Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

530 కోట్ల మొబైల్ ఫోన్లు పారేయాల్సిందే, ఈ ఏడాదే..

mobile phone
, సోమవారం, 17 అక్టోబరు 2022 (22:58 IST)
ఈ ఏడాది 530 కోట్ల మొబైల్ ఫోన్లు నిరుపయోగంగా మారతాయని, వీటిని పారేయాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ (డబ్ల్యూఈఈఈ) ఫోరమ్ చెప్పింది. గ్లోబల్ ట్రేడ్ డేటా ఆధారంగా ఈ ఫోరమ్, 'ఈ వేస్ట్' వల్ల పెరుగుతోన్న పర్యావరణ సమస్యలను హైలైట్ చేసింది. చాలామంది ఇలా నిరుపయోగంగా మారిన తమ పాత ఫోన్లను రీసైక్లింగ్ చేయడానికి బదులుగా వాటిని తమతోనే అట్టిపెట్టుకుంటారని పరిశోధనలో తేలింది.
 
ఎలక్ట్రానిక్స్ పరికరాల్లోని వైర్లలో ఉండే కాపర్, రిచార్జబుల్ బ్యాటరీల్లోని కోబాల్ట్ వంటి విలువైన మూలకాలను గనుల నుంచి తవ్వాల్సి ఉంటుంది. ''వ్యర్థాలుగా కనిపించే ఇలాంటి వస్తువులకు చాలా విలువ ఉంటుందని, ప్రపంచస్థాయిలో చూస్తే వీటి స్థాయిలు భారీగా ఉంటాయనే సంగతిని ప్రజలు గ్రహించలేరు'' అని డబ్ల్యూఈఈఈ డైరెక్టర్ జనరల్ పాస్కల్ లెరోయ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్ల మొబైల్ ఫోన్లు ఉంటాయని అంచనా. ఇందులో దాదాపు మూడోవంతు ఫోన్లు ప్రస్తుతం వినియోగంలో లేవు.
 
వాషింగ్ మెషీన్లు, టోస్టర్లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లు, జీపీఎస్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ఈ వ్యర్థాల పరిమాణం 2030 నాటికి సంవత్సరానికి 740 లక్షల టన్నులకు పెరుగుతుందని తమ పరిశోధనలో తేలినట్లు డబ్ల్యూఈఈఈ పేర్కొంది. ఈ వ్యర్థాల నుంచి కొత్త ఉత్పత్తులను తయారు చేసే ప్రచారాన్ని 'రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ' ఈ ఏడాది మొదట్లో ప్రారంభించింది. యుక్రెయిన్ యుద్ధం, అరుదైన మూలకాల సరఫరా గొలుసులో అవాంతరాలు, ప్రపంచస్థాయి సంక్షోభాలను హైలైట్ చేస్తూ ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది.
 
''కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్ వంటి ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే ముఖ్యమైన వనరులు ఈ వ్యర్థాల నుంచి లభిస్తాయి'' అని డబ్ల్యూఈఈఈకి చెందిన మాగ్దలీనా చారిటనోవిజ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 17 శాతం ఈ వ్యర్థాలు మాత్రమే సరైన రీతిలో రీసైక్లింగ్ అవుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి దీన్ని 30 శాతానికి పెంచాలని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ లక్ష్యాన్ని విధించింది.
 
హానికరమైన పదార్థాలను కలిగిన అత్యంత సంక్లిష్టమైన, వేగంగా పెరుగుతోన్న వ్యర్థ ప్రవాహాల్లో ఇవి కూడా ఒకటని వ్యాఖ్యానించింది. వీటివల్ల మానవ ఆరోగ్యానికి, పర్యావరణాన్ని హాని కలుగుతుందని చెప్పింది. యూకేలో రూ. 563 కోట్ల విలువ చేసే, పనిచేసే స్థితిలో ఉన్న, దాదాపు 2 కోట్లకు పైగా ఎలక్ట్రిక్ పరికరాలు నిరుపయోగంగా ఉన్నట్లు మెటీరియల్ ఫోకస్ సంస్థ చేసిన సర్వేలో తెలిసింది. యూకే కుటుంబాలు తమ ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను అమ్మడం ద్వారా సగటున రూ. 18,414 పొందగలవని ఈ సంస్థ లెక్కించింది. ఈ వ్యర్థాల విషయంలో మరింత కృషి చేయవచ్చని లెరోయ్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాడేపల్లి ప్యాలెస్ పిల్లి జడుసుకుంటుంది : నారా లోకేశ్