నాజూకుగా ఉండేందుకు చేపలు...!!
, గురువారం, 25 మార్చి 2010 (18:56 IST)
చాలామంది అమ్మాయిలు నాజూకుగా ఉండేందుకు నిత్యం తీసుకునే ఆహారాన్ని కూడా త్యజించి కేవలం ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తుంటారు. దీంతో శరీరంలో శక్తి తగ్గి బలహీనంగా మారిపోతుంటారు. అందవిహీనులుగా తయారువుతుంటారు. ఏమంటే డైట్ కంట్రోల్ అంటూ హొయలొలికిస్తుంటారు. కాని ఆహారం తీసుకోకపోవడం మూలాన శరీరంలోని శక్తి హరించుకుపోయి పలు జబ్బులకు ఊతమిచ్చినట్లౌతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి వారు వారానికి రెండుసార్లు చేపలు ఆహారంగా తీసుకుంటే చాలా మంచిది. చేపలు తీసుకోవడం వలన శరీరంలోని వ్యర్థమైన కొవ్వు తగ్గి నాజూకుగా తయారవుతారు. పైగా కంటి చూపు చాలా బాగుంటుంది. దీంతోపాటు గుండె సంబంధిత జబ్బులను 36 శాతం మేరకు తగ్గించవచ్చంటున్నారు వైద్యులు. చేపలు తినడం వలన అల్జీమర్స్ వ్యాధి, మానసికపరమైన ఒత్తిడి, రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే శరీరానికి కావలసిన ప్రొటీన్లు, మినరల్సు, విటమిన్లు అందడమే కాకుండా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. వెంట్రుకలు పట్టులాగా మృదువుగాను నిగనిగలాడుతుంటాయని వైద్యులు సూచిస్తున్నారు.