2020ను ఇయర్ ఆఫ్ ది ఉమెన్ సేఫ్టీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ల నినాదంతో ముందుకెళ్తామని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై హింసను అరికట్టేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అందులో భాగంగా వచ్చే ఏడాది 2020ని 'ఇయర్ ఆఫ్ ది ఉమెన్ సేఫ్టీ'గా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లనూ ఉమెన్ ఫ్రెండ్లీగా మార్చాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
అదేసమయంలో 2019లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వరకట్న వేధింపుల కారణంగా జరిగే మరణాలు 24 శాతం తగ్గాయి. 2018లో 135 కేసులు నమోదు కాగా, ఈ ఏడాదిలో 102 నమోదయ్యాయి. అత్యాచార కేసులు 687 నుంచి 662కి తగ్గాయి. నమ్మించి అత్యాచారాలకు పాల్పడుతున్న కేసులు మాత్రం పెరిగాయి.
2018లో 344 నమోదవ్వగా, 2019లో 430కి పెరిగాయి. వేధింపుల కేసులు కూడా 14 శాతం పెరిగాయి. 2018లో 6,679 కేసుల నుంచి 2019లో 7,731కి పెరిగాయి. మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు 10 శాతం తగ్గాయి. గత ఏడాది 205 కేసులు నమోదయితే, 2019లో 198కి తగ్గాయి. 322 మంది మహిళలను పోలీసులు రక్షించారు. 609 మంది ట్రాఫికర్లను అరెస్ట్ చేశారు.
మహిళలపై దాడులు అరికట్టేందుకు చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, దానికి అనుగుణంగా పోలీస్ విభాగాన్ని సన్నద్ధం చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. "మహిళలపై హింసకు సంబంధించిన కేసుల నమోదుకు గతం కంటే ఇప్పుడు కొంత చైతన్యం పెరిగింది. ఫిర్యాదులు చేసేందుకు బాధితులు ముందుకొస్తున్నారు. పోలీస్ స్టేషన్లలోనూ సిబ్బంది ఆలోచనా దోరణిని మార్చడం ద్వారా మహిళల కేసులను సమర్థవంతంగా చేధించేందుకు ప్రయత్నిస్తున్నాం. 2020లో అదే లక్ష్యంతో పనిచేస్తాం.
సైబర్ మిత్ర, మహిళా మిత్రలను కూడా ఉపయోగించుకుని ఘటన జరిగిన వెంటనే పట్టణాల్లో అయితే 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 నిమిషాల్లో సంబంధిత ప్రాంతానికి చేరుకునేలా చేస్తాం. జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా స్పందించే వ్యవస్థను నెలకొల్పుతున్నాం. 100, 112 నెంబర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌కి తక్షణం స్పందించేందుకు తగ్గట్టుగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. దిశ చట్టం అమలు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌లను 4 రెట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్నాం. మహిళలకు పోలీసులు రక్షణగా ఉంటారనే ధీమా పెంచుతాం" అని డీజీపీ వివరించారు.
దిశ చట్టం కోసం
దిశ చట్టం అమలు చేసి మహిళలపై నేరాలు నియంత్రించేందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. జనవరి 1న దిశ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. డిసెంబర్ 3 నుంచి జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలి జీరో ఎఫ్ఐఆర్ కృష్ణా జిల్లా కంచికచర్లలో నమోదు కాగా, ఇప్పటి వరకు 49 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
నివేదికలో ముఖ్యాంశాలు
2018తో పోలిస్తే 2019లో మొత్తం నేరాల్లో ఆరు శాతం తగ్గుదల నమోదైంది.
2018లో రాష్ట్రవ్యాప్తంగా 1,19,541 నేరాలు నమోదయ్యాయి. 2019లో 1,12,697కి తగ్గాయి.
తీవ్రవాద కార్యకలాపాలు రెండు జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉంది.
2019లో 46 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్ట్ అయ్యారు. 53 మంది పోలీసుల ముందు లొంగిపోయారు.
రాష్ట్రంలో జూదం, గుట్కా, ఇసుక అక్రమ తరలింపు, బెల్ట్ షాపులు, గంజాయి కేసులు పెరిగాయి.
గుట్కా కేసులు 125 శాతం పెరిగాయి.
గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల అమ్మకాల మీద ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసులు 27 శాతం పెరిగాయి.
బెల్ట్ షాపులు, ఇతర అక్రమ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ చట్టం కింద కేసులు 66 శాతం పెరిగాయి.
గేమింగ్ యాక్ట్ కేసులు 12 శాతం పెరిగాయి.
ఇసుక అక్రమ రవాణా కేసులు 140 శాతం పెరిగాయి. 2018లో 1,334 కేసులు నమోదవ్వగా, 2019లో ఆ సంఖ్య 3,207కు పెరిగింది.
సైబర్ నేరాలు 53 శాతం పెరిగాయి. 2018లో 1,414 కేసులు నమోదయితే, 2019లో అవి 2,165కి చేరాయి.