నలుగురిలోకి రావడం మాట అటుంచి నలుగురిలో నోరు విప్పి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మనిషిని భయపెట్టే శక్తి ఒకే ఒక్క అంశానికి ఉంది ప్రపంచంలో. అదేంటో కాదు నోటి దుర్వాసనే... దీని తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంతగా అది మనిషిని వణికిస్తుంది. దీని దెబ్బతో నలుగురిలో సహజంగా ఉండలేరు. హాయిగా నోరువిప్పి నవ్వలేరు..
ఒకటి మాత్రం ఖాయం... ఇది వస్తే చాలు మనిషి జీవితమే మారిపోతుంది. నోరు విప్పలేని జీవితం. మనసారా నవ్వుకోలేని జీవితం. పగవాడికి కూడా రావద్దు బాబోయ్ అనిపించేంత ఫీలింగ్.. నోటి దుర్వాసనకే సాధ్యం.
మన నోరు మనకే కంపు వేసే పరిస్థితి వస్తే ఇతరులకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మరి దీన్ని పోగొట్టుకోవడం ఎలా.. మనచేతిలోనే ఉంది పరిష్కారం. మన ఆహార అలవాట్లలో కాస్త మార్పులు చేసుకుంటే చాలు.. దుర్వాసన దెబ్బకు దిగి కిందికి వస్తుంది..
అవేమిటో చూద్దామా...
నోటిని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. అంటే దీనర్థం మంచి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలనే.. మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే షుగర్ ఫ్రీ గమ్ నమలడం. దీనిని నమిలితే నోటిలో లాలాజలం ఊరుతుంటుంది.
కొవ్వులేని పెరుగు తీసుకోవాలి. అంటే అన్నంలో గానీ, పంచదార కలుపుకుని కాని తినడం కాదు. ఒట్టి పెరుగును దేనిలోనూ కలపకుండా తింటే పళ్లకు పట్టిన గార, నోటి పూత తగ్గుతాయి.
జీర్ణ ప్రక్రియ సవ్యంగా జరిగితే నోరు శుభ్రంగా తయారవుతుంది. దీనికోసం అనాసకాయ ముక్కలను తినండి. దీనిలోని బ్రొమిలెయిన్ అనే ఎంజైమ్ జీర్ణ ప్రక్రియ సవ్యంగా జరిగేలా చేస్తుంది.
అలాగే పచ్చి కాయగూరలను నమిలేటప్పుడు లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది పళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్ధాలను, పళ్లపై ఉన్న యాసిడ్‌ను పూర్తిగా తొలిగిస్తుంది.
దుర్వాసనను తగ్గించుకోవడానికి మౌత్ వాష్‌నో లేదా మింట్ చిక్‌లెట్స్‌నో కొనేకంటే నోటి దుర్వాసనను కలుగజేసే బాక్టీరియాను తగ్గించుకుంటే ఇబ్బంది ఉండదు. నోటిలో బాక్టీరియా తగ్గించుకోవాలంటే పైన చెప్పిన వాటిలో కొన్ని వరుసగా పాటిస్తే చాలు.
పదిమంది మీ దగ్గరకు వచ్చేలా చేసుకోవాలంటే ముందు మీ నోటి దుర్వాసనను అదుపు చేయండి చాలు..