Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా: కుంభమేళాలో పాల్గొన్న సాధువులు, సన్యాసులు ఇప్పుడు వైరస్ వ్యాప్తి, కోవిడ్ మరణాల గురించి ఏమంటున్నారు?

Advertiesment
కరోనా: కుంభమేళాలో పాల్గొన్న సాధువులు, సన్యాసులు ఇప్పుడు వైరస్ వ్యాప్తి, కోవిడ్ మరణాల గురించి ఏమంటున్నారు?
, సోమవారం, 10 మే 2021 (13:23 IST)
గత నెలలో హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో వేలమంది పాల్గొనడంతో అక్కడ కరోనా వేగంగా వ్యాపించింది. వివిధ అఖాడాలకు చెందిన అనేకమంది సాధువులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే చిట్టచివరి పుణ్య స్నానానికి రెండు వారాల ముందే కొందరు అఖాడాలు కుంభమేళాకు ముగింపు పలికారు. అక్కడి నుంచి వారంతా వెనుదిరగడం ప్రారంభించారు. కరోనా కారణంగా అనేకమంది సాధువులు, సన్యాసులు ప్రాణాలు కోల్పోయారు.

 
ఇంత జరిగిన తరువాత కూడా కుంభమేళా గురించి వారికి కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. కుంభమేళా నిర్వహించడం తప్పు అనిగానీ, దానివల్లే కోవిడ్ మరింత వేగంగా వ్యాపించిందనిగానీ వారు భావించట్లేదు. కుంభమేళాకు వెళ్లి వచ్చిన జూనా అఖాడా సాధువు స్వామి ప్రజ్ఞానంద్ గిరి రెండు రోజుల క్రితం మరణించారు. హరిద్వార్ నుంచి వచ్చిన తరువాత స్వామి ప్రజ్ఞానంద్ గిరి బృందావన్ చేరుకున్నారు. అయితే, కరోనా సోకిన తరువాత ఆయన ప్రయాగరాజ్‌లోని స్వరూపరాణి నెహ్రూ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే, హరిద్వార్‌కు వెళ్లి వచ్చినవారిలో వివిధ అఖాడాలకు చెందిన సుమారు డజను మంది సాధువులు మరణించారు.

 
మహానిర్వాణి అఖాడాకు చెందిన మహమండలేశ్వర్‌ కపిల్‌ దేవ్‌ ఏప్రిల్‌ 13న కరోనాతో మరణించడంతో ఒక్కసారిగా ఆందోళన పెరిగింది. ఆ తరువాత, వివిధ ఆఖాడాలలో పరీక్షలు నిర్వహించగా, అనేకమంది సాధువులకు కోవిడ్ సోకినట్లు తేలింది. వీరిలో కొంతమందిని ఆ అఖాడాల్లోనే ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. కానీ, కొందరు సాధువులు మరణించారు.

 
అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు, నిరంజని అఖాడాకు చెందిన సాధువు నరేంద్ర గిరి కూడా కుంభమేళాకు వెళ్లివచ్చిన తరువాత కరోనా బారిన పడ్డారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఇప్పుడు కోలుకుంటున్నారు. "కరోనా అన్నిచోట్లా వ్యాపిస్తోంది. ఎక్కువమంది కోవిడ్ బారిన పడుతున్నారు. కుంభమేళా, ఎన్నికల ప్రచార ర్యాలీలు జరిగాయా, జరగలేదా అనేదానికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదు. ఈ రెండూ జరగని చోట్ల మాత్రం కరోనా వ్యాపించకుండా ఉందా? అందరికీ కోవిడ్ సోకుతోంది. అలాగే సాధువులకు సోకుతోంది. ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది. అందుకే అందరికీ చికిత్స అందుతోంది. మాకు అఖాడాల్లో డాక్టర్ ఉండరు కదా" అని స్వామీ నరేంద్ర గిరి బీబీసీతో అన్నారు.

 
కుంభమేళా నిర్వహించకపోయినా కరోనా వ్యాపించి ఉండేదని, ఆ ఉత్సవం వ్యవధిని తగ్గించి ఉండకూడదని ఆయన అన్నారు. "మా అఖాడాలో నాతో కలిపి ఆరుగురు సాధువులు కరోనా బారిన పడ్డారు. ఐదుగురు చనిపోయారు. ఇతర అఖాడాలలో కూడా చాలామందికి కోవిడ్ సోకింది. సుమారు పదిమంది చనిపోయారు. మిగతావారంతా బయటపడ్డారు" అని నరేంద్ర గిరి చెప్పారు. మహానిర్వాణి అఖాడాకు చెందిన సాధువులు అనేకమంది కరోనా బారిన పడ్డారు.

 
అయితే, ఆ అఖాడా అధిపతి రామ్‌సేవక్ గిరి దీన్ని "భగవంతుడు రాసిన విధి" అని అంటున్నారు. ఈ విపత్తునూ ఆపలేం, కుంభమేళానూ ఆపలేం అని ఆయన అన్నారు. "సాధువులు కూడా భారతదేశంలోనే ఉన్నారు. బయట లేరు కదా. మిగతావారికి వచ్చిన ఆపదే సాధువులకు కూడా వస్తుంది. సాధువులని చెప్పి కరోనా మమ్మల్ని విడిచిపెడుతుందా? భగవంతుడి చిత్తాన్ని మనం ఆపలేం కదా. దీని గురించి ఆలోచించడమే అనవసరం" అని రామ్‌సేవక్ గిరి అన్నారు.

 
గంగానది నిర్మల ప్రవాహంలో స్నానం చేసి ఉంటే ఎవరికీ ఏ కరోనా వచ్చేది కాదని ఆయన అన్నారు. "ఎక్కడ భావన ఉంటుందో, అక్కడ దేవుడు ఉంటాడు. గంగానది ఎప్పుడో ముగిసిపోయిన కథ. అసలు గంగ ఎక్కడుంది? ఆనకట్ట కట్టి ప్రవాహాన్ని ఆపుతున్నారు. అందులో మునిగితే మోక్షం వచ్చేయాలని భావిస్తున్నారు. ఎలా వస్తుంది? గంగానది నిర్మల ప్రవాహంలో మునిగితేనే అన్ని దోషాలూ పోతాయి. పుణ్యం వస్తుంది. ఇప్పుడు కేవలం ఫార్మాలిటీ కోసమే చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగించడానికే చేస్తున్నారు. ఇంకేం చెయ్యగలం?" అని రామ్‌సేవక్ గిరి ఆగ్రహంతో అన్నారు.

 
జూనా అఖాడాలో కూడా అనేకమంది సాధువులకు కరోనా సోకింది. ముగ్గురు చనిపోయారు. "ఆపద వస్తే అందరికీ వస్తుంది. అయితే, కొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నిస్తున్నారు. అఖాడాలో సాధువులు సాధారణ ప్రజలకు దూరంగా నివసిస్తారు. కానీ, వైరస్ గాల్లో ఉంది. అందుకే మాకూ సోకుతోంది. అయితే, మా సాధువుల జీవన శైలి కారణంగా కోవిడ్ ప్రభావం మాపై ఎక్కువ లేదు" అని జూనా అఖాడాకు చెందిన హరి గిరి మహరాజ్ అభిప్రాయపడ్డారు.

 
కుంభమేళాకు, కోవిడ్ వ్యాప్తికి ఏ సంబంధం లేదని కొందరు అఖాడాలు వాదిస్తున్నారు. దిగంబర్ అఖాడాకు చెందిన కిషన్‌దాస్ ఇప్పటికీ హరిద్వార్‌లోనే ఉన్నారు. వారి అఖాడాలో ఎవరికీ కరోనా సోకలేదని చెప్పారు. నిర్మోహీ అఖాడా అధిపతి రాజేంద్ర దాస్ కూడా ఇదే మాట చెబుతున్నారు. వారితో సహా వారి అఖాడాకు చెందిన అనేకమంది సాధువులు ఇంకా హరిద్వారలోనే ఉన్నారని, వారెవరికీ ఏమీ కాలేదని చెప్పారు. కాగా, హరిద్వార్‌లో మొత్తం 2,642 మందికి కరోనా సోకిందని, వీరిలో అనేకమంది మత గురువులు, సాధువులు కూడా ఉన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

 
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షా, రాణీ కోమల్ షా కూడా కుంభమేళాకు వెళ్లి వచ్చిన తరువాత కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రవణ్ రాథోడ్ కూడా కుంభమేళా నుంచి వచ్చిన తరువాత ముంబైలోని ఒక ఆస్పత్రిలో కన్ను మూశారు. అఖాడా సాధువులకే కాదు, కుంభమేళాకు వచ్చిన భక్తులకు కూడా సరిగా కరోనా పరీక్షలు నిర్వహించలేదని, ఇక్కడకు వచ్చినవారంతా తమతోపాటూ వైరస్‌ను కూడా తీసుకెళ్లి ఉంటారు అని కుంభమేళా విధుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

 
"అఖాడాలు కరోనా టెస్టులు జరపడానికి అనుమతి ఇవ్వనే లేదు. మహామండలేశ్వర్ మరణించాక, అనేకమంది సాధువులకు లక్షణాలు కనిపించడం మొదలు పెట్టాక కొంతవరకు పరీక్షలు జరుపగలిగాం" అని ఆయన అన్నారు. కుంభమేళాలో పాల్గొనేవారంతా నెగటివ్ రిపోర్ట్ చూపించాలని నిబంధనలు విధించారు. కానీ, అక్కడ కరోనా నిబంధనలు, భౌతిక దూరం పాటించేలా చేయడం సాధ్యపడలేదు. దాంతో కుంభమేళాలో కరోనా వ్యాప్తి అధికమైంది. దాని తరువాత ఉత్తరాఖండ్‌లో కూడా కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ సరోజ్ ఆస్పత్రిలో 80 మంది వైద్యులకు కరోనా వైరస్