Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం,10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారించాలి - విచారణ కమిషన్ సిఫారసు

Advertiesment
Disa Case
, శుక్రవారం, 20 మే 2022 (15:35 IST)
హైదరాబాద్‌లో దాదాపు మూడేళ్ల కిందట సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య నేరంలో నలుగురు నిందితులను 'ఎన్‌కౌంటర్‌'లో కాల్చిచంపామన్న పోలీసుల కథనం అవాస్తవమని.. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషన్ తేల్చింది. ఈ ఘటనకు సంబంధించి.. నలుగురిని హత్య చేసిన నేరంపై 10 మంది పోలీసు అధికారులను విచారించాలని సిఫారసు చేసింది.

 
నిందితులు పోలీసుల దగ్గరి నుంచి పిస్టల్ లాక్కుని పోరిపోవటానికి ప్రయత్నించారని చెప్తున్న పోలీసుల కథనం నమ్మశక్యంగా లేదని, దానికి ఆధారాలు లేవని స్పష్టంచేసింది. ''అనుమానితులు పోలీసులపై దాడికి దిగారని, వారి దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స చేశారని పోలీసులు చెబుతున్నదంతా అవాస్తవమని మేం గుర్తించాం.

 
ఏసీపీ వి.సురేందర్ (సీడబ్ల్యూ-44), కానిస్టేబుల్ కె.వెంకటేశ్వర్లు (సీడబ్ల్యూ-49) నుంచి అనుమానితులు పిస్టల్స్ లాక్కున్నారన్నది కూడా నమ్మశక్యం కాదు. ఏసీపీ వి.సురేందర్ (సీడబ్ల్యూ-44) తొలుత ఇద్దరి నుంచి పిస్టల్స్ లాక్కోవడం స్వయంగా చూశానని చెప్పినప్పటికీ ఆ తరువాత ఒక్కరి నుంచి లాక్కోవడం మాత్రమే చూశానని తెలిపారు'' అని కమిషన్ తన నివేదికలో వివరించింది.

 
ఈ ఎన్‌కౌంటర్ బూటకమని కమిషన్ తేల్చిందిలా ?
నమోదైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత మృతిచెందిన అనుమానితులు 2019 డిసెంబరు 6న పోలీసుల నుంచి తుపాకులు లాక్కోవడం, కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం, పోలీసులపై దాడికి దిగడం, వారిపై కాల్పులు జరపడం వంటివేమీ చేయలేదని మేం(కమిషన్) నిర్ధరణకు వచ్చాం. అనుమానితులు చనిపోతారన్న విషయం తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే నిందితులు(పోలీసులు) కాల్పులు జరిపారని కమిషన్ అభిప్రాయపడుతోంది.

 
అంతేకాకుండా.. 10 మంది పోలీసులు - వి.సురేందర్, కె.నరసింహారెడ్డి, షేక్ లాల్ మదార్, మొహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.అరవింద్ గౌడ్, డి.జానకిరామ్, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్‌లను ఈ నేరానికి గాను సెక్షన్ 302 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, 201 ఆర్/డబ్ల్యూ 302 ఐపీసీ, 34 ఐపీసీ ప్రకారం విచారించాలని కమిషన్ అభిప్రాయపడింది.

 
వీరు వేర్వేరుగా పాల్పడిన చర్యలన్నిటి వెనుకా అనుమానితులను చంపాలన్న ఉమ్మడి ఉద్దేశం ఉందని తేలిందని కమిషన్ అభిప్రాయపడింది. పోలీస్ అధికారులు షేక్ లాల్ మదార్, మొహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి ఈ హత్యను సమర్ధించడానికి ప్రయత్నించినందుకు వారిని ఐపీసీ సెక్షన్ 302 విచారించాలని కమిషన్ అభిప్రాయపడింది. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు తాము నేరం చేసేనాటికి మైనర్లని కూడా కమిషన్ గుర్తించింది.

 
ఈ కేసులో నిందితులు (పోలీసులు అధికారులు ) ఐపీసీ సెక్షన్ 76, అలాగే సెక్షన్ 300లోని 3వ మినహాయింపు కింద రక్షణ పొందలేరని కమిషన్ అభిప్రాయపడింది. దీనికి కారణం...ఈ కేసులో నిందితులైన అధికారులు తాము మంచి ఉద్దేశంతోనే ఈ అనుమానితులపై కాల్పులకు దిగినట్లు భావిస్తున్నారని, ఇది నమ్మశక్యం కాదని పేర్కొంది. '' మంచి ఉద్దేశం అన్నది ఐపీసీ సెక్షన్ 76, సెక్షన్ 300 లోని మినహాయింపు 3 కు అత్యంత కీలకం. కానీ, అది ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు'' అని కమిషన్ పేర్కొంది.

 
2019 డిసెంబర్‌లో సంచలనం సృష్టించిన ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కార్ సారథ్యంలో, బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డి.ఆర్.కార్తికేయన్‌లు సభ్యులుగా ఉన్న కమిషన్‌ దర్యాప్తు చేసింది. ఈ కమిషన్ 387 పేజీల నివేదికను శుక్రవారం నాడు సుప్రీంకోర్టుకు సమర్పించింది.

 
సీల్డ్ కవర్‌లో ఉంచటానికి నో అన్న సీజేఐ
ఈ నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. నివేదిక కాపీలను కేసులోని అన్ని పక్షాల వారికీ అందించాలని ఆదేశించింది. అలాగే.. అన్ని రికార్డులనూ తెలంగాణ హైకోర్టుకు పంపించాలని.. నివేదికతో పాటు, సంబంధిత పక్షాల వాదనల ఆధారంగా తదుపరి కార్యాచరణపై హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు నిర్దేశించింది.

 
2019 నవంబర్‌లో హైదరాబాద్ నగరంలో 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ 'దిశ' మీద దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేయటం రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చింది. ఈ కేసులో నిందితులంటూ పోలీసులు నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. డిసెంబర్ ఆరంభంలో వారు పోలీసుల మీద దాడిచేసి కస్టడీ నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించారని.. ఎదురు కాల్పుల్లో నలుగురూ చనిపోయారని ప్రకటించారు.

 
ఈ ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ న్యాయవాదులు జి.ఎస్.మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన నాటి సీజీఐ ఎస్.ఎ.బోబ్డే సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ కోరారు. ఇందుకు సీజేఐ తిరస్కరించారు.

 
''ఇందులో గోప్యమైనదేమీ లేదు. ఎవరో ఒకరు దోషులుగా తేలారు ఇప్పుడు ప్రభుత్వం దాని సంగతి చూడాల్సి ఉంటుంది'' అని సీజేఐ వ్యాఖ్యానించారు. ''నివేదికను మళ్లీ సీల్ చేసి ఉంచండి. అది సీల్ చేసి లేకపోతే న్యాయ పాలన మీద ప్రభావం చూపుతుంది'' అని దివాన్ విజ్ఞప్తి చేశారు. ''(అవతలి పక్షానికి) నివేదిక ఇవ్వకపోతే విచారణకు అర్థమేముంది'' అని సీజీఏ ప్రశ్నించారు.

 
''ఇంతకుముందు కూడా అది జరిగింది. జస్టిస్ ఎ.కె.పట్నాయక్ ఒక కేసులో పనిచేసి, ఒక నివేదికను తయారుచేసి దానిని సీల్డ్ కవర్‌లో సమర్పించారు'' అని దివాన్ పేర్కొన్నారు. ''ఒకసారి నివేదిక వచ్చిందంటే దానిని వెల్లడించాల్సి ఉంటుంది'' అని సీజేఐ ఉద్ఘాటించారు. నివేదిక కాపీలను కేసులో అన్ని పక్షాల వారికీ అందించాలంటూ ఆదేశాలు జారీచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చేశారు : నారా లోకేశ్ ధ్వజం