Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా అడ్డుకోగలదా?

Advertiesment
పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా అడ్డుకోగలదా?
, శుక్రవారం, 18 అక్టోబరు 2019 (15:12 IST)
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏ‌టీఎఫ్) గ్రే లిస్టు నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? పాక్ గత ఆరు నెలలుగా ఎక్కువగా దృష్టి పెట్టిన అంశం ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్టు నుంచి బయటపడటం. అందుకోసం, ఈ ఆరు నెలల్లో నిషేధిత సంస్థలకు చెందిన 5,000కు పైగా బ్యాంకు ఖాతాలను మూసివేయడంతో పాటు, ఆ ఖాతాలలోని నగదును ఫ్రీజ్ చేసింది.
 
ఈ క్రమంలో నిషేధిత సంస్థలతో పాటు, తీవ్రవాద సంస్థల నేతలు, కార్యకర్తల మీద కూడా పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకుందని పాక్ జాతీయ తీవ్రవాద నిరోధక సంస్థ(నాక్టా) అధికారులు తెలిపారు. కోట్ల రూపాయల విలువైన తీవ్రవాద సంస్థల నేతల ఆస్తులను కూడా జప్తు చేసినట్లు చెబుతున్నారు.
 
ఉగ్రవాదుల నిధుల సమీకరణను అడ్డుకోవడంలో పాకిస్తాన్ విఫలమైందన్న ఆరోపణలు రావడంతో, గత ఏడాది ఆగస్టులో ఆ దేశాన్ని ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చింది. అంతేకాదు, ఉగ్రవాద సంస్థలపై కఠినమైన, ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
మరి, పాకిస్తాన్ ఆ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిందా? తీవ్రవాద సంస్థలకు నిధుల మళ్లింపును అడ్డుకుందా? అందుకు ఎలాంటి చర్యలు చేపట్టింది? అన్న విషయాలను ఎఫ్‌ఏటీఎఫ్ నిపుణులు తేల్చాల్సి ఉంది. గ్రే లిస్టు నుంచి బయటపడేందుకు ఇతర దేశాల మద్దతు కావాలంటే, ముందు చట్టవ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థల అధిపతులపై చర్యలు తీసుకోవాలని అమెరికా కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి సూచించినట్లు అధికారులు తెలిపారు.
webdunia
నిషేధిత సంస్థల కార్యాలయాల పేర్లతో ఉన్న ఐదు వేలకు పైగా బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసినట్లు నాక్టా అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు. పంజాబ్‌లో ఎక్కువగా బ్యాంకు ఖాతాలు మూసివేశామని, ఆ ఖాతాలలో రూ. 20 కోట్లకు పైగా నగదు ఉందని చెప్పారు. తన వివరాలు వెల్లడించవద్దని ఆ అధికారి మమ్మల్ని కోరారు.
 
ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాల్లో ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్‌ జాబితాలో ఉన్న వ్యక్తుల పేర్లతో ఉన్నవే అధికంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం, నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి పేరును అయినా, ఆయా జిల్లాల ఇంటెలిజెన్స్ కమిటీ సిఫార్సు ఆధారంగా హోంశాఖ 4వ షెడ్యూల్‌లో చేర్చవచ్చు.
 
4వ షెడ్యూల్‌లో ఉన్న వ్యక్తి తాను నిబంధనలను ఉల్లంఘించబోనని సదరు జిల్లా అధికారులకు రాతపూర్వక హామీ పత్రం ఇవ్వాలి. ఆ తర్వాత అతడు నిబంధనలను ఉల్లంఘిస్తే, ఉగ్రవాద నిరోధక చట్టం కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. "ఉగ్రవాదులకు నగదు సరఫరాను అరికట్టడంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల అధికారులు కొంతవరకు సహాయపడ్డారు. కానీ, సరిహద్దు వెలుపల కార్యకలాపాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో దర్యాప్తు సంస్థలకు, ముఖ్యంగా ఉగ్రవాద నిరోధక విభాగాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి" అని నాక్టో అధికారి చెప్పారు.
webdunia
అలాంటి వ్యక్తులు వివిధ దేశాల్లోని వివిధ దళాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా, 'హుండీ' లేదా అనధికారిక బదిలీలు, హవాలా మార్గాల్లో పాకిస్తాన్‌లో ఉన్న తీవ్రవాద సంస్థలకు డబ్బును పంపుతారని ఆ అధికారి వివరించారు. నిఘా సంస్థల కళ్లుగప్పి అక్రమ మార్గంలో డబ్బు తీసుకునేందుకు పలు నిషేధిత సంస్థలు కొత్త ఎత్తులు వేస్తున్నాయని ఆయన అన్నారు.
 
"నిషేధిత సంస్థలతో సంబంధం లేని సామాన్య వ్యక్తుల ద్వారా ఆ డబ్బును సరిహద్దును దాటిస్తారు. ఎప్పుడూ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనని ఆ వ్యక్తి నుంచి నిషేధిత సంస్థల కార్యకర్తలు ఆ డబ్బును తీసుకుంటారు. ఆ డబ్బును నిషేధిత సంస్థ కార్యకలాపాలకు వినియోగిస్తారు" అని ఆ అధికారి తెలిపారు.
 
"నిఘా సంస్థలు కూడా నాక్టాకు సమాచారం అందిస్తున్నాయి. తీవ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న తరువాత కొన్ని నిషేధిత సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని నిఘా సంస్థలు చెప్పాయి. డబ్బులు అందే మార్గాలు మూసుకుపోవడంతో, ఆ నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కార్లను దొంగిలించడం, డబ్బులు డిమాండ్ చేసేందుకు కిడ్నాప్‌లకు పాల్పడటం వంటి పనులు చేశారు" అని ఆ అధికారి చెప్పారు.
 
పంజాబ్‌‌లోని జేయూడీ, ఫలా-ఇ-ఇన్సానియాట్ (ఎఫ్‌ఐహెచ్) సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వర్గాలు తెలిపాయి. ఆ రెండు సంస్థల ముఖ్య నాయకులతో సహా డజన్ల కొద్దీ మందిని అరెస్టు చేశారు. వారిపై నమోదైన కేసులపై వివిధ ఉగ్రవాద వ్యతిరేక కోర్టులలో విచారణ కొనసాగుతోందని తెలిసింది.
 
ఈ రెండు సంస్థలపై చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం, ఎఫ్‌ఏటీఎఫ్ సంస్థకు చెందిన ఆసియా పసిఫిక్ గ్రూప్ (ఏపీజీ)కి భారత్ నాయకత్వం వహించడం, పైగా ఆ రెండు నిషేధిత సంస్థలపై చర్యలు వేగవంతం చేయాలని ఏపీజీ డిమాండ్ చేసింది కూడా అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ రెండు నిషేధిత సంస్థలకు నేతృత్వం వహిస్తున్నది ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ అని భారత్ ఆరోపిస్తోంది.
 
ఆ రెండు సంస్థలతో పాటు, అరెస్టు అయిన వ్యక్తుల పేరుతో ఉన్న ఆస్తులను, నగదును అధికారులు జప్తు చేశారు. వారు వేర్వేరు వ్యక్తుల నుంచి డబ్బును సేకరించారు. ఆ ఆస్తుల విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. అక్రమ నగదు రవాణా నివారణ, హుండి కార్యకలాపాల కట్టడి కోసం వివిధ దేశాల్లో అమలులో ఉన్న చట్టాలను కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి నాక్టా సూచించిందని నాక్టా అధికారి తెలిపారు.
 
విదేశీ మారకం నిబంధనలను సవరించడానికి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఇటీవల ఒక బిల్లును ఆమోదించింది. మనీ లాండరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన బిల్లు అది. లష్కర్-ఎ-ఝాంగ్వీ (ఎల్‌ఈజే), దాని అనుబంధ సంస్థల మీద, వాటితో సంబంధం ఉన్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని పంజాబ్‌లోని ఉగ్రవాద నిరోధక విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించినట్లు నాక్టా అధికారి తెలిపారు.
 
అలాగే, జమాత్-ఉద్-దావా (జేయూడీ)తో పాటు, లష్కర్-ఏ-తొయిబా (ఎల్ఇటీ), హఫీజ్ సయీద్ అహ్మద్, మౌలానా మసూద్ అజార్ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. ఒక ప్రశ్నకు నాక్టా అధికారి సమాధానమిస్తూ... కొందరు తీవ్రవాద నాయకుల మీద, నిషేధిత సంస్థలకు చెందిన సీనియర్ నాయకుల మీద చర్యలు తీసుకోవడంలేదంటూ కొన్ని దేశాలు తమ మీద ఒత్తిడి తెస్తున్నాయని, దాంతో ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
 
వివిధ సంస్థలకు విదేశాల నుంచి వచ్చే విరాళాలను, స్వచ్ఛంద సంస్థల పేరుతో వచ్చే డబ్బును అడ్డుకోవడం చాలా కష్టమైన పని అని నాక్టా మాజీ అధిపతి ఖవాజా ఫరూక్ అన్నారు. స్వచ్ఛంద సంస్థల పేరిట డబ్బు పంపడాన్ని అడ్డుకోవడం ప్రభుత్వానికి చాలా కష్టమని ఆయన చెప్పారు.
 
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, వివిధ మతాల పేరిట నడిచే పాఠశాలలకు డబ్బు బదిలీని, ఆ డబ్బు వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. కానీ, ఆ తీవ్రవాద సంస్థలు, మతపరమైన పాఠశాలలకు స్థానిక ప్రజల నుంచి విరాళాలతో పాటు, వివిధ మార్గాల ద్వారా డబ్బు అందుతోందని ఆయన చెప్పారు.
 
తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే సంస్థలకు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఏ సంస్థకూ ప్రజలు విరాళాలు ఇవ్వవద్దు అంటూ గత ప్రభుత్వం టీవీలలో ప్రచారం నిర్వహించిందని ఖవాజా ఫరూక్ తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియాలో నడుస్తున్న ఈ ప్రచారానికి యూఎస్‌ ఎయిడ్ నిధులు సమకూర్చిందని, ఆ నిధులు అయిపోయిన తర్వాత ఈ ప్రచారం ఆగిపోయిందని ఆయన అన్నారు.
 
మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను నియంత్రించడంలో విఫలమైన తరువాత గత ఏడాది ఎఫ్‌ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో చేర్చింది. ఇప్పుడు దాని నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశానికి ముందు, తీవ్రవాద సంస్థలకు నిధులు నిలిపివేయడానికి పాకిస్తాన్ తీసుకున్న చర్యలను ఆసియా పసిఫిక్ గ్రూప్ (ఏపీజీ) సమీక్షించింది. ఆసియా పసిఫిక్ గ్రూప్ (ఏపీజీ), ఎఫ్ఏటీఎఫ్ అనుబంధ సంస్థ అని గుర్తించాలి. అంతేకాదు, ఏపీజీకి భారత్ నేతృత్వం వహిస్తోంది కూడా.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలోనే అందమైన మహిళ ఎవరో తెలుసా?