Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్: డాక్టర్ల అంత్యక్రియలను ప్రజలు ఎందుకు అడ్డుకుంటున్నారు?

Advertiesment
కరోనావైరస్: డాక్టర్ల అంత్యక్రియలను ప్రజలు ఎందుకు అడ్డుకుంటున్నారు?
, గురువారం, 23 ఏప్రియల్ 2020 (17:43 IST)
డాక్టర్ సైమన్ హెర్కులెస్
కరోనావైరస్ బారిన పడి ఆదివారం (ఏప్రిల్ 19) మరణించిన చెన్నై డాక్టర్ సైమన్ హెర్కులెస్ అంత్యక్రియలు జరగకుండా కొన్ని మూకలు ప్రతిఘటించాయి. డాక్టర్ల విషయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండో సారి. సైమన్ హెర్కులెస్ న్యూరాలజిస్ట్. ఆయనకి ఇన్ఫెక్షన్ ఎలా సోకిందనే విషయంపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఆయన కోవిడ్-19 రోగులకు వైద్యం చేయలేదు. అలాగే విదేశీ ప్రయాణం కూడా చేయలేదు. మార్చి మొదటి వారంలో ఆయన కోల్‌కతా వెళ్లి రావడమే ఆయన చివరిసారి చేసిన ప్రయాణం.

 
ఏప్రిల్ మొదటి వారంలో కరోనా లక్షణాలతో ఆయన చెన్నై అపోలో హాస్పిటల్లో చేరారు. చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన ఆదివారం మరణించారు. అదే రోజు రాత్రి హాస్పిటల్ వాళ్ళు ఆయన మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. చెన్నైలోని కిల్‌పాక్‌లో ఆయన అంతిమ సంస్కారాలు చేయాలని నిర్ణయించారు.

 
"మేము అంతిమ సంస్కారాలకి ప్రయత్నాలు మొదలుపెట్టక ముందే ఒక గుంపు స్మశానం దగ్గరకి వచ్చేసింది. వాళ్లందరికీ ఈ సమాచారం ఎలా అందిందో కూడా మాకు అర్థం కాలేదు. ఆదివారం రాత్రి అంతమంది ఒకేసారి ఎలా గుమిగూడారో కూడా అర్థం కాలేదు” అని సైమన్‌తో పాటు పని చేసిన మరో డాక్టర్ ప్రదీప్ అన్నారు. ఆ గుంపులో 100 మందికి పైగా ఉన్నారని ఆయన అన్నారు.

 
"ఇక వేరే దారి లేక అన్నా నగర్‌లో మృత దేహాన్ని ఖననం చేద్దామని అనుకున్నాం. మాతో పాటు, ఆయన భార్య, కుమారుడు, చెన్నై కార్పొరేషన్ అధికారులు, అంబులెన్సు డ్రైవర్, కొంత మంది డాక్టర్లు ఉన్నారు” అని అన్నారు.

 
“ఆయన్ను సమాధి చేయడానికి 12 అడుగుల గొయ్యి తవ్వవలసి ఉండటంతో మేము జేసీబీలను వాడాం. 15 నిమిషాలు పూర్తి కాక ముందే 50 నుంచి 60 మంది అక్కడకు చేరి మమ్మల్ని రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. మాకందరికీ గాయాలు అయ్యాయి” అని ప్రదీప్ చెప్పారు.

 
అంబులెన్సు డ్రైవర్‌కి బాగా గాయలై రక్తం కారడం మొదలైంది. రాళ్ళ నుంచి తప్పించుకోవడానికి కార్పొరేషన్ అధికారులు అక్కడ నుంచి పారిపోయారు. అప్పటికి మేము ఇంకా ఖననం పూర్తి చేయలేదు. అంబులెన్సు డ్రైవర్‌ని తీసుకుని ప్రదీప్ ఇంకొక స్థలానికి వెళ్ళవలసి వచ్చింది. డ్రైవర్ ముందుగా కిల్‌పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తన గాయాలకు చికిత్స చేయించుకున్నారు. ఈ లోపు నేను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకి సమాచారం అందించటంతో పోలీసులు వచ్చారు.

 
"మీ చేతులతో మీరు ఎప్పుడైనా ఎవరికైనా సమాధి తవ్వారా? నేను నా చేతులతో తవ్వి ఆయన్ను పాతిపెట్టాను. ఇలా ఎవరికీ జరగకూడదు" అని డాక్టర్ ప్రదీప్ అన్నారు. ఈ పరిణామాలతో వైద్య ప్రపంచం ఉలిక్కి పడింది. డాక్టర్ సైమన్‌కి జరిగిన ఘటనపై తన బాధని వ్యక్తం చేస్తూ భాగ్యరాజా అనే వైరాలజిస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు.

 
ఇలా జరగడం ఇది మొదటిది కాదు. నెల్లూరులో కోవిడ్-19కి గురై గత వారంలో మరణించిన ఓ డాక్టర్‌కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. నెల్లూరు డాక్టర్ బంధువులు అంతా క్వారంటైన్‌లో ఉండగా, కార్పొరేషన్ అధికారులు ఆయన శవాన్ని దహనం చేశారు. ఆయన శవాన్ని అంబత్తూరు స్మశానానికి తీసుకుని వెళ్ళగానే, స్థానిక ప్రజలు అధికారులపై దాడి చేశారు. దాంతో ఆయన శవాన్ని అక్కడే వదిలి పెట్టి అధికారులు పారిపోవాల్సి వచ్చింది.

 
తర్వాత ఇంకొక ప్రదేశంలో ఆయన్ను ఖననం చేయాల్సి వచ్చింది. ఇది సమన్వయ లోపం వలన జరిగిందని, ఇలా మళ్ళీ జరగకుండా చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి బీల రాజేష్ చెప్పారు. కానీ, డాక్టర్ సైమన్‌కి జరిగిన అవమానం వైద్య రంగం అంతటిని కలచి వేసింది. తమిళనాడులో ఏప్రిల్ 20 నాటికి కరోనావైరస్‌కి గురై 17 మంది మరణించారు. అయితే, డాక్టర్ల అంత్యక్రియలు మాత్రమే వివాదాస్పదమవుతున్నాయి.

 
“డాక్టర్ మరణిస్తే ఆ విషయం వార్తల్లో రావడం వలన ప్రజలు అంత్యక్రియల గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. వాళ్ళని కూడా ఏమీ అనలేం. ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించి ఉండాల్సింది” అని డాక్టర్ ప్రదీప్ అన్నారు. "డాక్టర్లకు రక్షణ కల్పించడానికి, వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మేం వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇలా ప్రవర్తిస్తున్న వారిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తాం" అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయ భాస్కర్ మీడియాకి చెప్పారు.

 
“ప్రజల్ని అనడానికి ఇప్పుడేమీ లేదు. ఎవరైనా డాక్టర్ కరోనా సోకి చనిపోతే , కనీసం జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులు అంత్యక్రియలకి హాజరైతే బాగుంటుంది. అలా చేస్తే స్థానికులకు భరోసా కలుగుతుంది. అలాగే, శవాలని రాత్రి పూట దహనం కానీ, పూడ్చి పెట్టడం కానీ చేయకూడదు. పగలు చేయడం వలన ఇలాంటి పరిస్థితులని అధిగమించవచ్చు” అని ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్‌కి చెందిన డాక్టర్ సుందరేశన్ అన్నారు.

 
ఈ మహమ్మారి నియంత్రణలోకి వచ్చే వరకు అత్యవసరం కాని వారికి వైద్యం చేయడం ఆపేయాలని ఆయన అన్నారు. సాధారణ రోగికి వైద్యం చేస్తున్నప్పుడు కూడా వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించి వైద్యం ఇవ్వడం మంచిదని సూచించారు. నెల్లూరులో మరణించిన డాక్టర్, చెన్నై డాక్టర్ సైమన్ కూడా కోవిడ్ రోగులకు చికిత్స చేయలేదు. కానీ వేరే రోగులకు వైద్యం చేస్తుండగా ఇన్ఫెక్షన్‌కి గురయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో డాక్టర్లందరికీ వ్యక్తిగత రక్షణ పరికరాలు సరఫరా చేయాలని చెన్నై సైకియాట్రిక్ సొసైటీకి చెందిన డాక్టర్ శివ బాలన్ సూచించారు.

 
తమిళనాడు ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ మాజీ అధికారి డాక్టర్ అమల్లోర్ పవనాథన్ లాంటి వారు మృత దేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందదనే విషయం పట్ల సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ప్రజలు మృత దేహాలని ఖననం చేయడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళకి సమాచారం ఎలా అందుతోంది అనే ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఏమీ చేయలేకపోతోంది?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంజాన్ ప్రార్థనలు ఇంటి వద్ద నుండే నిర్వహించాలని విన్నవించిన గవర్నర్