వయసు మీద పడుతున్నా ఆరోగ్యంగా ఉండటం ఎలా?
, మంగళవారం, 8 జనవరి 2013 (17:01 IST)
ఆరోగ్య సంరక్షణ అన్నది అందిరికీ వర్తించినా, నలభైకి చేరువ అవుతుంటే మాత్రం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఆ వయసులో డయాబెటిస్, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు, ఆస్టియోపోరోసిస్ వంటివి కనిపిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం మంచి జీవన శైలి అంటే మంచి ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లను విసర్జించడం వంటి అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. మన ఆహారంలో కాయగూరలు, ధాన్యాలు, తాజా పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె పదార్థాలను వీలైనంత తగ్గించాలి. పీచు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొలెస్ట్రాల్, చక్కెర పాళ్లు తక్కువుగా ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం. నలభైల్లో ఉండేవారు ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌ను దీర్ఝకాలం కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం. అందునా శరీరాన్ని అతిగా కష్టపెట్టే బాడీ బిల్డింగ్ వ్యాయామాల కంటే తేలికపాటి శారీరక శ్రమ కలిగించే నడక వంటివి మంచి వ్యాయామ ప్రక్రియలని గుర్తించుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజులపాటు రోజూ 45 నిమిషాల పాటు నడవటం చాలా మంచిది. పై జాగ్రత్తలతో పాటు పొగతాగడం, మద్యపానం, పొగాకు ఉత్పాదనలను నమలడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మంచి జీవనశైలిని పాటించినట్లవుతుంది. దీంతో మంచి ఆరోగ్యం సమకూరుతుంది.