Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?

Team India
, శనివారం, 7 అక్టోబరు 2023 (16:57 IST)
భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ కంపెనీ‌ 'డ్రీమ్ 11' సుమారు రూ. 17 వేల కోట్లు పన్ను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేసింది. ట్యాక్స్ నోటీస్ అందుకున్నట్లు వార్తలు బయటికి రావడంతో డ్రీమ్ 11 కంపెనీ షేర్ ధరలు పడిపోయాయి. భారత చట్టాల ప్రకారం ఆన్‌లైన్ జూదం, క్యాసినోలు మొదలైనవి ప్రభుత్వానికి 28 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే 'డ్రీమ్ 11' అసోసియేట్ కంపెనీలు గ్యాంబ్లింగ్ సేవలు నడుపుతున్నాయని, ఆ కంపెనీలు 28 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఇన్‌కంట్యాక్స్ అధికారులు చెబుతున్నారు. కాగా, ఆదాయపు పన్ను శాఖ నోటీసులను డ్రీమ్ 11 కంపెనీ ముంబై హైకోర్టులో సవాలు చేసింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ అంశం తెరమీదకు తెచ్చారు. టీమిండియాకు స్పాన్సర్ చేస్తున్న కంపెనీలు ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదని చర్చించుకుంటున్నారు.
 
ఇంతకుముందు కూడా ఇలాగేనా?
గత పదిహేనేళ్లలో భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ చేసిన కంపెనీలు గడ్డుకాలం ఎదుర్కొన్నాయి. సుదీర్ఘకాలం క్రికెట్ జట్టుకు స్పాన్సర్ చేసిన 'సహారా ఇండియా' సంస్థ దివాలా తీసింది. కంపెనీ వాస్తవ గణాంకాలను దాచిపెట్టి, మోసం చేశారన్న ఆరోపణలపై 'సహారా' యజమాని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అలాగే 'స్టార్ స్పోర్ట్స్' చానల్ కూడా చాలాకాలం పాటు భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ చేసింది. క్రికెట్ చరిత్రలో అతిపెద్ద మొత్తంలో బిడ్ వేసి మ్యాచ్‌ల ప్రసార హక్కులను పొందింది స్టార్ స్పోర్ట్స్. అయితే ఆ సంస్థ కూడా ఇబ్బందుల్లో పడిపోయింది.
 
చైనీస్ మొబైల్ కంపెనీ 'ఒప్పో' కూడా భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ చేసింది. అయితే చైనా, భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అనంతరం దేశంలో చైనా వస్తువుల బహిష్కరణ ప్రారంభమైంది. దీంతో ఒప్పో కంపెనీ విలువ పడిపోయింది. ఇదే సమయంలో 'బైజూస్' సంస్థ క్రికెట్ స్పాన్సర్‌షిప్ రంగంలోకి ప్రవేశించింది. ప్రారంభంలో ఈ కంపెనీ చాలా వేగంగా డెవలప్ అయింది. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ దీని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవారు. అయితే, ఈ కంపెనీ అసలు విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఆస్తులు చూపించినట్లు తర్వాత తెలిసింది. దీంతో ఈ సంస్థ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇప్పుడు టీమిండియా కొత్త స్పాన్సర్ కంపెనీ అయిన 'డ్రీమ్ 11'ది అదే పరిస్థితి. వేల కోట్ల రూపాయల పన్ను కట్టాలంటూ ఆదాయప పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చింది. అనంతరం దాని షేర్లు కూడా పతనమయ్యాయి.
 
ఎందుకలా జరుగుతోంది?
భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. టీమిండియా క్రికెటర్లను అభిమానులు హీరోలుగా చూస్తారు. దీంతో పెద్ద కంపెనీలు క్రికెటర్లకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించి తమ బ్రాండ్ అంబాసిడర్‌లుగా చేసుకుంటాయి. ''చాలా కంపెనీలు తమ ప్రకటనల కోసం క్రికెటర్లకు మార్కెట్ విలువ కంటే ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నాయి. ఏదైనా క్రికెటర్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే ఆ కంపెనీకి తక్షణమే పాపులారిటీ వస్తుంది. మార్కెట్ నుంచి కంపెనీలోకి సులభంగా డబ్బులు వస్తాయి.
 
కానీ ఖర్చు చేసిన డబ్బు చాలా ఎక్కువని కొన్నిరోజుల తర్వాత తెలుసుకుంటున్నారు. మార్కెట్ విలువ దానికి అనుగుణంగా ఉండటం లేదు" అని క్రీడా విశ్లేషకుడు జస్వీందర్ సిద్ధూ అంటున్నారు. "కోవిడ్ తర్వాత మార్కెట్ మారిపోయింది. దీన్ని అర్థం చేసుకోవడంలో చాలా కంపెనీలు విఫలమయ్యాయి. అందుకే క్రికెట్‌పై ఎక్కువ పెట్టుబడి పెట్టే కంపెనీలు పతనమవుతున్నాయి" అని ఆయన అన్నారు.
 
క్రికెటర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఎందుకు?
"ప్రతి బ్రాండ్ తన వస్తువులు సామాన్య ప్రజల అంచనాలను అందుకోవాలని కోరుకుంటాయి. అందుకే కంపెనీలు సినిమా తారలను తమ బ్రాండ్ అంబాసిడర్‌లుగా చేస్తాయి. ప్రకటనల కోసం క్రికెటర్లను ఉపయోగించుకుంటాయి'' అని ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ప్రదీప్ మేగజైన్ అంటున్నారు. "కంపెనీలు రిస్క్ తీసుకుంటున్నాయి. టాప్ క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉండటానికి కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. ప్రారంభంలోనే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువుంటుంది, కానీ లాభం వెంటనే ఉండట్లేదు" అని ప్రదీప్ అంటున్నారు.
 
"కంపెనీ ఆర్థికంగా బలంగా లేకుంటే మునిగిపోయే ప్రమాదం ఉంది. శాంసంగ్, ఎల్‌జీ, పేటీఎం వంటి పెద్ద కంపెనీలు ఈ విషయంలో విజయం సాధించాయి. సగం కంపెనీలకు క్రికెటర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తే వచ్చే నష్టం తక్కువే, అందుకే అవి మునిగిపోవడం లేదు. అయితే, చాలా కంపెనీలు వారి దగ్గర డబ్బులు లేకపోయినా రిస్క్ తీసుకుంటున్నాయి, మునిగిపోతున్నాయి" అని తెలిపారు. పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి టీమిండియా క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లనూ ఉపయోగించుకుంటున్నాయి.
 
ఈ ప్రకటనలు జనాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. క్రికెటర్‌ ఉండటం వల్ల వారి బ్రాండ్ విలువ కూడా పెరుగుతోంది. కొంతమంది అగ్రశ్రేణి సినీ తారలు మాత్రమే ప్రకటనల్లో క్రికెటర్లతో పోటీ పడగలుగుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్నది భారత ఆటగాళ్లే. అంతేకాదు భారత క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కూడా.
 
పెట్టుబడి లాభదాయకమే: నీరూ భాటియా
"ఇండియాలో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. క్రికెట్‌పై ప్రకటనల కోసం డబ్బు పెట్టుబడి పెట్టడం ఖచ్చితంగా లాభదాయకం" అంటున్నారు 'ది వీక్' వారపత్రిక స్పోర్ట్స్ ఎడిటర్ నీరూ భాటియా. కంపెనీ ai మునిగిపోవడానికి క్రికెట్‌కు, క్రికెటర్లకు ఎలాంటి సంబంధం లేదని, అంతర్గత కారణాలతోనే కంపెనీలు మునిగిపోయాయని అంటున్నారామె. "వుమెన్స్ ప్రీమియర్ లీగ్ కొత్తది. ఇది ప్రారంభమైనప్పుడు, దాని స్పాన్సర్‌షిప్ కోసం ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం రాలేదు. పెద్ద సంఖ్యలో కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చాయి. క్రికెట్ ఎంత ప్రజాదరణ పొందిందో, దాని ప్రకటనలకు కూడా అంతే డిమాండ్, ఇది పెరుగుతూనే ఉంది" అని తెలిపారు నీరూ భాటియా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిక్కిం వరదల్లో గల్లంతైన దాన వీర శూర కర్ణ నటి