వంటింటిలో రోజు మనకు తారసపడే ఆకులపై మనకు ఎంత ఇష్టముందో తెలీదు గానీ వైద్య పరిశోధకులకు మాత్రం భారతీయ వంటింటి పోపు మారాజులకు మాత్రం అవి అమృత గుళికల వలే కనిపిస్తున్నాయి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వంటివి పోపులో వేసి వడ్డిస్తే దాని గుమగుమల గుబాళింపుకు ఎంత మొద్దుబారిపోయిన నాలుక అయినా పాము నాలుకలాగా వంకరలు తిరగాల్సిందే మరి.
అలవాటుగా ఈ మూడు ఆకులను కూరలో ఉపయోగించడం ఎంత మంచి అలవాటంటే వీటి వల్ల కొన్ని రకాల ఆరోగ్యాలు దరిచేరవని పరిశోధకులు సెలవిస్తున్నారు. ప్రధానంగా వీటిని నిత్యం వాడితే, ఉపయోగిస్తే కొవ్వు కేలరీల సమస్యే ఉండదని వీరు ముక్తాయిస్తున్నారు. భోజనంలో వీటిని తీసుకుంటే యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయిని చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా తులసి, పుదీనా వంటి వాటిని రోజూ వాడటం వల్ల శరీరంలో కాన్సర్ కారకాలు చేరకుండా అడ్డుకోవచ్చని తాజా పరిశోధనలు వెల్లడించాయి. కొత్తిమీర అయితే కొన్ని రకాల ఆనారోగ్యకరమైన బాక్టీరియాను శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుటుందట. అందుకే ఆకులే కదా అని తీసి పారవేయకుండా వంటకంలో మీకు నచ్చినట్లుగా కొత్తిమీర, కరివేపాకులతో పోపు పెట్టండి.
చాలా మందికి కరివేపాకు అంతే ఎంత ఈసడింపు అంటే భోజనంలో దాన్ని చూసీ చూడగానే ఏరి పారేసేవారే ఎక్కువ. ఇలాంటి వారిచేత ఈ ఔషధ సమాన ఆకును ఎలా తినిపించాలి మరి. చాలా సింపుల్... ముందుగా కరివేపాకును మిక్సీలో వేసి ముద్దలా చేసి ఆ పేస్టును కొంచెం వంటల్లో వాడేయండి. ఇకపై కరివేపాకుపై ఏ కంప్లెయింట్లూ రావని గ్యారంటీగా చెప్పవచ్చు.