Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్-లాక్‌డౌన్: మా ఇళ్లకు వెళ్లేదెప్పుడు? వలస కార్మికుల ప్రశ్న

Advertiesment
కరోనావైరస్-లాక్‌డౌన్: మా ఇళ్లకు వెళ్లేదెప్పుడు? వలస కార్మికుల ప్రశ్న
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:15 IST)
ప్రధాన మంత్రి మోదీ దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న విషయాన్ని ప్రకటించగానే కొన్ని వేల మంది వలస కార్మికులు ముంబయి రైల్వే స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. రైలు సేవలు మొదలవుతాయనే వదంతులు రావడంతో, చాలా మంది కార్మికులు సామాజిక దూరం పాటించాలనే నిబంధనని మర్చిపోయి రైల్వే స్టేషన్ల దగ్గర గుమిగూడారు.

 
వారిని తమ స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయమని డిమాండ్ చేశారు. అయితే, గుంపుని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇదే తరహాలో గుజరాత్‌లోని సూరత్‌లోనూ వస్త్ర పరిశ్రమల్లో పని చేసే కార్మికులు కొందరు రోడ్లపైకి వచ్చి తమని ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేయమంటూ నిరసన చేపట్టారు.

 
ఒక రోజు తర్వాత మురికి నీటి కుంటని తలపించే దిల్లీలోని యమునా బ్రిడ్జి కింద కొన్ని వందల మంది వలస కార్మికులు కనిపించారు. మూడు రోజుల నుంచి స్నానపానాదులు, తిండి లేదని వారు చెప్పారు. వాళ్లు ఉండే ఆవాసం కాలిపోయిందని చెప్పారు. అయితే వీరిని ఇప్పుడు కొత్త ఆవాసాలకు తరలించారు.

 
ఇదంతా జీవనాధారం కోసం నగరాలకు వలస వచ్చే గ్రామీణ వలస కార్మికుల బతుకులకు అద్దం పడుతోంది. వలస కార్మికుల సమస్య భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. కాకపొతే, ఇక్కడ సుమారు 4 కోట్ల మంది వలస కార్మికులు ఉండటంతో అందరి క్షేమం చూడటం కూడా కష్టమైన పనే. చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలకు ఇళ్లల్లో పనులకి, డ్రైవర్లుగా, కూలి పనులు చేయడానికి , రోడ్ సైడ్ వ్యాపారాలు చేయడానికి వలస వస్తూ ఉంటారు.

 
భారతదేశంలో వలస కార్మికుల సమస్యని పట్టించుకోకపోవడం సిగ్గు పడే విషయమని ఒక విమర్శకుడు అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాలలో తల దాచుకుంటున్న వలస కార్మికులంతా లాక్ డౌన్ సడలిస్తే తమ స్వస్థలాలకు వెళ్లాలని ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక స్కూల్ భవనంలో వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఒక షెల్టర్ హోమ్ కి వెళ్లాను.

 
అక్కడ 380 మంది వలస కార్మికులు ఉన్నారు. అక్కడ చాలా మందితో నేను మాట్లాడాను. అందరి దగ్గరి నుంచి నాకు "నేనెప్పుడు ఇంటికి వెళ్ళగలను" అనే ఒకే ఒక్క ప్రశ్న ఎదురైంది. "మమ్మల్ని ఇంటికి చేరుస్తామని చెప్పి వలస ఇక్కడికి తెచ్చి పెట్టారని”, మనోజ్ అహిర్వాల్ అనే వ్యక్తి చెప్పారు. ఆయన మార్చ్ 29వ తేదీ నుంచి తన బంధువులతో పాటు ఈ షెల్టర్ హోమ్ లో ఉంటున్నారు

 
25 సంవత్సరాల మనోజ్ దిల్లీ నుంచి 400 మైళ్ళ దూరంలో ఉన్న సిమరియా నుంచి పనుల కోసం వచ్చారు. శీతాకాలం పంట బాగా వస్తోంది కానీ పంటని సేకరించడానికి ఇంకొక్క నెల సమయం ఉండటంతో దిల్లీలో తన తల్లి కూలి పనులు చేస్తున్న చోటికి పని కోసం వచ్చానని చెప్పారు. ఆయన వచ్చిన మూడు రోజులకే దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించారు.

 
వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో వారి ఊళ్ళకి తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నారు. కానీ, దేశ వ్యాప్తంగా రైలు, బస్సు సర్వీసులు నిలిపివేయడంతో అది సాధ్యపడలేదు. మార్చ్ 28 వ తేదీన వలస కార్మికుల్ని తరలించడానికి ప్రభుత్వం బస్సులను వేస్తుందని విని వీరంతా ఆనంద్ విహార్ బస్సు స్టేషన్‌కు వెళ్లారు. కానీ, అప్పటికే బస్సులన్నీ వెళ్లిపోయి, కొన్ని వందల మంది బస్సు స్టాండ్ లో నిల్చిపోయారు.

 
కొంత మంది ఏమీ చేయలేక నడక దారి పట్టారు. మేము 10 కేజీల రొట్టె పిండి, బంగాళాదుంపలు, టొమాటోలు కొనుక్కున్నాం. దారిలో ఆగి రాత్రి పూత వండుకోవచ్చని అనుకున్నామని , మనోజ్ తల్లి కాళీబాయి అహిర్వాల్ చెప్పారు.

 
దిల్లీలోని షెల్టర్ హోంలో అధికారులు వీరికి మూడు పూట్లా భోజనం పెడుతున్నారు. పిల్లలకి పాలు, గర్భిణులకు పండ్లు ఇస్తున్నారు. ఇక్కడ అధికారులు ఇచ్చే సౌకర్యాలు బాగానే ఉన్నాయి కానీ, మాకు ఇళ్లకి వెళ్లిపోవాలని ఉందని షెల్టర్ హోంలో ఉన్నవారు చెప్పారు.

 
గోధుమ పంట ఇప్పుడు కోతకి వస్తుందని, ఇంటి దగ్గర వాళ్ల నాన్న, సోదరుడు మాత్రమే పంట పనులు చేయలేరని మనోజ్ చెప్పారు. “సంవత్సరానికి సరిపడే గ్రాసం పండించుకోవడానికి సిద్ధమయ్యే సమయం ఇది. ఒక రెండు మూడు నెలలు ప్రభుత్వం మాకు తిండి పెడుతుంది. తర్వాత మా పరిస్థితి ఏమిటని” కాళీబాయి ప్రశ్నిస్తున్నారు.

 
దేశంలో లాక్ డౌన్ ప్రకటించేటప్పటికి ప్రజలకి కేవలం నాల్గు గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో చాలా అస్తవ్యస్తత నెలకొంది. మోదీ లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే లక్షలాది మంది వలస కార్మికులు నగరాల నుంచి ఇంటికి నడక దారి పట్టారు. ఈ క్రమంలో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

 
ప్రజల ప్రాణాలు కాపాడటానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని అధికారులు చెబుతున్నారు. అయితే లాక్ డౌన్ విషయంలో సరైన ప్రణాళిక లోపించడంతో దేశంలో పేద ప్రజలు, వలస కార్మికులు ఇబ్బంది పడ్డారు. వీరంతా పనులు కోల్పోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆహార సరఫరాల పై వీరంతా ఆధారపడ్డారు. నేను ఈ వార్త రాస్తుండగా ఒక 12 ఏళ్ల అమ్మాయి తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ వెళుతూ దారిలో మరణించిందనే వార్తలు వచ్చాయి. ఆమె ఇంటికి చేరడానికి ఇంకొక 14 కిలోమీటర్ల దూరం ఉందనగా మూడు రోజులు నడిచిన తర్వాత చనిపోయింది.

 
“ఈ లాక్ డౌన్ పూర్తిగా అమానవీయంగా ఉందని” సుప్రీమ్ కోర్ట్లో వలస కార్మికుల్ని ఇళ్ళకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేసిన లాయర్ ప్రశాంత్ భూషణ్ అన్నారు. కోవిడ్ 19 ధ్రువీకరణ అవ్వని వారిని బలవంతంగా షెల్టర్లలో పెట్టకూడదని అన్నారు. వారంతా ఇళ్ళకి వెళ్ళడానికి తగిన రవాణా సౌకర్యాలని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. షెల్టర్ హోమ్లో ప్రతి ఒక్కరికి ప్రతి రోజు పొద్దునే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, ఇప్పటి వరకు ఎవరికీ కోవిడ్ 19 సోకలేదని వైద్య అధికారి నీలం చౌదరి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్ డౌన్‌ పాస్‌‌ను అలా వాడుకున్నాడు.. వేరొక మహిళతో?