Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్: లాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు, జోన్‌లపై రాష్ట్రాలకే నిర్ణయాధికారం?

కరోనావైరస్: లాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు, జోన్‌లపై రాష్ట్రాలకే నిర్ణయాధికారం?
, శనివారం, 16 మే 2020 (12:39 IST)
లాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు ఉండచ్చని, జోన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని ఈనాడు కథనం ప్రచురించింది. లాక్‌డౌన్ గడువు ఆదివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ అందరిలో వ్యక్తమవుతోంది.
 
భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11న ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అన్ని రాష్ట్రాలు బ్లూప్రింట్స్‌ పంపాలని సూచించారు. దానికి గడువు శుక్రవారంతో ముగిసింది. అందిన సూచనలు ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. జోన్లు/ హాట్‌స్పాట్ల నిర్ణయం, ఆంక్షల అమలుపై ఈసారి రాష్ట్రాలకు మరింత నిర్ణయాధికారం కల్పించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయని ఈనాడు చెప్పింది.
 
క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్ణీత ప్రాంతంలో ప్రజల కదలికల్ని, ఆర్థిక కార్యకలాపాలను అనుమతించడానికి, లేదా నియంత్రించడానికి రాష్ట్రాలకు దానివల్ల వీలుంటుంది. ‘అవసరాలకు అనుగుణంగా’ రైళ్లను, దేశీయ విమాన సర్వీసులను వచ్చేవారం నుంచి పరిమితంగా పునఃప్రారంభించేలా నిర్ణయాలు ఉండవచ్చని తెలుస్తోంది.
 
ఇప్పటికే పరిమిత సంఖ్యలో రైళ్లు నడుపుతుండటం వల్ల భవిష్యత్తులో భౌతిక దూరం పాటిస్తూ విమాన, బస్సు సర్వీసులు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలూ తిరగడానికి అవకాశం కల్పించొచ్చని తెలుస్తోంది. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలు లేనిచోట్ల స్థానిక రైళ్లు, మెట్రోలను పరిమిత సామర్థ్యంతో నడిచేలా అనుమతిస్తారని వినిపిస్తోంది.
 
ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు నడవడానికి అవకాశం కల్పించాలని కేరళ, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాయి. మహారాష్ట్ర మాత్రం లాక్‌డౌన్‌ మినహాయింపులకు ఏమాత్రం సుముఖంగా లేదు. వలస కూలీల రాకతో ఇబ్బందులు పడుతున్న ఝార్ఖండ్‌, ఒడిశాలు లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతున్నాయి.
 
బిహార్‌, మిజోరం రాష్ట్రాలు మే 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే డిమాండ్‌ చేశారని ఈనాడు చెప్పింది. పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, మాల్స్‌ను తెరిచేందుకు తదుపరి లాక్‌డౌన్‌లోనూ అనుమతి ఉండదు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా రెడ్‌జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు, కళ్లజోళ్ల దుకాణాలు వంటివి తెరిచేందుకు వీలు కల్పించవచ్చని. ఒకటిరెండు రోజుల్లో తుది మార్గదర్శకాలు వెలువరిస్తారని ఈనాడు వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వు తప్పు చేశావ్.. ఆమె నీకు పిన్ని వరస అవుతుందంటే?