ఆహారం, నిద్ర, వ్యాయామం ఇవి మనుషులందరికీ సాధారణంగా వర్తించే నియమాలే.. అయితే కుటుంబ జీవనంలో అధిక పనిభారం మోస్తున్న మహిళకు పై మూడూ మరీ అవసరం అని విజ్ఞుల మాట. ఎందుకంటే భారత్ వంటి సాంప్రదాయక సమాజాల్లో సగటు మహిళకు ఈ మూడూ కరువేనని చాలాకాలంగా సర్వేలు ఘోషిస్తున్నాయి మరి.
కుటుంబం కోసం అన్నీ త్యాగం చేయవలసిన గృహిణి పాత్రలో పడి నలుగుతున్న మహిళలు ఆహారం, నిద్ర, వ్యాయామాలను కూడా త్యాగం చేసేస్తున్నారనేది సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా.
ఇంటి పని భారానికి వృత్తి లేదా బయటి పని భారం కూడా తోడయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం, నిద్ర, వ్యాయామం మహిళలకూ తప్పనిసరి అవసరంగా మారాయి. పని ఒత్తిడి, నిత్య కాలుష్యంతో రాజీ పడుతూ జీవించాల్సివస్తోంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మహిళల జీవన శైలిలో అనివార్యంగా మార్పులు చేసుకోవాల్సి ఉంది. అందుకే ఈ మూడింటి విషయంలో పాటించవలసిన జాగ్రత్తలను కాస్త తెలుసుకుందామా....
అన్నిటికన్నా ముఖ్యమైంది నిద్ర, భోజన వేళల విషయంలో సమయపాలన తప్పనిసరి. రోజూ వేళకు క్రమం తప్పకుండా నిద్రపోవడం, భుజించడం అలవాటుగా చేసుకుంటే రోజంతా ఉత్తేజంగా పనిచేసుకోగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
ఏం తినాలి?
సాధ్యమైనంతవరకూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభించే పదార్థాలనే ఆహారంలోకి తీసుకోవాలి. లేదంటే కొవ్వు నిల్వలు ఎక్కువై ఆరోగ్య సమస్యలు చుట్టు ముడతాయి.
పొద్దుటి పూట తీసుకునే అల్పాహారంలో తృణ ధాన్యాలు, వేరు శెనగలు, బ్రెడ్ వంటి తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న పదార్థాలు మాత్రమే ఉండాలి. శరీరానికి పైబర్, ప్రొటీన్‌లు వీటి ద్వారానే అందుతాయి. అంతేకాకుండా రోజంతా శరీరానికి ఇవి శక్తిని ఇస్తాయి కూడా.
కొవ్వు అధికంగా ఉన్న స్వీట్స్, జంక్ ఫుడ్స్, చికెన్ టిక్కా లాంటి పదార్ధాలను తరచూ తీసుకోకూడదు. వీలైనంత వరకూ ఇలాంటి వాటిని పక్కన పెడితేనే మంచిది.
మొక్కజొన్న, టమోటా, గుమ్మడి, క్యాలిఫ్లవర్, క్యారెట్లను ఆవిరిపై ఉడికించి తినాలి. ఇవి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. అలాగే జామపండు, పుచ్చకాయ బొప్పాయి, ద్రాక్ష పండ్లలోని గుణాలు క్యాన్సర్ కారకాలను ఎదుర్కోవడమే కాక, గుండెకు రక్షణ ఇస్తాయి.
అలాగే, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల్లో లభించే సల్ఫర్ జీర్ణాశయం మరియు పెద్దపేగులకు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.
పాలకూర, క్యారెట్, ఇతర ఆకుకూరల నుంచి ఎ- విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
సాయంత్రం వేళల్లో కొబ్బరి నీరు, బార్లీ నీళ్లు, తాజా పండ్లు, కూరగాయల సలాడ్స్, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్‌లు సమృద్ధిగా లభిస్తాయి.
ఏం చేయాలి?
భోంచేసిన తర్వాత కూర్చుండిపోవటం, పరుండటం కంటే మించిన ప్రమాదం శరీరానికి మరొకటి లేదని వైద్యుల ఉవాచ. కాబట్టి తిన్న తర్వాత కనీసం పది నిమిషాలపాటు ఆటూ ఇటూ తిరగాలని వైద్యులు అంటున్నారు.
ఒకప్పుడు పల్లెల్లో రాత్రిపూట తిండి తిన్నాక పిల్లలను ఇంటి చుట్టూ లేదా పల్లెదారుల వెంబడి పచార్లు చేయమని పెద్దలు పనిగట్టుకుని ఇంట్లోంచి బయటకు తోలేవారు. ఈ అలవాటు పట్నాల్లో లేకపోవటం లేదా తింటూనే పుస్తకాలు పట్టుకోవడమో, టీవీలు, కంప్యూటర్ల జోలికి పోవడమే చేస్తున్నారు కనుక బాల్యం నుంచే ఇప్పుడు ఊబకాయం మనల్ని ఆహ్వానిస్తోంది. ఇది జరగకుండా ఉండాలంటే....
నడక, పరుగు, ఈత, సైక్లింగ్, వంటి ఏదైనా ఒక ఎక్సర్‌సైజును రోజుకు ముప్పై నిమిషాల పాటు తప్పనిసరిగా చేయాలి.
భోంచేస్తూనే కూర్చోవడం, పడుకోవడం ఎంత ప్రమాదకరమో, అయిందానికి, కానిదానికి వాహనం ఉపయోగించడం అంతకంటే ప్రమాదకరం. అందుకే దగ్గర ప్రాంతాలకు వెళ్లాలంటే నడకతే ప్రాధాన్యమివ్వండి.
ఇంట్లో పనులు స్వయంగా చేసుకోవడం కూడా మహిళలను చురుగ్గా ఉంచుతుంది.
రోజంతా పని ఒత్తిడితో శరీరం అలసటకు లోనైతే విశ్రాంతిగా కూర్చోండి. సూర్యోదయం వేళ లేలేత కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు ప్రశాంత వాతావరణంలో కాస్సేపు విశ్రాంతిగా కూర్చోండి.
ధ్యానం, ప్రాణాయామం వంటివి ఎంత గొప్ప అనుభూతినిస్తాయో స్వయంగా చేసి ఆస్వాదించండి.
ప్రతిరోజూ 2 నుంచి 3 లీటర్ల నీటిని కనీసంగా అయినా తాగాలి.
ముఖ్యంగా ఏసీ ఉన్న చోట పని చేస్తున్నట్లయితే గంట గంటకూ నీళ్లు తాగడం అవసరం. నాలుక తడారిపోయేలా చేసే ఏసీ వాతావరణానికి మంచినీరు చక్కటి విరుగుడు.
ఎంత సేపు నిద్రపోవాలి?
కోడి నిద్ర కోళ్లకు పనికొస్తుందేమో గాని మనుషులకు పనికిరాదు. జాము జాముకూ నిద్ర లేచి కొక్కొరొక్కో అని అరవటం కోడి లైఫ్ స్టైల్ కాగా మనుషులకు ఈ తరహా స్టైల్ పనికిరాదు. మహిళలకు అసలే పనికిరాదు. లేచింది మొదలు నిద్రపోయేవరకూ పనుల్లో మునిగితేలే మహిళలు కనీసం 7 గంటలయినా నిద్రపోకపోతే వారి శారీరక మానసిక ఆరోగ్యం కుదేలయిపోతుంది. అదీ కోడి నిద్ర కాకుండా గాఢ నిద్ర.. పడుకుంటే తిరిగి మెలకువ వచ్చేంతవరకూ స్పృహలేకుండా ఉండేరకం నిద్ర మహిళలకు చాలా అవసరం. అయితే తిండి, నిద్ర, వ్యాయామం మూడింటిలోనూ సమయపాలన పాటించడం చాలా అవసరం.