మనిషికి రోజుకి సుమారు 1500 నుంచి 1800 క్యాలరీలు కావాలి. ఈ మోతాదును మించితే ఆరోగ్యానికి అనర్థదాయకమే. అధిక బరువు, స్థూలకాయం సమస్యలు వేధించడం ఖాయం. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునే ఆహారంతోనే అధిక క్యాలరీలు చేరుతున్నాయంటున్నారు వైద్యులు. ఉదయంవేళ తీసుకునే దోసెలు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య తలెత్తుతున్నట్లు ధృవీకరించారు. అసలు ఒక దోసె తీసుకుంటే లభించే శక్తి ఎంతో ఒక్కసారి తెలుసుకుందాం...
ఒక దోసెలో 120 క్యాలరీల శక్తి ఉంటుంది. అదేవిధంగా 3.29 గ్రాముల ప్రోటీన్లు, 1.25 గ్రాముల కొవ్వు, 23.7 గ్రాముల కార్బోహైడ్రేడులు, 12.9 మిల్లీగ్రాముల క్యాల్సియం ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ లో మనం 5 దోసెలు లాగిస్తే... 120x5= 600 క్యాలరీలు ఒక్కసారిగా శరీరంలోనికి వచ్చి చేరతాయి.
అంటే, రోజుకి మనకు కావలసిన క్యాలరీల్లోని మూడొంతుల్లో ఒక వంతు దోసెలతోనే వచ్చేస్తుంది. ఇక మధ్యలో చిరుతిళ్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్నీ కలిస్తే ఏకంగా 3000 అంతకు మించిన క్యాలరీలు ఒక్క రోజుకే శరీరానికి అందుతాయి. ఇదే అధిక బరువును తెచ్చిపెట్టే సమస్య. కనుక మితాహారం అన్ని విధాలా శ్రేష్టం అని గమనించాలి. సమతుల ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.