ఓ 30 ఏళ్ల క్రితం... హీరో నటనలో భాగంగా హీరోయిన్‌ను బహిరంగంగా ముద్దాడిన ఘటన మన సినిమాల్లో మొదలైనప్పుడు, భారతీయ సమాజం విరుచుకు పడిన విషయం ఇంకా మనం మర్చిపోలేదు. మూడు దశాబ్దాల క్రితం అలనాటి అందాల తార శ్రీదేవి ఒక తెలుగు సినిమాలో పాత్రోచితం పేరుతో నిక్కరేసుకుని క్లబ్ సాంగ్‌లో సిగిరెట్టు ముట్టించి పొగ ఊదితే నాటి మహిళా లోకం అదిరిపోయింది. బామ్మలు సైతం శ్రీ... నువ్వు ఇలా చేయవచ్చా అని ఉత్తరాలు రాసి దులిపేస్తే అంతటి శ్రీదేవే తదుపరి నటనా జీవితంలో ఎన్నడూ సిగిరెట్ ముట్టిన పాపాన పోలేదంటే నమ్మండి. |
దేశాల మధ్య సాంస్కృతిక వ్యత్యాసాలు అంతరించి ఒకే సంస్కృతి... గ్లోబల్ సంస్కృతి -ఎవరు ఏమైనా చేసుకోవచ్చు- ప్రపంచమంతటా అలుముకుంటున్న వేళ మహిళల సిగిరెట్ కొట్టుడు మీదే కాదు దేనిమీదైనా ఎవరూ అభ్యంతరాలు చెప్పే పరిస్థితి అంతరించిపోయింది మరి... |
|
|
మరి ఇప్పుడో.. సమాజం ఎంతగా మారిందంటే... మెట్రో నగరాల్లో మహిళలు సిగిరెట్ ముట్టించి దమ్ము కొట్టడం మెల్లమెల్లగా మొదలవుతోంది. టీషర్ట్స్...జీన్స్......ఒక చేత్తో సన్నని సెల్‌ఫోన్... మరో చేత్తో లైట్స్ సిగరెట్స్ పట్టుకొని వయ్యారంగా హంసనడక నడుస్తూ గాఢంగా ఒక దమ్ములాగి ధూమ్ రేపితే వాహ్.. ఇదీ తాజాగా నగరంలో నయా ఫ్యాషన్. సరదా కాస్తా అలవాటుగా మారడంతో మెట్రో నగరాల్లో సిగరెట్ దమ్ము ఇప్పుడో ఫ్యాషనైంది. అమ్మాయిలు తమ డాబు ప్రదర్శించుకోవడానికి సిగరెట్ తాగడం అలవాటుగా మార్చుకున్నారు.
అలసట జీవితం నుండి కాసింత ఉపశమనం కోసం తాగేవారు కొందరైతే, అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. నగరంలో విస్తరిస్తున్న ఐటీ, బీపిఓ, కెపిఓ రంగాలతో పాటు మహిళలు కొత్త సంస్కృతిని బాగానే ఒంటబట్టించుకున్నారు. కాఫీడే... పిజ్జాహట్, మెక్‌డోనాల్డ్స్, పబ్స్, రిసార్ట్స్‌కు వెళ్లే టీనేజ్ అమ్మాయిలు సన్నిహితుల సాన్నిహిత్యంలో సరదాగా దమ్ము లాగేస్తున్నారు. కాకపోతే బాడీ రీఛార్జీ కాదంటోంది నేటి టీనేజీ అమ్మాయిలు.
రాత్రివేళల్లో కాల్ సెంటర్‌లలో పనిచేసే సమయంలో సరదాగా అలవాటైన ఈ ఫ్యాషన్ తప్పేం కాదని చెబుతున్నారు. వత్తిడిని తగ్గించుకునేందుకు వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే ఒక దమ్ము లాగడం. ఇలా అలవాటులో పొరపాట్లు చేయడం అమ్మాయిలకు పరిపాటిగా మారుతోంది. పదహారేళ్ల పడుచు ప్రాయంలో మనసు పెట్టే గిలిగింతలు అదుపుచేసుకోలేని భావోద్వేగాల మధ్య ఊగిసలాడే అమ్మాయిలు ఈ పొగ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారని ఇటీవల జరిగిన సర్వేలో వెల్లడైంది.
సిగరెట్‌లో ఉండే నికోటిన్ అనే అల్కలాయిడ్ శరీరంలో కొవ్వును తగ్గిస్తుందన్న అపనమ్మకం కూడ అమ్మాయిలను పొగబాట పట్టేలా చేస్తోందని వైద్యులు తెలుపుతున్నారు. ఊపిరితిత్తులు, కేంద్రీయ నాడీ వ్యవస్థపై పొగాకు తీవ్ర దుష్ ప్రభావం చూపుతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పొగ సంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు.
అబ్బాయిలు అలా ఇలా తిరుగుతుంటే అమ్మాయిలం మేం ఇలా అలా తిరగకూడదా.. మాకేనా అన్ని ఆంక్షలూ అంటూ ఎగిరిపడే తిరుగుబాటు మనస్తత్వం, తిరుగుబోతు మనస్తత్వం ప్రస్తుతం ఆధునిక మహిళలు అంటే సంపన్న యువతులూ... వారిని చూసి మరో రెండాకులు ఎక్కువగానే నేర్చేసుకునే ఎగువ మధ్యతరగతి యువతులూ ఇప్పుడు తయారైపోయారు.
స్త్రీ స్వాతంత్ర్యం, స్వావలంబన, ఆత్మ విశ్వాసం అనేవి ఇతర మౌలికాంశాలలో ప్రతిబింబిస్తే బాగుండేది కానీ దమ్ముకొట్టడంలో, బీరు లాగించడంలో ముందుగా ప్రతిబింబిస్తున్నాయి కాబోలు... ఎవరూ ఎవరినీ ఏమీ అనలేని, అనకూడని నయా సంస్కృతి మహాత్మ్యం మరి.