లావు కాకూడదనే భయంతోనో లేదా ఆహార నియమాలు పాటించే మిషతోనూ కొవ్వు పదార్ధాలు ఏ మాత్రం లేనటువంటి ఆహారం తీసుకుంటే ప్రమాదం ముంచుకొచ్చినట్లేనని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏమాత్రం కొవ్వు పదార్ధాలు లేని ఆహారం తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిదని మనలో చాలా మంది నమ్ముతున్నారు మరి.
కానీ కొవ్వు పదార్ధాలు ఎంతో కొంత ఉన్న ఆహారాన్ని తీసుకోవడం సరైన ఆరోగ్యానికి ఎంతో అవసరమని తాజాగా ఆహార నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం భయంతో ఎంతోమంది మహిళలు పోషక పదార్ధాలను కూడా తీసుకోవడం మాని సైజ్ జీరోలపై మోజులో పడుతున్న ప్రస్తుత కాలంలో శరీరానికి కొవ్వు పదార్ధాలు తప్పనిసరిగా అవసరం అనే కోణాన్ని ఆహార నిపుణులు ముందుకు తీసుకు వస్తున్నారు.
ఈ విషయమై పాశ్చాత్య న్యూట్రీషియనిస్ట్ ఈస్తర్ బ్లమ్ పెద్ద పుస్తకమే రాశారు. మానవ శరీరానికి కొవ్వు పదార్ధాలు ఎంతగా అవసరమో వివరిస్తూ ఈయన 'సీక్రెట్స్ ఆఫ్ గార్జెస్: హండ్రెడ్స్ ఆఫ్ వేస్ టు లివ్ వెల్ వైల్ లివింగ్ అనే పుస్తకం రాశారు. రకరకాల కారణాలతో కొవ్వు పదార్ధాలను మహిళలు పూర్తిగా ఆపివేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా మహిళలు కొవ్వు పదార్ధాలు తీసుకోవడం పూర్తిగా నిలిపివేస్తే వారి హార్మోన్లు అసమతౌల్యానికి గురవుతాయని ఈస్తర్ బ్లమ్ హెచ్చరించారు. పైగా, శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్లు సక్రమంగా విడుదల కావాలంటే కొద్ది మొత్తంలో మంచి కొలెస్ట్రాల్ అవసరమని బ్లమ్ చెబుతున్నారు.
కొవ్వు పదార్ధాలు ఏమాత్రం లేని ఆహారం తీసుకోవడం వల్ల లైంగిక జీవితంపైన కూడా తీవ్ర దుష్ఫలితాలకు దారి తీసే ప్రమాదముందట. ముఖ్యంగా మహిళల్లో లైంగిక వాంఛల గాఢత కూడా బాగా తగ్గిపోతుందని బ్లమ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆరోగ్యంతోపాటు అందాన్ని మెరుగుపర్చుకునే చిట్కాలు సైతం ఈ పుస్తకంలో రాశారు.
ఈ సరికొత్త ఆహార, ఆరోగ్య చిట్కాలను చూస్తే అతి సర్వత్ర వర్జయేత్ అనే పెద్దల సూత్రం గుర్తువస్తుంది. తింటే పరిమితులు లేకుండా తినడం, లేకపోతే పొట్టను ఎండగట్టించడం, నోటిని కట్టేయడం. మితంగా తింటే ఏదైనా ఒంటికి మంచిదే అనే సామెత జనజీవితంలో ఊరికే పుట్టలేదు మరి.