Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతిపై మీ వైఖరేంటి, హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడం లేదు - ప్రెస్‌రివ్యూ

Advertiesment
ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతిపై మీ వైఖరేంటి, హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడం లేదు - ప్రెస్‌రివ్యూ
, శుక్రవారం, 25 అక్టోబరు 2019 (11:21 IST)
రాజధాని నిర్మాణం, స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని, వాటిపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం సరికాదని అభిప్రాయపడిందని ఈనాడు తెలిపింది.
 
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రుల ఎజెండాలతో తమకు పని లేదని, చట్టంతో మాత్రమే తమకు సంబంధమని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబులింగ్‌ (ఏపీఐడీఈ) చట్టం-2001కి సవరణ చేస్తూ 2017 ఏప్రిల్‌ 19న ఏపీ న్యాయశాఖ కార్యదర్శి తీసుకొచ్చిన సవరణ చట్టం-3/2017ను సవాలు చేస్తూ 'ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ సొసైటీ' సభ్యులు వై.సూర్యనారాయణమూర్తి, రాజధాని అమరావతి స్టార్టప్‌ ప్రాంతం అభివృద్ధి కోసం ఏపీ సర్కారు అనుసరిస్తున్న స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
 
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కాసా జగన్‌మోహన్‌ రెడ్డి స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాలు 'స్విస్‌ ఛాలెంజ్‌' విధానాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసినవని, రాజధాని నిర్మాణానికి సంబంధించినవి కావని తెలిపారు. అందుకు ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఈ వ్యాజ్యాల్ని రాజధాని నిర్మాణ విషయానికి విస్తరిస్తామని స్పష్టం చేసింది.
 
హైకోర్టు వద్ద కప్పు టీ కూడా దొరకడం లేదని ఆక్షేపించింది. పలు సమస్యలున్నాయని, వాటిని తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పేర్కొంది. 2 వారాల్లో ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. మరోసారి గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
 
న్యాయ పరిపాలన, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన మధ్యంతర ఉత్తర్వులిస్తామని పేర్కొంది. ఆ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ కాంట్రాక్టు పనుల్ని ప్రభుత్వం పునఃసమీక్షిస్తోందని ఎస్‌జీపీ చెప్పగా.. అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. 'ఎన్ని రోజులు సమీక్షిస్తారు? ఏమి చేయాలనుకుంటున్నారో త్వరగా నిర్ణయం తీసుకోండి' అని స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ నియామకం