పండ్లు తింటే చాలు ఆయుర్దాయం పెరుగుతుంది అని ఎవరైనా అంటే పుక్కిటి పురాణాలుగా భావించే కాలం ఇప్పుడు కాస్త బాణీ మార్చుకుంటోంది. ఆయుస్సుకు పండ్లు తినడానికి సాదా బంధం కాదు అవినాబావ సంబంధం ఉందని తాజా అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి మరి.
శాస్ర్ర విరుద్ధమంటూ చిరకాలంగా కొట్టి వేస్తున్న విషయాలనే ఆధునిక పరిశోధకులు అత్యంత శాస్త్రీయ విషయాలుగా తమ అధ్యయనాలలో పేర్కొనడం కద్దు. పండ్లు కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకునే అలవాటు ఉన్న వారిలో జీవించే కాలం బాగా పెరిగినట్లు బ్రిటన్‌లో పరిశోధకులు కనుగొన్నారు.
జీవిత కాలాన్ని పొడిగించుకోవడానికి దోహదపడుతున్న అంశాలను కనుగొనడానికి కేంబ్రిడ్జి యూనివర్శిటీ విద్యార్థులు గత 14 ఏళ్లుగా 20 వేలమందిని పరిశీలించి ఇటీవలే తమ అధ్యయన ఫలితాలను ప్రకటించారు. నిత్యం శారీరకంగా చురుగ్గా ఉంటూ, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉంటూ పండ్లు కూరగాయలు తీసుకోవడం వంటి అలవాట్లను పాటించేవారినే తమ పరిశోధనలో అభ్యర్థులుగా ఎంచుకున్నారు.
మిగతావారితో పోలిస్తే ఇలాంటి అలవాట్లు పాటించిన వారిలో జీవన కాలం పెరిగినట్లు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనా ఫలితాలను ప్రకటించిన సందర్భంగా వీరు విలేఖరులు సమావేశంలో మాట్లాడుతూ జీవిత కాలాన్ని పొడిగించుకోవడానికి మనుషుల ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ప్రధానంగా మద్యపానం తగ్గించడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి ఆయుర్దాయం పెంచే మార్గాల్లో అత్యుత్తమమైనవిగా వీరు ప్రకటించారు.
కుటుంబానికి తమ ఆహారాన్ని కూడా త్యాగం చేసే మహిళలు ఈ విషయం గుర్తుంచుకుంటే, దైనందిన ఆహారంలో సమృద్ధిగా కూరగాయలు, పండ్లు భాగం చేస్తే అందరి ఆరోగ్యం బాగుపడుతందనటంలో అతిశయోక్తి లేదు కదా.. ఆహారంలో కూరగాయలు, పండ్లను చేర్చడం భవిష్యత్తులో సామాజిక బాధ్యతగా మార్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదు మరి...
అంతవరకు పళ్లు తింటూ ఉండండి... ఆయుస్సు పోసుకోండి...