పళ్లరసం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు కదూ.. కాని ఆ పళ్లరసాన్ని కూడా చూసి దడుచుకోవాల్సిన రోజులు దాపురించేశాయి మరి. ప్రాణాంతకంగా మారి ప్రపంచాన్ని భయపెడుతున్న మధుమేహ వ్యాధి బారిన పడకుండా తప్పించుకోవాలంటే పళ్ల రసాలకు సెలవు చీటీ ఇచ్చేయ్యాల్సిందే అని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.ప్రపంచంలో ఇవి లేవనుకుంటే.. |
|
సుగర్ రోగులు ప్రపంచంలో కొన్ని పదార్థాలు లేవనుకుంటే మంచిదని అల్లోపతి వైద్యులు చెబుతున్నారు. వాటిలో మొదట చెప్పాల్సింది పళ్లరసాల గురించేనట. ఇష్టమని చెప్పి సీజన్లో మామిడిపళ్లు తిన్న వారు ఆకస్మిక గుండెపోటుతో పోతున్న నేపధ్యంలో పళ్లరసానికి నిజంగానే భయపడాలి |
|
|
ప్రపంచానికి మరీ కలవరం తెప్పిస్తున్న టైప్ 2 డయాబిటిస్ వ్యాధి బారినుంచి మహిళలు తప్పించుకోవాలంటే పళ్ల రసాలకు మంగళం పాడేయవలసిందేనని అమెరికాలో తాజా పరిశోధన చెబుతోంది. ఆకుకూరలు, అన్నిరకాల పళ్లముక్కలతో మహిళలు ప్లేటు నింపుకోవచ్చు గాని పళ్ల రసాల జోలికి మాత్రం పోవద్దని ఈ పరిశోధన భయపెడుతోంది.
రోజుకు మూడు పూటలా ఒక పండును పూర్తిగా తిన్నా లేక ఆకుకూరలను మరో పూట వడ్డించుకు తిన్నా డయాబిటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని న్యూ ఆర్లియన్స్లోని తులానే యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు ఉష్ణమండల వైద్య విభాగానికి చెందిన డాక్టర్ లిడియా ఎ బజ్జానో పేర్కొన్నారు. నర్సుల హెల్త్ స్టడీలో నమోదైన 71,346 మంది మహిళలను 18 ఏళ్లపాటు పరిశీలించిన పిమ్మట ఈ తాజా అధ్యయనం ఫలితాలను బహిర్గతం చేశారు.
బజ్జానో మరియు ఆమె సహచరులు నర్సెస్ హెల్త్ స్టడీలో పాల్గొన్నవారి ఆహార అలవాట్లకు సంబంధించిన డేటాను విశ్లేషించారు. వీరిలో టైప్ 2 డయాబిటిస్ కలిగిన 4,529 మంది మహిళలను పళ్లు, ఆకుకూరలు తీసుకునేవారు, పళ్ల రసాలు తీసుకునేవారు అనే వర్గీకరణల కింద వేరు చేశారు.
రోజు మొత్తంలో అదనంగా 3 సార్లు మొత్తం పండును తింటూ వచ్చిన వారిలో డయాబిటీస్ వచ్చే అవకాశం 18 శాతం దాకా పడిపోగా, అదనంగా మరోసారి ఆకు కూరలు తిన్న వారిలో ఈ అవకాశం 9 శాతం మేరకు తగ్గిపోయింది. కాగా, రోజులో అదనంగా మరో గ్లాసెడు పళ్లరసం తీసుకున్న వారిలో మధుమేహం వచ్చే అవకాశం 18 శాతానికి పడిపోయిందని ఈ అధ్యయనంలో తేలింది.
ఈ పరిశోధన బట్టి తేలిన విషయమేమిటంటే పళ్లరసాలకు అలవాటు పడితే చక్కెర వ్యాధిని పిలిచి ఆహ్వానించినట్లేనట. పళ్లరసంనిండా చక్కెర పేరుకుపోయి ఉంటుంది. పైగా, అది ద్రవరూపంలో ఉంటుంది కాబట్టి సేవించిన వెంటనే అది శరీరంలో కలిసి పోతుందని డాక్టర్ లిడియా చెప్పారు.
కాబట్టి...... మహిళలు ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే పళ్లరసాలకు బదులుగా ఇతర పదార్ధాలను ఎంచుకోవలసిన అవసరముందని ఈ అధ్యయన బృందం చెబుతోంది. పైగా పళ్లరసాలకు బదులుగా పళ్లు తినడం మంచి అలవాటని అధ్యయనం సిఫార్సు చేస్తోంది. పళ్ళలో కూడా చక్కెర శాతం అధికంగా ఉన్న పళ్లను ఆహారంలోకి తీసుకోవద్దని ఆధునిక వైద్య చెబుతోందనుకోండి.
మొత్తం మీద పళ్లరసానికి, చక్కెరవ్యాధికి అవినాభావ సంబంధం ఉందహో............