Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అసలక్కడేం జరుగుతోంది?

అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అసలక్కడేం జరుగుతోంది?
, బుధవారం, 28 ఆగస్టు 2019 (17:42 IST)
'నేను వారానికోసారి రాజధాని నిర్మాణ పనులు చూసేందుకు ఇక్కడికి వచ్చేవాడ్ని. మా మూడెకరాల భూమిని రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చాం. కానీ, నాలుగు నెలలుగా పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి జూన్ నెలాఖరుకు రావాల్సిన కౌలు ఇంకా రాలేదు. మా చుట్టపక్కల గ్రామాల్లోనూ చర్చనీయాంశంగా మారింది' అని అంటున్నారు తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన కె. జనార్దన్ రావు.

 
వివాదం ఎందుకు?
పురపాలక మంత్రి బొత్సా సత్యనారాయణ గత వారం చేసిన ప్రకటనలు చర్చనీయాంశంగా మారాయి. వరద ముంపు ప్రాంతాలు సందర్శించిన తరువాత ఆయన మీడియాతో మాట్లడుతూ, ''రాజధాని ప్రాంతం వరద ముంపు ప్రాంతంలో ఉందన్న విషయం శివరామకృష్ణ కమిటీ నివేదికలో కూడా ఉంది. ఇక్కడ నిర్మాణం కోసం వెచ్చించాల్సిన డబ్బు కూడా రెండింతలవుతుంది. ప్రజాధనం వృథా అవుతుంది. వరద ముంపు నుంచి రక్షణకు డ్యామ్‌లు, లిఫ్ట్ ప్రాజెక్టులు నిర్మించాల్సిన పరిస్థితి. అందుకే రాజధానిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేం అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేస్తున్నాం. త్వరలోనే మా ప్రభుత్వ ప్రణాళిక బయట పెడతాం'' అని అన్నారు.

 
మంత్రి వ్యాఖ్యలు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే, రాజధాని మార్పుపై వస్తున్న వార్తలపై మరో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశంలో స్పందిస్తూ.. రాజధాని నగరాన్ని మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఇదే అంశంపై బీజేపీ నాయకుడు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా కొనసాగించే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు.

 
ఈ నేపథ్యంలో బీబీసీ న్యూస్ తెలుగు వీటిలో కొన్ని గ్రామాలకు వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడింది. కొందరు రైతులు, స్థానికులు రాజధాని మార్పు ఊహాగానాలపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, రాజధానికి భూములు ఇవ్వని రైతులు, మరికొంత మంది స్థానికులు రాజధాని మార్పు ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు.

 
భూమి ఇచ్చిన రైతుల ఆందోళన
వెలగపూడి గ్రామం మధ్యలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొంత మంది గ్రామస్థులు కూర్చొని ఉన్నారు. వారిని రాజధాని గురించి అడగగానే శ్రీనివాసరావు అనే వ్యక్తి స్పందిస్తూ ''మేం వ్యవసాయాన్ని వదిలేసి, పొలం దున్ని నాలుగేళ్లు అవుతోంది. రాజధాని వస్తుందని మా భూములు ఇచ్చేశాం. వచ్చిన డబ్బుతో నా లాంటి మధ్య తరగతి రైతులు కోటీశ్వరులయ్యారు. భూమికి బదులుగా మాకు ఇచ్చిన ప్లాట్లలో కొంత భాగం అమ్ముకొని బిడ్డలను పైచదువులకు పంపాం. కానీ, ఇప్పుడు రాజధాని వరద ముంపు ప్రాంతం.. నిర్మాణాన్ని పునరాలోచించాలంటే నా లాంటి రైతులు విషం తాగాల్సిందే'' అని పేర్కొన్నారు.
webdunia

 
శ్రీనివాసరావు ఒక్కరే కాదు ఇక్కడ చాలామంది రైతులది ఇదే భావన. వెలగపూడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే రాజధాని 'కోర్ క్యాపిటల్' నిర్మాణం జరుగుతోంది. అక్కడ ప్రస్తుతం నిర్మాణ పనులు ఆగిపోయాయి. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస భవనాల పనులు ఆపేసినట్టు కనిపిస్తోంది. దీని ప్రభావం చుట్టపక్కల గ్రామాల్లో కనిపిస్తోంది.

 
భాస్కర్ రావు నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. అందులో నాలుగు పోర్షన్‌లు అద్దెకు ఇచ్చారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''నెలకు ఒక పోర్షన్‌కు రూ.15 వేలు వచ్చేది. నిర్మాణ పనులు చేసేందుకు వచ్చిన కంపెనీల ఉద్యోగులు మా ఇంట్లో అద్దెకు ఉండేవారు. 3 నెలల కిందట వారంతా ఖాళీ చేసేశారు. ఇప్పటికీ ఎవరూ అద్దెకు దిగలేదు. ఆదివారం వస్తే మార్కెట్ అంత రద్దీగా ఉండేది. ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. నెలనెలా వచ్చే ఆదాయం కోల్పోయాం'' అని ఆవేదన చెందారు.

 
రాయపూడికి చెందిన వెంకటేశ్వరరావు తన వాటా కింద వచ్చిన ప్లాట్లో కొంత భాగం అమ్మి లారీలు, ట్రాక్టర్లు కొన్నారు. ''రాజధాని నిర్మాణ పనులకు నా ట్రాక్టర్లు, లారీలు పెట్టాను. ఐదు నెలల నుంచి ట్రిప్పులు తగ్గాయి. ఇప్పటిదాకా చేసిన పనికి రూ. 2 కోట్ల వరకు బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. నెల తిరిగేసరికి రూ. 10 లక్షల దాకా వడ్డీలు కట్టాలి'' అని చెప్పారు.

 
కె. జనార్దన్ రావు మాతో పాటూ రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చారు. ''పనులు ఆగిపోవడం చూస్తుంటే బాధగా ఉంది. భవిష్యత్తుపై భయమేస్తోంది. అప్పటి ప్రభుత్వం సింగపూర్‌కు తీసుకెళ్లిన రైతులలో నేను ఒకడిని. అక్కడ నిర్మాణాలు చూసి అంతలా కాకపోయినా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మాత్రం అనుకున్నా. సాగు చేయడంలో వచ్చే కష్టనష్టాలు తెలుసు కాబట్టి రాజధాని కోసం భూమి ఇవ్వాలని అనుకున్నా. పదేళ్లలో రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందితే లాభపడుతామని భావించా. ఇప్పుడు రాజధాని మార్చితే పరిస్థితి ఏమిటి? మా భూములు వెనక్కి ఇస్తారా.. ఇస్తే ఎక్కడ ఇస్తారు? మాకిచ్చే భూమి సాగుకు పనికి రాకపోతే ఎలా? దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'' అని కోరారు.
webdunia

 
ఉపాధి కోల్పోయిన నిర్మాణ కూలీలు
గతంలో ఈ ప్రాంతంలో కౌలు రైతులుగా ఉన్నవారు ఇప్పుడు నిర్మాణ కూలీలుగా మారారు. రాజధాని పరిసర ప్రాంతాల నుంచి వారు ఇక్కడికి వచ్చారు. పనులు నిలిచిపోవడంతో చాలా మంది తిరిగి వెళ్లిపోతున్నారు. నిర్మాణ పనుల వద్ద చిన్న చిన్న కొట్లు పెట్టుకున్నవారు కూడా వెళ్లిపోతున్నారు. పశ్చిమ బంగాకు చెందిన సంజయ్ 2018 జూన్‌లో ఇక్కడికి వచ్చారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''రూ. లక్ష అప్పు చేసి ఇక్కడికి వచ్చాను. చికెన్ షాప్, టీకొట్టు పెట్టాను. రెండు నెలల కింద చికెన్ షాప్ మూసేశాను. ఇప్పుడు టీకొట్టు అమ్మేసి ఇంటికి వెళ్దామని అనుకుంటున్నా'' అని చెప్పారు. జార్ఘండ్‌కు చెందిన రఘువీందర్ యాదవ్ కూడా ఇలానే చెప్పారు. తాను కూడా తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు.

 
భూమి ఇవ్వని రైతులు మాటేమిటి?
రాజధాని పరిధిలో భూములు ఇవ్వని రైతులు కూడా చాలామంది ఉన్నారు. వెలగపూడి చెందిన రంగారావు అలాంటివారిలో ఒకరు. వారికి చెందిన 9 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదు. ''ఇది వరద ప్రాంతం అని శివరామకృష్ణ కమిటీ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పారు. కానీ, వారి నివేదికను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. రెండు వారాలుగా కురిసిన వర్షానికే ఇక్కడ వరదలు వచ్చాయి. గతంలో భారీ వర్షాలకు మా ఇల్లు కూడా నీట మునిగింది. మేం చూసింది నిజం కాదు అంటే ఎలా కుదురుతుంది. మొన్నటి దాక మా పొలంలో సాగు చేయలేదు. ఈ ఏడాది నుంచి సాగు చేయాలని అనుకుంటున్నాం. ఎంత కాలమని ఇలా ఖాళీగా కూర్చొని తింటాం'' అని అన్నారు.

 
రాజధాని ప్రాంతానికి సరిహద్దులలోని నిడమర్రు గ్రామం ఉంది. ఇక్కడ దాదాపు 40 శాతం రైతులు తమ భూములు ఇవ్వలేదు. నిడమర్రులో రైతులు ప్రధానంగా పూల తోటలను పెంచుతుంటారు. ''ఇక్కడ ఏడాదంతా ఏదో ఒక పంట సాగు చేస్తుంటారు. కౌలుకి ఇస్తే ఎకరాకు రూ. లక్ష నుంచి లక్షా ఎనభై వేల వరకు వస్తుంది. ఎకరం భూమిని నమ్ముకొని ఉన్న కుటుంబాలు ఇక్కడ చాలా ఉన్నాయి. మేం మా భూమిని ఎందుకు ఇస్తాం'' అని ఒక రైతు ప్రశ్నించారు.
webdunia

 
రాజధాని నిర్మాణం ఎంతవరకు వచ్చింది?
అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ. లక్షా తొమ్మిది వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రాజధాని నగరం సుమారు 54 వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుందని గత ప్రభుత్వం చెప్పింది. సమీకరించిన భూమిలో 90 శాతం భూమిని యజమానులు, రైతుల సమ్మతితోనే తీసుకున్నామని తెలిపింది. 2019 జూన్ 28న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఇప్పటికి 34,281 ఎకరాల భూమిని 25,398 మంది ల్యాండ్ పూలింగ్‌కి ఇచ్చారు.

 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాల్లో రాజధాని గురించి వ్యాఖ్యానిస్తూ ''రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా గత ప్రభుత్వం రాజధానికి రెండు లక్షల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేసింది. కానీ, ఐదేళ్లలో రాజధాని కోసం ఖర్చు పెట్టింది పిసరంతే'' అని పేర్కొంది.

 
10.32 శాతం వడ్డీతో సీఆర్‌డీఏ విడుదల చేసిన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల గురించి కూడా ప్రభుత్వం శ్వేతపత్రాల్లో ప్రస్తావించింది. ఈ డిబెంచర్లు విడుదల చేసినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఏడు శాతం కంటే తక్కువే ఉన్నాయని చెప్పింది. ఈ డిబెంచర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉందని, గత ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు నమ్మకం లేదని ఇది సూచిస్తోందని తెలిపింది.

 
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం రూ.1,500 కోట్లు ఇచ్చినట్లు సీఆర్‌డీఏ కమిషనర్ పి.లక్ష్మీనరసింహం తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 1632.48 కోట్ల రూపాయల వెచ్చించినట్లు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం తొలి దశ పనులకు రూ.51,687 కోట్లు కేటాయించారు. ఈ దశలో రోడ్లు, ప్రభుత్వ భవనాలు, రింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ఇంకా అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి. అయితే జూన్ చివరి నాటికి రాజధాని నిర్మాణానికి పెట్టిన ఖర్చు శ్వేతపత్రం ప్రకారం రూ. 4,939 కోట్లు మాత్రమే.

 
తొలి దశ పనులకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 37,112 కోట్లు అప్పు చేసింది. అందులో హడ్కో నుంచి రూ. 1,098 కోట్లు, అమరావతి బాండ్స్ రూపేణ రూ. 2,000 కోట్లు, వివిధ బ్యాంకుల నుంచి రూ.1,862 కోట్లు, అమరావతి ఇటుకల ద్వారా రూ. 55 కోట్లు సమీకరించింది. ప్రపంచ బ్యాంకు నుంచి వస్తుందనుకున్న రుణం నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,819 కోట్ల భారం పడిందని ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇది కాకుండా భూములిచ్చిన రైతులకు ఏటా ఇవ్వవలసిన కౌలు ఇంకా ఇవ్వలేదు.

 
ఈ ఏడు 26,818 మంది రైతులకు రూ. 185.28 కోట్లు చెల్లించాలి. 21,643 కుటుంబాలకు రూ. 84.24 కోట్ల పింఛను ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన టెండర్లను నిలుపుదల చేయాలని సీఆర్‌డీఏను ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల దాదాపు రూ.8 వేల కోట్ల కాంట్రక్టు పనులు నిలిపోయాయి. నిర్మాణ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు చాలామంది తిరిగివెళ్లిపోతున్నారు.

 
''గత ప్రభుత్వం ఆర్థిక, వాతావరణం, సామజిక పరిణామాలని పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం చేపట్టింది. దీనివల్ల ప్రపంచం ముందు తలవంచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అలా జరగకుండా ఉండాలనే ప్రపంచ బ్యాంకు రుణం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది'' అని ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ఒక ప్రకటనలో తెలిపారు.
webdunia

 
రాజధాని ఎక్కడ? మంత్రులు ఏమంటున్నారు?
రాజధాని మార్పుపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. అయితే, మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ ఈ అంశంపై మాట్లాడుతూ, ‘‘రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతానికో... ఒక సామాజికవర్గానికో... కొందరి నాయకుల సొంతానికో కాదు. 5 కోట్ల మంది ప్రజలది. 13 జిల్లాలకు సంబంధించిన అంశం’’ అని అన్నారు.

 
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతూ తలసరి ఆదాయం పెరగాలనేదే సీఎం జగన్ ఆలోచనని, కేవలం ఒకరికే మేలు చేసేలా తమ ప్రభుత్వం వ్యవహరించదని మంత్రి తెలిపారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని మరో మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఐదేళ్ల నుంచి ప్రభుత్వం పోలవరం, అమరావతి నిర్మాణాలకు కోట్ల రూపాయిలు ఖర్చు చేసిందని చెప్పారు.

 
''చంద్రబాబు నాయుడు అనుకున్న రాజధాని కట్టేందుకు ఈ ప్రభుత్వం లేదు. ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడేట్టు రాజధాని నిర్మించడం మా బాధ్యత'' అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''రాజధాని ప్రాంతం ఒక్క దగ్గరే కేంద్రీకృతమైతే ఉపయోగం లేదు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి ఎక్కడ పెట్టాలో ప్రభుత్వం నిర్ణయించకూడదు. పెట్టుబడులు రావటం ముఖ్యం. గత ప్రభుత్వం ఇదే తప్పు చేసింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీని మన దగ్గర పెట్టమని అడిగితే ఎందుకు పెడుతారు? ఏం చూసి ఇక్కడికి వస్తారు? రాజధాని పేరుతో ఇక్కడ ఏం ఉంది? పెట్టుబడిదారులు ఎలా వస్తారు?" అని అన్నారు.

 
రాజధాని మార్పు ఊహాగానాలపై ప్రశ్నించగా, ''అన్నీ ఒకటే దగ్గర కేంద్రీకృతమయితే ఉపయోగం లేదు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలి. ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడికే పెట్టుబడిదారులను తీసుకొని వెళ్లాలి'' అని అన్నారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈపీఎఫ్‌ స్కీములో కొత్త నిబంధన... ఉద్యోగులకు మేలా? కీడా?