Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనీ లాండరింగ్‌పై పుస్తకం రాసిన అమెరికా ప్రొఫెసర్ అదే కేసులో అరెస్టు

Advertiesment
మనీ లాండరింగ్‌పై పుస్తకం రాసిన అమెరికా ప్రొఫెసర్ అదే కేసులో అరెస్టు
, గురువారం, 21 నవంబరు 2019 (13:54 IST)
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మనీ లాండరింగ్‌, వ్యవస్థీకృత నేరాలు, హింసపై పుస్తకం రాసిన అమెరికా ప్రొఫెసర్‌ ఒకరు మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. లాటిన్ అమెరికాలోని వెనెజ్వేలా నుంచి సుమారు 25 లక్షల డాలర్లు మనీ లాండరింగ్ చేశారంటూ ప్రొఫెసర్ బ్రూస్ బాగ్లేపై అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లలోని బ్యాంకు ఖాతాల నుంచి ఈ సొమ్ము అందుకున్నారని, ఇది తన దగ్గరే పెట్టుకున్నారని వారు పేర్కొన్నారు.

 
'డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ వయలెన్స్ ఇన్ ది అమెరికాస్' పేరుతో ప్రొఫెసర్ బాగ్లే నాలుగేళ్ల క్రితం సహరచయితగా పుస్తకం వెలువరించారు. 'మనీ లాండరింగ్' లావాదేవీలు బాగా పెరుగుతున్నాయని ఆయన పుస్తకంలో రాశారు. బాగ్లే అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామి విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 'సీబీఎస్ న్యూస్'తో మాట్లాడుతూ- మనీ ల్యాండరింగ్ అభియోగాలను ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని, తప్పంతా అధికారులదేనని చెప్పారు.

 
'సంక్లిష్టమైన ప్రక్రియ'
న్యూయార్క్‌లోని అధికారుల కథనం ప్రకారం- తాను, తన భార్య ఆఫీసర్లు, డైరెక్టర్లుగా ఒక కంపెనీని బాగ్లే నమోదు చేయించారు. ఆ కంపెనీకి ఫ్లోరిడాలోని ఒక బ్యాంకులో ఖాతా తెరిచారు. 2017 నవంబరులో ఈ ఖాతాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేంద్రంగా పనిచేసే ఒక ఆహార సంస్థ నుంచి నిధులు రావడం మొదలైంది. ఈ సంస్థ ఒక కొలంబియా వ్యక్తి నియంత్రణలో ఉంటుంది.

 
ఆ వ్యక్తి వివరాలు, ఆ నిధులు వెనెజ్వేలా నుంచి ఎలా వచ్చాయనేది వెల్లడి కాలేదు. మనీ లాండరింగ్ రూపంలో డబ్బు తరలింపును గుర్తించడం చాలా సంక్లిష్టమైన పని అని బాగ్లే తమ పుస్తకంలో రాశారు. బాగ్లేకు వచ్చిన నిధులు వెనెజ్వేలాలో ఒక ‘అవినీతి పథకానికి’ సంబంధించిన సొమ్ము అని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.

 
వెనెజ్వేలాలో ఉన్నత స్థాయుల్లో అవినీతి ద్వారా పోగేసిన సొమ్ము తరలింపునకు అమెరికా ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించడాన్ని అడ్డుకొనేందుకు అమెరికా అధికార యంత్రాంగం పెద్దయెత్తున చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బాగ్లేపై కేసు నమోదైంది. వెనెజ్వేలాలో తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ పతనం వల్ల లక్షల మంది ప్రజలు ఇతర దేశాలకు వలస పోతున్నారు.

 
నిపుణుడిగా సాక్ష్యం చెప్పిన బాగ్లే
మనీ లాండరింగ్‌కు కుట్ర పన్నారనే ఒక అభియోగం, మనీ లాండరింగ్‌కు పాల్పడటం అనే రెండు అభియోగాలు బాగ్లేపై నమోదయ్యాయి. దోషిగా తేలితే ఒక్కో అభియోగానికి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అరెస్టు తర్వాత బాగ్లేను అధికారులు మయామి ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. మూడు లక్షల డాలర్ల పూచీకత్తు మీద ఆయన బెయిలుపై విడుదలయ్యారు. బాగ్లే గతంలో కోర్టు కేసుల్లో నిపుణుడైన సాక్షిగా ఆధారాలు సమర్పించారు. అమెరికా సెనేట్ కమిటీల ఎదుట హాజరై సాక్ష్యం కూడా చెప్పారు.

 
బాగ్లే తాజా కేసులపై అమెరికా దర్యాప్తు సంస్థ 'ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)' అసిస్టెంట్ డైరెక్టర్-ఇన్‌చార్జ్ విలియం ఎఫ్‌.స్వీనీ జూనియర్ మాట్లాడుతూ- తమ నేరాలతో వచ్చిన డబ్బును తరలించడానికి నేరస్థులు అనేక పద్ధతులు అనుసరిస్తారని చెప్పారు. నేరస్థులు వెనెజ్వేలా ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అక్రమంగా సంపాదించిన డబ్బును ఇతర దేశాలకు విజయవంతంగా తరలించడంలో ప్రొఫెసర్ బాగ్లే తోడ్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాగ్లే లబ్ధి పొందారని చెప్పారు.

 
బాగ్లే తరపు న్యాయవాది డేనియల్ ఫోర్మన్ 'మయామి హెరాల్డ్' పత్రికతో మాట్లాడుతూ- తమ కక్షిదారుకు మద్దతుగా కేసును బలంగా వాదిస్తానని చెప్పారు. బాగ్లే సెలవులో ఉన్నారని, అభియోగాల నమోదు ఆయన వ్యక్తిగత అంశమని మయామీ విశ్వవిద్యాలయం వ్యాఖ్యానించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్తాన్‌లో ప్రశాంత్, హైదరాబాద్‌లో ఇక్రమ్ - ప్రెస్‌రివ్యూ