పురుష ఉద్యోగులతో పాటు కెరీర్‌లో భాగంగా తాగడం అలవాటు చేసుకున్న ఆస్ట్రేలియా మహిళలు ఆల్కహాల్ సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారని తాజా సర్వేలో తేలింది. పశ్చిమ సిడ్నీ యూనివర్శిటీ నిర్వహించిన ఈ సర్వేలో 35-55 సంవత్సరాల మధ్య వయసు గల 120 మంది కెరీర్ మహిళలు పాల్గొన్నారు.
స్త్రీ పురుషుల మధ్య ఆల్కహాల్ జీవన చక్రంలో భారీ స్థాయి వ్యత్యాసం చోటు చేసుకున్నట్లుగా ఈ సర్వే పేర్కొంది. ఇలా ఆఫీసు అవసరాల కోసం పురుషులతో కలిసి తాగేవారు మత్తు పానీయాలకు దాసోహమై సూపర్ మమ్ సిండ్రోమ్‌ను అలవర్చు కుంటున్నారని ఈ సర్వే తెలిపింది.
వీరిలో చాలామంది ప్రయివేటుగా తాగుతూ, తన మద్యపానీయ స్థాయిని బహిర్గతం చేయకుండా ఉండటమే కాక వాటినుంచి బయటపడేందుకు సహాయం అడిగేందుకు కూడా వెనుకాడుతున్నారని సర్వేకు నేతృత్వం వహించిన రీసెర్చర్ జెనీస్ వితనాల్ చెప్పారు. ఆస్ట్రేలియాలోని మద్యపాన సంస్కృతి మరియు ఫెమినిస్టు ఉద్యమంలో ఈ సమస్యకు మూలం దాగుందని ఆమె పేర్కొన్నారు.
తమ సహోద్యోగులతో సరిసమానంగా నిలిచేందుకు గాను ఉద్యోగ మహిళలు తాగడం అలవర్చుకుంటున్నారని, జాతీయ గణాంకాల ప్రకారం చూస్తే నడి వయస్సు గ్రూప్ మహిళలు మద్యపానీయంతో బాధపడుతున్నారని జెనీస్ వితనాల్ చెప్పారు. పగలు రాత్రి భోజనాల సమయంలోనే చాలావరకు వ్యాపార వ్యవహారాలు నిర్వహించబడుతున్నందున మహిళలు పురుషులతో కలిసి మందు సేవించడం అలవాటుగా మారుతోందని చెప్పారు.
కెరీర్లో ముందుకెళ్లాలంటే యువకులతో కలిసి తామూ తాగవలసిన అవసరం ఉందని 20లలోని యువతులు భావిస్తున్నారని, అయితే 30వ పడిలో పడగానే తాము పూర్తిగా అదుపు తప్పిన విషయం వారికి అనుభవంలోకి వస్తోందని ఆమె చెప్పారు.