అమాంతంగా పెరిగిపోతున్న బరువును తగ్గించుకోవడం ఎలాగా అని యావత్ ప్రపంచం కొట్టుమిట్టులాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో త్వరగా బరువు పెరగడం ఎలా అని చిట్కాలు చెప్పనారంభిస్తే ఎవరికయినా ఒళ్లు మండుతుంది కాబోలు. అయితే ఉన్నఫళానా బరువు పెంచుకోవడంపై ఇక్కడ ఇస్తున్న సూచనల వెనుక ఓ పరమార్థం ఉంది మరి.
వారంలో ఏడు రోజులు వరుసగా తాము చెప్పిన పదార్ధాలు ఆరగించడాన్ని తుచ తప్పక పాటిస్తే చాలు పౌండ్ బరువు పెరగడం ఖాయం అంటున్నారు ఆహార నిపుణులు. దీనికోసం వారానికి సరిపడా బరువు పెంచే ఆహార పదార్ధాల జాబితాను వీరు ముందే సూచించారు కూడా. అవేమిటో చూద్దామా..
సోమవారం: పెద్ద గ్లాసునిండా కాఫీ లాగించేయండి. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజన విరామానంతరం 2 గులాబ్ జామ్‌లను లాగించండి.
మంగళవారం: మీడియం సైజ్ కోలా బాటిల్ పని పట్టండి. చుక్క కూడా మిగలకుండా తాగేయండి. అలాగే ఒక కప్పు ఫ్రెంచ్ ప్రైస్‌ను ఓ పట్టు పట్టండి.
బుధవారం: ప్లేట్ నిండా చికెన్ బిరియాని పని పట్టండి. బాగా అలసిపోయారనుకుంటా మరి. మరింకేం.. రోజువారీ చేసే వ్యాయామాన్ని ఈరోజు గాలికి వదిలేయండి. అంతే.
గురువారం: బఫేలో కంటికి కనిపించిందల్లా ప్లేటులో వేసుకుని ఆబగా తినేయండి. చాలు. క్రికెట్ మ్యాచ్ వస్తోంది కదూ. మరికేం. సాయంత్రం సోఫా మీద కూర్చుని కాలు కదపకుండా గేమ్ చూస్తూ ఉండండి.
శుక్రవారం: రెండు పిజ్జా స్లైస్‌లను ఆరగించండి. ఏదేని ఒక తినుబండారం లాగించండి. వ్యాయామం జోలికి పోవద్దు సుమా..
వారాంతం: శనివారం సహజంగా పండ్లను తీసుకునే అలవాటు చాలామందిలో ఉంటుంది. కనుక దానిమ్మ తదితర ఇష్టమైన పండ్లను లాగించేయండి. ఇక ఆదివారం కూడా ఆటవిడుపే కదా.. మెక్సికన్ ఫుడ్ దొరికితే పూటుగా లాగించేయండి. తర్వాత రాత్రిపూట లేటుగా నిద్రపోండి. చాలు
ఇంకేం వద్దు. ఇవి చాలు. వారం తిరిగే సరికి మీరు ఆస్థి పెంచుకోవడం ఖాయం అని ఆహార నిపుణులు అంటున్నారు. ఇవి అవాంఛితంగా బరువును పెంచుకోవాలనుకునే వారు పాటించవలసిన సూత్రాలు. బరువు తగ్గడం ప్రస్తుతం ప్రపంచ సమస్యగా అయిపోయింది కాబట్టి వారి గతి ఏమిటంటారా... ఏముందీ.. సింపుల్... వారంలో పైన చెప్పినవన్నీ మానేయండి చాలు.
ఊబకాయ నివారణకు ఇంతకు మించిన తారక మంత్రం లేదు మరి. కాఫీ, గులాబ్ జామ్, కోకాకోలా, చికెన్ బిరియానీ, బఫే తిండి, క్రికెట్, పిజ్జా, బీరు, లేటు నిద్రలేమి... ఇవి చాలు మన ప్రాణ హరణానికి అని అంటున్నారు నిపుణులు. కాబట్టి ఊరకే బరువు పెంచుకోవాలనుకుంటే వీటిని లాగించండి. వద్దనుకుంటే ప్రపంచంలో ఇవి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోండి.