Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌: కొత్త పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏమిటీ ఓపీఎస్, జీపీఎస్?

ys jagan
, గురువారం, 8 సెప్టెంబరు 2022 (14:04 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛను విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్యారంటీడ్ పెన్షన్ విధానం(జీపీఎస్) పేరుతో దీనిని అమలు చేస్తామని చెబుతోంది. అయితే ఉద్యోగులు మాత్రం తమకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించే వరకూ ఉద్యమిస్తామని చెబుతున్నారు. ఇంతకీ ఓపీఎస్ ఏమిటీ, సీపీఎస్ ఎందుకొచ్చింది? కొత్తగా జీపీఎస్‌లో ఏముంటుందనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల ఆందోళనకు కారణాలు ఏమిటి, ప్రభుత్వం ఏం చెబుతోందన్నది చర్చనీయాంశాలుగా మారాయి.

 
వివాదం ఏమిటి?
దేశంలోని అత్యధిక రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా 2004 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ అమలు చేస్తున్నారు. అంతకుముందు నుంచి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి ఓపీఎస్ అమలవుతోంది. తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా రాష్ట్రంలో సీపీఎస్ రద్దు చేస్తామంటూ ప్రతిపక్షంలో ఉండగా వైఎస్సార్సీపీ పలుమార్లు ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ అనేక సభల్లో ఈ హామీ ఇచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ప్రకటించారు. కానీ మూడున్నరేళ్లు గడుస్తున్నా సీపీఎస్ రద్దు చేయకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీస్తోంది. అదే సమయంలో దేశంలోని రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసేందుకు అంగీకరించాయి.

 
తాజాగా జార్ఖండ్ ప్రభుత్వం కూడా సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పాత విధానం పునరుద్ధరిస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు సాధ్యం కాదనే ప్రశ్న ఉదయిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కొత్తగా జీపీఎస్ ప్రవేశపెడుతున్నామని, సీపీఎస్ రద్దు చేసే అవకాశం లేదని తేల్చేసింది. ఉద్యోగ సంఘాల నాయకులతో గడిచిన కొంత కాలంగా వివిధ దఫాలుగా జరిగిన చర్చల్లో ప్రభుత్వం తమ వైఖరి వెల్లడించింది. జీపీఎస్‌కు మాత్రమే అనుకూలమని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే అవకాశం లేదని ప్రకటించింది.

 
సీపీఎస్‌ అంటే ఏమిటి?
2003లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం-సీపీఎస్‌ తీసుకొచ్చింది. దీన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్‌పీఎస్‌ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత త్రిపుర, పశ్చిమ బెంగాల్ మినహా ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు ఈ స్కీమ్‌లో చేరాయి. ఈ పింఛను స్కీమ్ ప్రకారం 2004, జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారందరూ సీపీఎస్‌ కిందికి వస్తారు. అప్పటి వరకు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వమే ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చేది.

 
కానీ కొత్త స్కీమ్ ప్రకారం పింఛను కోసం ప్రతీనెలా ఉద్యోగి జీతం నుంచి 10 శాతం కట్ చేస్తారు. ప్రభుత్వం మరో 10 శాతం నిధులు ఇస్తుంది. ఈ పెన్షన్‌ నిధిని నేషనల్‌ పెన్షన్‌ స్కీం-ఎన్‌పీఎస్‌ ట్రస్టు, నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌-ఎన్‌ఎస్‌డీఎల్‌ ద్వారా షేర్‌ మార్కెట్‌లో మదుపు చేస్తారు. పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో యాన్యుటీ ప్లాన్‌లలో ఉంచి నెలవారీ పింఛను చెల్లిస్తారు. దీని కోసం 2013లో యూపీఏ ప్రభుత్వం, విపక్ష ఎన్డీఏ మద్దతుతో 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్‌' -పీఎఫ్‌ఆర్‌డీఏ తెచ్చింది.

 
ఓపీఎస్‌నే ఎందుకు కోరుతున్నారు?
2004 నుంచి వివిధ శాఖల్లో చేరిన ఉద్యోగులతో పాటుగా ఉపాధ్యాయులు కలిపి దాదాపుగా 3లక్షల మంది ఏపీకి చెందిన వారు ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో ఉన్నారు. వారికి పింఛనును గతంలో మాదిరిగా ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా, వేతనంలో నెలకు 10 శాతం చొప్పున మినహాయించిన దానిని నుంచి చెల్లించడం వల్ల పింఛను గ్యారంటీ లేదన్నది ప్రధాన ఆందోళన. పాత పెన్షన్ విధానంలో జీతంలో కోత లేదు. కానీ సీపీఎస్‌లో ప్రస్తుతం 10 శాతం కోత అమలవుతోంది. ఇది మరింత పెంచే యోచనలో ఉన్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రాసిన లేఖల్లో ప్రస్తావించింది.

 
గతంలో ఉద్యోగి పదవీ విరమణ నాటి వేతనాలను అనుసరించి లభించే పెన్షన్‌కు బదులుగా ఇప్పుడు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నుంచి మాత్రమే పెన్షన్ చెల్లించే విధానం మూలంగా హఠాత్తుగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తగిన భద్రత లేదన్నది పలువురు ఉద్యోగుల ఆవేదన. పాత విధానంలో పింఛను ముందుగానే సరెండర్ చేయవచ్చు. దీన్నే కమ్యూటేషన్ అంటారు. సీపీఎస్‌లో ఆ సౌకర్యం లేదు. అంతేగాకుండా గ్రాట్యూటీ వంటి సదుపాయాలు కూడా ఉండేవి కాదు. ఇటీవల సీపీఎస్ ఉద్యోగుల ఆందోళన కారణంగా కొంతకాలంగా గ్రాట్యూటీ అమలు చేసేందుకు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే అంగీకరించారు.
పెన్షన్ గ్యారంటీ ఉండాలంటే ఓపీఎస్ అమలు కావాల్సిందేనన్నది ఉద్యోగ సంఘాల వాదన.

 
ప్రభుత్వ కొత్త విధానం ఏమిటీ
సీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కొన్నేళ్లుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆందోళనల మూలంగా మళ్లీ పాత విధానం మనుగడలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుకావడంతో అన్ని చోట్లా ఓపీఎస్ సాధించగలమనే నమ్మకం కలుగుతోందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం కొత్తగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను తీసుకొస్తున్నట్టు స్పష్టం చేస్తోంది. తాజాగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మునిసిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ వంటి వారితో కూడా మంత్రి వర్గ ఉప సంఘం కూడా చర్చల సందర్భంగా తమ వైఖరిని సంఘాల ప్రతినిధులకు వెల్లడించారు.

 
ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్(ఏపీ జీపీఎస్)గా చెబుతున్న ఈ కొత్త విధానం ప్రకారం ఉద్యోగులందరికీ పెన్షన్ గ్యారంటీగా లభిస్తుందన్నది ప్రభుత్వ వాదన. "ఉద్యోగులు పెన్షన్ గ్యారంటీ లేదనే ఆందోళనతో ఉన్నారు. దానికి ప్రభుత్వం జీపీఎస్‌లో గ్యారంటీ కల్పిస్తోంది. సర్వీసును బట్టి ప్రతీ ఉద్యోగికి పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటంది. వేతనంలో బేసిక్ మీద 33% పెన్షన్‌గా వస్తుంది. ప్రస్తుతం సీపీఎస్‌లో 20% వరకూ మాత్రమే లభించే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి అదనపు భారం అవుతుంది. రాబోయే ఐదేళ్లలో రిటైర్ అవుతున్న వారి ఫించన్లు కోసమే రూ.50వేల కోట్ల వరకూ భారం పడుతుంది. అయినా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం"అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన బీబీసీతో అన్నారు.

 
మాట తప్పకూడదని అంటున్న ఉద్యోగ సంఘాలు
ఏపీ ప్రభుత్వం జీపీఎస్ తప్ప మరో ప్రతిపాదన తమ వద్ద లేదని చెబుతున్న తరుణంలో తాజాగా ఉద్యోగ సంఘాలతో చర్చలకు పలు సంఘాల ప్రతినిధులు దూరమయ్యారు. సీపీఎస్ రద్దు మినహా మరో ప్రతిపాదనను తాము అంగీకరించేది లేదని ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రవికుమార్ అన్నారు. "గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలు చేసింది. అప్పుడు వ్యతిరేకించాము. ప్రతిపక్షంలో ఉండగా జగన్ హామీ ఇస్తే అందరమూ నమ్మాం. కానీ ఇప్పుడు అనేక కారణాలు చూపించి మాట తప్పడం తగదు. ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చిన హామీను విస్మరించి కొత్త పెన్షన్ విధానం అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేం అంగీకరించడం లేదు. అందుకే సమావేశాలకు దూరంగా ఉన్నాం. మా ఉద్యమం కొనసాగుతోంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేస్తున్న సమయంలో కూడా జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విచారకరం" ఆయన వ్యాఖ్యానించారు.

 
సీపీఎస్ రద్దు కోరుతూ ఇటీవల సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకున్నప్పటికీ త్వరలో కార్యాచరణ ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకావల్సిందేనని ఆయన బీబీసీతో అన్నారు. సీపీఎస్ రద్దు కోరుతున్న వారి పట్ల ఇటీవల ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబించిందంటూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈనెల 16న ఆందోళనకు సన్నద్ధమవుతున్నట్టు చెబుతున్నాయి.

 
బాధ్యత ప్రభుత్వానిదే..
ఉద్యోగులకు సీపీఎస్ విధానంలో అన్యాయం జరుగుతోందని ప్రతిపక్ష నేతగా అంగీకరించిన జగన్‌.. ఇప్పుడు తన మాటకు కట్టుబడితే సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర రావు అన్నారు. "పాత పెన్షన్ విధానం నేటికీ కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. కొత్తగా సీపీఎస్ రద్దు చేసి మరికొన్ని రాష్ట్రాలు ఓపీఎస్‌కు మళ్లుతున్నాయి. అలాంటప్పుడు ఏపీలో మాత్రం సీపీఎస్ రద్దు చేయలేమని ప్రభుత్వం చెప్పడం భావ్యం కాదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను నొప్పించకూడదనే లక్ష్యంతో ఉద్యోగులకు ఇచ్చిన హామీని విస్మరించడమే సమస్య. అదే ఉద్యోగుల ఆందోళనకు కారణమవుతోంది. పోలీసుల సహాయంతో ఉద్యోగ, ఉపాధ్యాయులను అడ్డుకోవాలని చూడడం మాని, సీపీఎస్ రద్దు చేస్తే ఏ సమస్యా ఉండదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆర్థికంగా భారం అవుతుందనే విషయంలో కూడా ప్రభుత్వం వాస్తవాలు దాస్తోంది. పెరుగుతున్న బడ్జెట్లో ఫించన్ల కోసం వెచ్చించే మొత్తం ఎంత శాతం, అందులో ప్రజా ప్రతినిధులకు ఇస్తున్నదెంత అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలని" ఆయన సూచించారు.

 
సీపీఎస్ రద్దు కోసం చేస్తున్న ఉద్యమానికి అన్ని ఉద్యోగ సంఘాలు అండగా ఉన్నాయని, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని ఆయన బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు. ఏపీలో సీపీఎస్ రద్దు కావాలని ఉద్యోగులు ఆశిస్తుంటే, జీపీఎస్ తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పంచాయతీ మరింత ముదిరేలా కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌత్ వియత్నాంలో అగ్నిప్రమాదం - 32 మంది మృతి