Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌: సోషల్ మీడియా పోస్టుల గొడవ సీబీఐ దర్యాప్తు దాకా ఎలా వెళ్లింది?

ఆంధ్రప్రదేశ్‌: సోషల్ మీడియా పోస్టుల గొడవ సీబీఐ దర్యాప్తు దాకా ఎలా వెళ్లింది?
, గురువారం, 19 నవంబరు 2020 (15:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మధ్య పదే పదే హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా అభ్యంతకర పోస్టులు చేశారంటూ తొలుత సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన కేసులు ఇప్పుడు సీబీఐకి చేరాయి. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ విశాఖపట్నం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

 
ఎనిమిది వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో దానికి అనుగుణంగా నివేదిక అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ పరిణామాలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ట్రోలింగ్‌లు వివాదాస్పదమవుతున్నాయి. వీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో కొందరు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొన్ని కేసుల్లో నిందితుల అరెస్టులు కూడా జరిగాయి. చాలా కేసుల్లో విచారణ సాగుతోంది.

 
ఇదే సమయంలో హైకోర్టు జడ్జిలకు ఉద్దేశాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేశారంటూ ఏకంగా రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేయడం చర్చనీయమైంది. సోషల్ మీడియా ట్రోలింగ్ బాధితుల కేసులు విచారించే న్యాయమూర్తులే ఇప్పుడు బాధితులుగా పేర్కొంటూ కేసు నమోదు కావడం కలకలం రేపింది.

 
సోషల్ మీడియాలో హద్దులు మీరితే..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం పౌరులందరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ, అభిప్రాయాలను వెల్లడించడానికి ఉన్న ఈ అవకాశానికి పరిధులు, పరిమితులు కూడా ఉన్నాయి. భావ ప్రకటన పేరుతో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగంగా అనేక అంశాలను ప్రస్తావించడానికి అవకాశం లేదు. ముఖ్యంగా ఎదుటి వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో ప్రవర్తన, భాష, రాత, వ్యాఖ్య ఉండకూడదు. కానీ, సోషల్ మీడియాలో కొందరు ఈ హద్దులు మీరుతూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

 
ఈ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా అభ్యంతకర రీతిలో ఏదైనా సమాచారం ప్రచురించినా, ప్రసారం చేసినా శిక్షార్హులవుతారు. తొలిసారి నేరం చేస్తే నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఐదు లక్షల రూపాయల వరకూ జరిమానా వేస్తారు. నేరం పునరావృతం అయితే ఐదేళ్ల కారాగార శిక్షతో పాటుగా రూ. 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

 
పెరిగిన ఐటీ యాక్ట్ కేసులు
వివిధ సైబర్ నేరాలతో పాటుగా సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టుల విషయమై పెడుతున్న కేసులు కూడా ఇటీవల పెరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిపై, పలువురు మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలకుగానూ వివిధ కేసుల్లో అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2019లో సోషల్ మీడియా పోస్టులపై అరెస్టైన వారి సంఖ్య 130కి పైగా ఉందని ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఈ తరహాలో నమోదైన కొన్ని కేసులు, అరెస్టులు వివాదాలకు దారితీశాయి.
 
సోషల్ మీడియా పోస్టులపై తాము ఇచ్చిన ఫిర్యాదులను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదని గతంలో టీడీపీ, జనసేన నేతలు ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై పోలీసులు ఇంతవరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆమె అన్నారు. ఓవైపు కేసులు, అరెస్టులు పెరుగుతున్నా.. కొందరు వెనకడుగు వేయకుండా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతూనే ఉన్నారు.
 
కోర్టు ధిక్కరణ కూడా..
న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసులో సైబర్ క్రైంతోపాటు ఇతర కోణాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఐటీ యాక్ట్‌తో పాటుగా కోర్టు ధిక్కరణ సెక్షన్ కూడా ఈ కేసుకు వర్తిస్తుందని అఖిల భారత న్యాయవాదుల సంఘం జాతీయ నాయకుడు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
 
"వాస్తవానికి ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేయాల్సినంత పెద్దది కాదు. ఏపీలోని ప్రత్యేక పరిస్థితుల మూలంగా సీబీఐ వరకూ వెళ్లినట్టుగా మనం భావించాలి. తొలుత సీఐడీకి అప్పగించారు. కానీ ఆశించిన స్థాయిలో వ్యవహరించలేదని కోర్టు భావించింది. ముఖ్యంగా కేసు దర్యాప్తు సజావుగా సాగకపోవడం, కేసులో నిందితుల విషయంలో కూడా సమగ్రంగా వ్యవహరించకపోవడమే దీనికి కారణం. పాలకపక్షానికి చెందిన వారిపై చేసిన పోస్టులపై పోలీసులు వేగంగా కదులుతున్నారు. కేసులు పెట్టి, అరెస్టులు కూడా చేస్తున్నారు. కానీ హైకోర్టు, న్యాయమూర్తుల వరకూ వచ్చిన కేసులో అలాంటి పరిస్థితి కనిపించలేదు. దాంతో రిట్ పిటిషన్ వేసి ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది. సైబర్ క్రైం, కోర్టు ధిక్కరణ, ఐపీసీ సెక్షన్లు కూడా వర్తించే కేసు ఇది. కాబట్టి దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలుండవచ్చు" అని ఆయన అన్నారు.
 
సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఏముంది?
ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలుత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఏపీ సీఐడీ, అమరావతిలో క్రైమ్ నెం. 16 20202 పేరుతో ఏప్రిల్ 16న తొలి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దశల వారీగా కొద్ది రోజుల్లోనే మొత్తం 8 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు. ఇక సైబర్ క్రైం, సీఐడీ పేరుతో మరో నాలుగు కేసులు మే నెలలో నమోదయ్యాయి.
 
మొత్తం 12 కేసులను విచారణ నిమిత్తం హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 9న సీబీఐ స్వీకరించింది. దానికి అనుగుణంగా అవే సెక్షన్లు ఐపీసీ 153(ఏ), 504,505(2),506తో పాటుగా ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 ప్రకారం సీబీఐ విశాఖ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నెం. RC03620202S0015ని ఈ నెల 11న నమోదు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ ఈ కేసుకు విచారణ అధికారిగా ఉన్నారు.
 
ఉద్దేశపూర్వకంగా, శత్రుత్వంతో, ద్వేషపూరితంగా, బెదిరించడం కోసం ఎలక్ట్రానిక్ సాధనాలను ఉపయోగించి అభ్యంతకర రీతిలో నిందితులు వ్యవహరించినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 16 మంది నిందితులతో పాటుగా గుర్తు తెలియని 17వ నిందితుడిపై ఈ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల్లో కొందరు విదేశాల్లో ఉంటున్నవారు కూడా ఉన్నారు.
 
‘బాధ్యతగా ఉండాలి’
‘‘బహిరంగంగా వ్యవహరించినప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం. మన వ్యవహారాలు రికార్డవుతున్నప్పుడు మనం మరింత బాధ్యతగా ఉండాలి. ఏపీ హైకోర్టు ఈ విషయాన్ని కోర్టు ధిక్కరణగా కూడా పరిగణిస్తోంది. ఇలాంటి అంశాలను నేరుగా కోర్టు పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాని మీద చట్టానికి అనుగుణంగా చర్యలుంటాయి. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఎఫ్ఐఆర్‌లో ఉన్న వారిని విచారించే అవకాశం ఉంటుంది" అని న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్ బీబీసీతో అన్నారు.
 
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు చేసిన వ్యాఖ్యలను కూడా.. తొలుత ఈ కేసు విచారణ సమయంలో రిజిస్ట్రార్ జనరల్ అనుబంధ పిటిషన్‌లో అందించారు. అయితే ప్రాథమిక నివేదికలో వారి పేర్లను సీబీఐ ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఎలా సాగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. కేసులో దర్యాప్తు ప్రారంభించామని, వివరాలు కోర్టుకు మాత్రమే తెలియజేయాల్సి ఉంటుందని విచారణాధికారి, సీబీఐ డీఎస్పీ శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - చైనా ఉద్రిక్తతలు: చైనా మైక్రోవేవ్‌ ఆయుధాలను ఉపయోగించిందా? అసలీ మైక్రోవేవ్ ఆయుధాలేమిటి?