆ తర్వాత సరిచేశారు.