Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్: భారత్‌లో రానున్న 3 వారాలు అత్యంత కీలకమంటున్న సీసీఎంబీ - ప్రెస్‌రివ్యూ

కోవిడ్: భారత్‌లో రానున్న 3 వారాలు అత్యంత కీలకమంటున్న సీసీఎంబీ - ప్రెస్‌రివ్యూ
, మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (12:15 IST)
దేశంలో రానున్న మూడు వారాలు అత్యంత కీలకమని సీసీఎంబీ హెచ్చరించిందని ఈనాడు పత్రిక కథనం ప్రచురించింది. ‘‘కోవిడ్‌ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్‌లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది.

 
వచ్చే మూడు వారాలు భారత్‌కు కీలకమని.. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని సంస్థ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైరస్‌ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోంది. ఈ క్రమంలో కొన్ని రకాలు బలహీనంగా ఉండి కనుమరుగైతే.. మరికొన్ని ఎక్కువ ప్రభావం చూపుతూ వ్యాప్తిలో ఉంటాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండున్నర లక్షలపైన పాజిటివ్‌ కేసులు బయటపడుతుండటంతో కొత్తరకం కరోనా వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి.

 
ఆయా నమూనాల నుంచి వైరస్‌ జన్యుక్రమం ఆవిష్కరించే పరిశోధనలు సాగుతున్నాయి. కొత్త రకంలో ఎక్కువ ఉత్పరివర్తనాలు ఉంటున్నాయా? వ్యాప్తి పెరగడానికి దోహదం చేస్తున్నాయా? అనేదానిపై పరిశీలిస్తున్నాం అన్నారు. బి.1.617 రకం ఇతర వైరస్‌ రకాల కంటే ఎక్కువ వ్యాప్తికి కారణం అవుతుందనడానికి తగిన ఆధారాలు లేవు. దేశవ్యాప్తంగా దీని వ్యాప్తి ప్రస్తుతం 10 శాతంలోపే ఉంది.

 
ఈ484క్యూ, ఎల్‌452ఆర్‌ మ్యుటేషన్లతోపాటు మరికొన్ని బి.1.617లో ఉన్నాయి. భారత్‌లో ఈ రకం అక్టోబరులో బయటపడింది. అప్పట్లో ప్రజల జాగ్రత్తలతో వ్యాప్తి పెద్దగా లేదు. రెండు నెలలుగా చాలామంది మాస్క్‌ లేకుండా తిరగడం, టీకా వచ్చిందని జాగ్రత్తలను విస్మరించడం.. కేసులు పెరగడానికి దారితీసింది'' అని ఆయన వివరించారని ఈనాడు రాసింది.

 
టీకా తీసుకున్నా ముఖానికి మాస్క్‌ ధరించాల్సిందే. పార్టీల ర్యాలీలు, మతపరమైన మేళాలు అత్యంత ప్రమాదకరం. వీటితోనే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. గాలి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. భవనాలు, ఇతర మూసి ఉండే ప్రదేశాల్లో 20 అడుగుల దూరం వ్యాపిస్తుంది. మాస్క్‌ ధరిస్తే 80 శాతం రక్షణ ఉంటుంది. అందరూ ధరిస్తే 99 శాతం రక్షణ లభిస్తుంది'' అని ఆయన వివరించారని ఈనాడు చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోనులో క్రెడిట్ - డెబిట్ కార్డుల సమాచారం ఉందా...?