శరీర సౌష్టవానికి ప్రధానమైన కారణం క్యాల్షియం. అందుకే ప్రతి ఒక్కరూ క్యాల్షియంతో స్నేహం చేయాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మహిళలకు క్యాల్షియం ఎంతో అవసరం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో క్యాల్షియం ఏ ఏ పదార్థాలనుంచి మన శరీరానికి అందుతోందనేది తెలుసుకోవాలి. పిల్లలకు చిన్నప్పటినుంచే తల్లులు రోజుకు రెండు మూడుసార్లు పాలు త్రాగిస్తుంటారు. పిల్లలకు పాలను ఇవ్వడంవలన వారి ఎదుగుదలకు దోహదపడుతుంది.
గతంలో చదువుకోలేని గ్రామీణ సాధారణ మహిళలుకూడా పిల్లవానికి పాలనిచ్చేందుకు తహతహలాడేవారు. పాలతో పిల్లవాని ఆరోగ్యం, ఎదుగుదల ఆధారపడి ఉంటాయి. పాలలో లభించే పోషకపదార్థాలు శరీరానికి ఎంతో అవసరం అంటున్నారు వైద్యులు. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంది. ఇది పిల్లల్లోని ఎముకలు, దంతాల స్వరూపం, వారి శరీర సౌష్టవం, ఆరోగ్యం తదితరాలను మెరుగుపరచేందుకు తోడ్పాటునిస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
పాలలోని క్యాల్షియం శరీరాన్ని బలపరచడమే గాకుండా గుండెజబ్బుల బారిన పడకుండా ఉండేందుకు దోహదపడుతుంది. అలాగే పాలు కిడ్నీలోని రాళ్ళనుకూడా కరిగించేస్తుంది. అలాగే మహిళల నెలవారి రుతుక్రమంలోను ఈ పాలు ఎంతో దోహదపడుతుంది.