Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్‌బాస్ విజేత శివబాలాజీ: అధిక స్కూలు ఫీజులపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నటుడు.. ఏమిటీ వివాదం

Advertiesment
బిగ్‌బాస్ విజేత శివబాలాజీ: అధిక స్కూలు ఫీజులపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నటుడు.. ఏమిటీ వివాదం
, బుధవారం, 16 సెప్టెంబరు 2020 (19:34 IST)
బిగ్‌బాస్ మొదటి సీజన్ విజేత, సినీ నటుడు శివ బాలాజీ తన పిల్లలు చదువుతున్న హైదరాబాద్‌లోని ‘మౌంట్ లిటేరా జీ’ స్కూలుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేశారని ఆయన స్కూలు యాజమాన్యంపై ఆరోపణలు చేశారు. అయితే, క్లాసులు వినే అవకాశం లేకుండా బ్లాక్ చేయడానికి కారణం ఆయన స్కూలు ఫీజు చెల్లించకపోవడం కాదు.

 
స్కూలు ఫీజుల విషయంలో నిరసన తెలుపుతున్న తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపులో మద్దతు తెలుపుతున్నందుకు వారి పిల్లల ఐడి బ్లాక్ చేసినట్లు శివ బాలాజీ భార్య మధు ‘బీబీసీ న్యూస్ తెలుగు’కు చెప్పారు. ఈ సమస్య కేవలం శివ బాలాజీ కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న అనేక మంది పిల్లల తల్లితండ్రులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు

 
అసలు ఏం జరిగింది?
హైదరాబాద్‌లో ఉన్న కొన్ని కార్పొరేట్ స్కూలు యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, శివ బాలాజీ తమ పిల్లల తొలి టెర్మ్ స్కూలు ఫీజు చెల్లించేశారు.

 
కానీ, స్కూలు యాజమాన్యం తమకు అసలు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే, ఆగష్టు 25 నుంచి ఆన్ లైన్ తరగతులు బ్లాక్ చేసినట్లు మధు చెప్పారు. దాంతో వారి పిల్లలు పరీక్షలు రాయలేకపోయారని తెలిపారు. ఆగస్టులో ప్రీ మిడ్ టెర్మ్ పరీక్షలు ఏమిటని ప్రశ్నించారు.

 
“అమ్మా, మేమెందుకు ఆన్ లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నాం?” అని అడిగిన మా పిల్లల ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నాం” అని మధు చెప్పారు. కారణం తెలుసుకోవడానికి ఎన్నిసార్లు స్కూలు యాజమాన్యానికి ఫోన్ చేసినా సరైన సమాధానం దొరకకపోవడంతో తమ పిల్లలను ఆన్లైన్ తరగతుల నుంచి ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వమని ఈ-మెయిల్ పంపినట్లు ఆమె తెలిపారు.

 
"మీరు స్కూలుకి మద్దతు తెలపడానికి బదులు వాట్సాప్ గ్రూపులో నాయకులుగా వ్యవహరిస్తూ మిగిలిన తల్లిదండ్రుల ఆలోచనలను కూడా ప్రభావితం చేశారు" అని స్కూలు యాజమాన్యం బదులిచ్చిందని చెప్పారు. ఏం చేయాలో మాకు తెలుసని కూడా బెదిరింపు ధోరణిలో సమాధానమిచ్చారని చెప్పారు. మిగిలిన వారికి ప్రాతినిధ్యం వహించడం పట్ల స్కూలు యాజమాన్యం సానుకూలంగా స్పందించలేదని మధు చెప్పారు.

 
వాట్సాప్ గ్రూపు ఏమిటి?
స్కూలులో చదువుతున్నవిద్యార్థుల తల్లితండ్రులంతా కలిసి 240 మంది సభ్యులతో వారి సమస్యలు చర్చించుకునేందుకు ఒక వాట్సాప్ గ్రూపు తయారు చేసుకున్నారు. అందులో మధు ఒక సభ్యురాలు. స్కూలు ఫీజు అధికంగా వసూలు చేయడం పట్ల తల్లి తండ్రులంతా నిరసన చేయాలని అనుకున్నప్పుడు స్కూలు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపే బాధ్యత మధు తీసుకున్నట్లు తెలిపారు.

 
ఫీజు విషయంలో అందరి తరఫున వచ్చి మాట్లాడితే కుదరదని, ఏదైనా సమస్య ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడమని స్కూలు యాజమాన్యం చెప్పిందని చెప్పారు. ఆ తరువాత తమ పిల్లల ఐడీలను యాజమాన్యం బ్లాక్ చేసిందని చెప్పారు. ఇదంతా తనను, తన పిల్లలను బాగా కలచి వేసిందని చెప్పారు. కానీ, మాపై చర్యలు తీసుకోవడానికి స్కూలుకు అధికారాలు ఎందుకుంటాయని ఆమె ప్రశ్నించారు. ఇది తల్లితండ్రులను బెదిరించడం కాదా అని ప్రశ్నించారు.

 
“మేము ధైర్యం చేసి మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసాం”, మిగిలిన వారి పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ రోజు ఫిర్యాదు చేసిన తర్వాత సాంకేతిక కారణాల వలన ఆన్లైన్ తరగతులు ఇవ్వలేకపోతున్నామని స్కూలు యాజమాన్యం చెప్పినట్లు ఆమె చెప్పారు. ఆగష్టు 25 నుంచి సెప్టెంబరు 14 వరకు టెక్నికల్ సమస్యలుంటాయా అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలలో స్పష్టత ఉండాలని, కార్పొరేట్ స్కూళ్లు వ్యవహరిస్తున్న తీరుకి ఒక పరిష్కారం కావాలని ఆమె డిమాండ్ చేశారు.

 
ప్రభుత్వ జీవో ఏం చెబుతోంది?
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46ని అనుసరించి పాఠశాల యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు తప్ప మరే విధమైన ఇతర ఫీజులు తీసుకోరాదు. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం స్కూలు ఫీజును ప్రతి నెలా తీసుకోవాలని పేర్కొంది. కానీ, కొన్ని స్కూళ్లు మాత్రం మొత్తం మూడు నెలల ఫీజు ఒకేసారి కట్టమని డిమాండ్ చేస్తున్నాయి.

 
అయితే, కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజులోనే కంప్యూటర్ ల్యాబ్, అదనపు కార్యకలాపాలు, విద్యా పర్యటనలు, క్రీడలకు ఇచ్చే శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలకు అయ్యే ఖర్చును కూడా చేర్చాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆన్ లైన్‌లో పాఠాలకు స్కూళ్లు వసూలు చేసే ఫీజు తక్కువగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆన్‌లైన్‌లో ఉద్యమం చేస్తోంది.

 
అంతేకాకుండా స్కూలు యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేయడంపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా దాఖలు చేసినట్లు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ తెలిపారు. ఈ వ్యాజ్యం సెప్టెంబరు 18న హైకోర్టులో విచారణకు రానుంది.

 
స్కూలు యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేయడం పట్ల సమిత్ శేఖర్ అనే హైదరాబాద్ వైద్యుడు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఫీజు వాపసు తీసుకున్నట్లు తెలిపారు. సమిత్ శేఖర్ తన అయిదేళ్ల కొడుకుని గచ్చిబౌలిలో ఉన్న ఒక కార్పొరేట్ స్కూల్లో అప్పర్ కేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. కానీ, ఆ స్కూలు అడ్మిషన్ సమయంలో చెప్పిన నిబంధనలను ఉల్లఘించడంతో, ఆయన తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి అడ్మిషన్ రద్దు చేసుకున్నట్లు బీబీసీ న్యూస్ తెలుగుకి వివరించారు.

 
“స్కూలులో అడ్మిషన్ కోసం డిపాజిట్ ఫీజు కట్టి తర్వాత ప్రతి నెలా 25,000 రూపాయిల ఫీజు కట్టమన్నారు. మేము దానికి అంగీకరించాం. కానీ, ఒక నెల రోజులు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించిన తర్వాత మొదటి త్రైమాసికపు ఫీజు అంతా కట్టమని ఈ మెయిల్ పంపించారు. ట్యూషన్ ఫీ అనే పేరుతో బస్సు ఫీ, కెఫెటేరియా ఫీ అన్నీ అడుగుతున్నారు” అని ఆయన చెప్పారు.

 
ప్రభుత్వ జీవో గురించి ప్రశ్నించినప్పుడు స్కూలు యాజమాన్యం తమది ఇంటర్నేషనల్ స్కూలు అని అది తమకు వర్తించదని చెప్పినట్లు చెప్పారు. “మా స్కూల్ ధనవంతుల బిడ్డలకు మాత్రమే అని స్కూల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఆ మాటలు విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను” అని ఆయన అన్నారు.

 
టెర్మ్ ఫీజు కట్టకపోతే పిల్లల అడ్మిషన్ రద్దు చేస్తామని స్కూలు యాజమాన్యం చెప్పడంతో ఆయన వెంటనే రంగారెడ్డి జిల్లా విద్యా శాఖాధికారికి సమాచారం అందించినట్లు తెలిపారు. ఆమె స్కూల్‌కి షోకాజ్ నోటీసు అందించినప్పటికీ స్కూలు స్పందించలేదని చెప్పారు. దాంతో ఆయన హైకోర్టులో శాంటా మరియా ఇంటర్నేషనల్ స్కూల్, తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖకు, కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ఉద్దేశించి ఆగష్టు 24 న ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

 
“పిల్లల అడ్మిషన్ రద్దు చేసినందుకు గాను వారు చెల్లించిన 49,500 రూపాయిలు తిరిగి చెల్లించమని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు మళ్ళీ నేను మరో స్కూల్లో అడ్మిషన్ వెతుక్కోవాలి” అని ఆయన అన్నారు. “నేను ఆ డబ్బు కట్టగలిగే స్థితిలో ఉన్నాను. కానీ, స్కూలు నియమనిబంధనలు ఉల్లంఘిస్తే నేనెందుకు దానికి తలవంచాలి” అని ఆయన ప్రశ్నించారు.

 
డబ్బున్న వారికి మాత్రమే కార్పొరేట్ చదువులా? ఎవరైనా సాధారణ మధ్య తరగతి వారు అలాంటి స్కూల్లో తమ పిల్లలను చదివించాలనుకుంటే అది సాధ్యం కాని పనేనా?" అన్నారాయన. ఇలా వ్యవహరిస్తున్న పాఠశాలలు విద్యా రంగంలో కేవలం 15 శాతం మాత్రమేనని హైదరాబాద్‌కి చెందిన కెనడీ విద్యా సంస్థ కార్యదర్శి సూరి మూర్తి అన్నారు.

 
మిగిలిన 80 నుంచి 85 శాతం పాఠశాలలు బడ్జెట్ స్కూళ్ల కేటగిరిలోకే వస్తాయని ఇప్పుడు ఈ పాఠశాలలు ఎక్కువగా ఇబ్బందులలో ఉన్నాయని అన్నారు. కొన్ని స్కూళ్లు లంచ్ ఫీజు వంటివి ట్యూషన్ ఫీజులో కలపడం వలన తల్లిదండ్రులు ఆగ్రహిస్తున్నారనే విషయాన్ని అంగీకరిస్తూ, కోవిడ్ తర్వాత ఆర్థిక భారం భరించలేక రెండు రాష్ట్రాలలో కనీసం 1000 స్కూళ్లు మూతపడి ఉంటాయని అన్నారు. వీరి కోసం ఎవరూ ఆలోచించడం లేదన్నారు.

 
పాఠశాల యాజమాన్యాలు టీచర్లకు జీతాలు ఇస్తేనే ఆన్ లైన్ క్లాసులైనా నిర్వహించగలరని చెబుతూ కొంతమంది టీచర్లు బోధన వృత్తిని వదిలేసి వేరే పనులకు మారుతున్న ఉదాహరణలు చెప్పారు. తాము ప్రభుత్వ నిబంధనలకనుగుణంగానే నడుచుకుంటున్నామని.. పిల్లలకు చదువు చెప్పాలంటే టీచర్లకు కూడా జీతాలు ఇవ్వాలని, ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లకు ఏమి మద్దతివ్వడం లేదని సన్ ఫ్లవర్ వేదిక్ స్కూల్ ప్రతినిధి ఉష చెప్పారు.

 
కోవిడ్ శానిటైజేషన్ కోసం అధిక ఫీజులను వసూలు చేస్తున్నారా?
ఫీజు రసీదులో కోవిడ్ శానిటైజేషన్ చర్యల నిమిత్తం ఫీజును వసూలు చేస్తున్నట్లు ఎక్కడా తెలపటం లేదు. కానీ, కోవిడ్ వలన స్కూల్లో నిర్వహణ వ్యయం పెరుగుతుందని ఓక్రిడ్జ్ స్కూల్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేటర్ కార్తీక్ బీబీసీ న్యూస్ తెలుగుతో అన్నారు.

 
"ఇప్పుడు స్కూళ్లు తెరవాలంటే శానిటైజేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి, స్కూలు భవనాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, లేదంటే తల్లి తండ్రులు పిల్లలను స్కూల్‌కి పంపరు. తరగతి గదులు, స్కూలు పరిసరాలు డిస్ఇన్ఫెక్ట్ చేయడానికే చాలా ఖర్చు అవుతుంది" అని ఆయన అన్నారు. “ఏటా తీసుకునే నిర్వహణ ఫీజుని మాత్రమే తీసుకుంటున్నాం కానీ, అదనంగా ఏమి తల్లితండ్రుల నుంచి వసూలు చేయడం లేదు. ఇది కూడా తల్లిదండ్రులు అర్ధం చేసుకోవాలి” అని ఆయన అన్నారు.

 
హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఏమి చెబుతోంది?
హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో పాటు తల్లితండ్రులంతా కలిసి సెప్టెంబరు 14 నుంచి 17 వరకు జీఓ 46 ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ప్రాజెక్ట్ పంఖ్ అనే పేరుతో ఉద్యమం నిర్వహిస్తున్నట్లు వెంకట రెడ్డి తెలిపారు. అధికారులను సంప్రదించడానికి భయపడుతున్న తల్లితండ్రులకు ప్రాతినిధ్యం వహిస్తూ వారి తరఫున అధికారుల దగ్గరకు సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

 
ఇందులో భాగంగా శనివారం ట్విటర్‌లో విద్యా శాఖను, తెలంగాణ ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ స్కూలు ఫీజుల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. సోమవారం డీఈఓ ఆఫీసు పక్కన రెండు బాక్సులు పెట్టి ఒక బాక్సులో తల్లి తండ్రులు రాసిన ఉత్తరాలు, మరో బాక్సులో గులాబీ పూలు వేసి తమ నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఆ ఫిర్యాదు లేఖలను విద్యా శాఖ అధికారులకు అందచేసినట్లు చెప్పారు.

 
స్కూళ్లు ఫీజు వసూలు చేసే విధానంలో ఒక శాస్త్రీయ విధానంపై ఆధారపడాలన్నారాయన. పాఠశాల కార్య నిర్వాహక కమిటీలలో తల్లితండ్రులకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి. పాఠశాలల కార్య నిర్వాహక కమిటీలలో విద్యార్థుల తల్లి తండ్రులకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని, అప్పుడే సమస్యలు కొంతవరకు పరిష్కారమవుతాయని, విద్యావేత్త రమేష్ పట్నాయక్ అంటారు.

 
“ప్రైవేటు స్కూళ్లను ఎలా నిర్వహించాలనే అంశం పై 1994లో విడుదల చేసిన జీఓనే రెండు రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. ఈ జీఓని అనుసరించి పిల్లల తల్లిదండ్రులకు కూడా మేనేజ్‌మెంట్ కమిటీలో స్థానం ఉండాలి. ఐతే, అన్ని స్కూళ్లలో తల్లి తండ్రులకు తగినంత ప్రాతినిధ్యం లభించటం లేదు. దాంతో స్కూలు యాజమాన్యాలు ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం, లేదా కొంత మంది ప్రయోజనాల కోసమే పని చేస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

 
ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం కొత్త జీవో తెచ్చి పాఠశాల కమిటీలో కనీసం 50 శాతం తల్లిదండ్రులకు ప్రాతినిధ్యం ఇవ్వాలని రమేష్ పట్నాయక్ సూచించారు. అప్పుడే పాఠశాల యాజమాన్యాలు తీసుకునే నిర్ణయాల్లో తల్లి తండ్రులు జోక్యం చేసుకోగలరని ఆయన అన్నారు.

 
‘ఫీజులు తగ్గించడం’
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం స్కూలు ఫీజులు తగ్గించబోమని మౌంట్ లిటేరా జీ స్కూలు ప్రిన్సిపాల్ ఇందిర ఒక టెలివిజన్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. పిల్లలను ఎందుకు ఆన్ లైన్ తరగతులకు హాజరు కానివ్వలేదు అనే ప్రశ్నకు సాంకేతిక కారణాల వల్ల అలా జరిగిందని సమాధానం చెప్పారు. స్కూలు యాజమాన్యాన్ని ‘బీబీసీ’ సంప్రదించినపుడు పిల్లలను ఎవరినీ బ్లాక్ చేయలేదని మళ్లీ ఫోన్ చేసి పూర్తి వివరాలు చెప్తామని అన్నారు. ఈ వార్త రాసే సమయానికి స్కూలు యాజమాన్యం నుంచి తిరిగి స్పందన రాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ సోకి తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ కన్నుమూత